రెండు ట్రిబ్యునళ్లు అంచనా వేసిన దానికంటే 875 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు వెల్లడి
1985–86 నుంచి 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా సీడబ్ల్యూసీ అధ్యయనం
సీడబ్ల్యూసీ అధ్యయనం శాస్త్రీయంగా లేదంటున్న నీటి పారుదల నిపుణులు
వందేళ్ల ప్రవాహాల ఆధారంగా అధ్యయనం చేస్తేనే శాస్త్రీయంగా ఉంటుందన్న నిపుణులు
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఏటేటా నీటి లభ్యత తగ్గుతోందని.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు అంచనా వేసినంత కూడా రావడంలేదని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన చెందుతుంటే.. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చెబుతోంది. కృష్ణా బేసిన్‌లో 1985–86 నుంచి 2022–23 వరకు 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై తాజాగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ బుధవారం ఆ నివేదికను విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం కృష్ణాలో 3,048.37 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ 2,130 టీఎంసీల లభ్యత ఉందని తేల్చితే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీలు ఉన్నట్లు నిర్ధారించింది. ఆ రెండు ట్రిబ్యునళ్లు నిర్ధారించిన దానికంటే అధికంగా 875 టీఎంసీల లభ్యత ఉన్నట్లుగా సీడబ్ల్యూసీ తాజాగా వెల్లడించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల సమయంలో పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాలో సీడబ్ల్యూసీ చెప్పినంతగా నీటి లభ్యత ఉండదని తేల్చిచెబుతున్నారు. కేవలం 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనాలకే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
కృష్ణా బేసిన్ ఇదీ..
మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకునే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా బేసిన్ 2,59,439 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యంలో విస్తరించింది.
ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. మహారాష్ట్రలో 26.60 శాతం, కర్ణాటకలో 43.80 శాతం, తెలంగాణలో 19.80, ఆంధ్రప్రదేశ్‌లో 9.80 శాతం కృష్ణా బేసిన్ విస్తరించి ఉంది. నదిలో కోయినా, వర్ణ, పంచ్‌గంగా, దూద్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, బీమా, తుంగభద్ర, కాగ్నా, మూసీ, మున్నేరు వంటి ప్రధాన ఉప నదులు కలుస్తాయి.
తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు..
కృష్ణా బేసిన్‌లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 843.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనివల్ల ఏటా సగటున 7,725.80 టీఎంసీల ప్రవాహం ఉంది.
ఈ 38 ఏళ్లలో గరిష్టంగా 2005–06లో 1,169.70 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 10,716.60 టీఎంసీల ప్రవాహం ఉంది. కనిష్టంగా 2018–19లో 568.38 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 5,207.50 టీఎంసీల ప్రవాహం ఉంది.
1985–86 నుంచి 2022–23 మధ్య కృష్ణాలో సగటున 3,048.37 టీఎంసీల లభ్యత ఉంది. 2025–26లో గరిష్టంగా 5,250.70 టీఎంసీల లభ్యత ఉండగా.. 2018–19లో కనిష్టంగా 1,818.70 టీఎంసీల లభ్యత ఉంది.
1985–2023 మధ్య బేసిన్‌లో సాగునీటి అవసరాలకు ఏటా సగటున 1,781.28 టీఎంసీలను వినియోగించుకున్నారు.
బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటు 96.06 టీఎంసీలు.
Comments
Please login to add a commentAdd a comment