‘కృష్ణా’లో మరో చిచ్చు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విష యంలో ఆంధ్రప్రదేశ్ మరో కొత్త వివాదాన్ని లేవనెత్తింది. గోదావరి పరీవాహకం నుంచి కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న హైదరాబాద్‌కు నీటిని తరలించడంపై అభ్యంతరం తెలిపిం ది.ఎంతసేపూ పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తరలించే గోదావరి జలాల్లో వాటా కోసం తెలంగాణ చేస్తున్న ఫిర్యాదునే పరిశీలిస్తున్నా రని... తెలంగాణ గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న జలాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని బోర్డును ప్రశ్నించింది. ‘‘తెలంగాణ హైదరాబాద్‌కు నీటి సరఫరా పేరుతో గోదావరి ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరుల నుంచి కృష్ణా బేసిన్‌కు జలాలను తరలిస్తోంది. బోర్డు ఈ అంశాన్ని పట్టించుకోకుండా పట్టిసీమపైనే దృష్టి సారించి, నీటి వాటాలు తేల్చుతోంది. ఇది మాకు ఆమోదయోగ్యంకాదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు గురువారం కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన బోర్డు వెంటనే వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయ డం కలకలం రేపుతోంది. పట్టిసీమ అంశాన్ని తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని రెండున్న రేళ్లుగా దాటవేస్తూ వస్తున్న ఏపీ సర్కారు.. తాజాగా హైదరాబాద్‌కు నీటి సరఫరా అంశా న్ని లేవనెత్తడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వినియోగ లెక్కలు పక్కనపెట్టి..
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో లభ్యతగా ఉన్న 130టీఎంసీల్లో 56టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరగా.. ఏపీ 106 టీఎంసీలు కోరింది. ఈ వివాదం ఎటూ తేలకపోవడం తో పట్టిసీమ కింద ఏపీ, మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ చేసిన వినియోగ లెక్కలను పక్కనపెట్టి.. తెలంగాణకు 43 టీఎంసీలు, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతి పాదించింది. తొలి విడతగా జనవరి 20 వరకు అవసరాల నిమిత్తం తెలంగాణకు 17 టీఎంసీలు, ఏపీకి 35 టీఎంసీలు పంచింది. తెలంగాణ కేటాయింపులో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఏఎంఆర్‌పీ కింద 4 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద 13 టీఎంసీలు ఇచ్చింది. ఏపీకి కృష్ణా డెల్టా కింద 10టీఎంసీలు, సాగర్ కుడి, ఎడమ కాల్వలకు 15 టీఎంసీలు, 3.1 టీఎంసీలు, హంద్రీనీవా కింద 7 టీఎంసీలకు ఓకే చెప్పింది.
వాడిందంతా వాడి...
ఏపీకి కేటాయించిన 35 టీఎంసీల్లో ఇప్పటి వరకు 30 టీఎంసీలను వినియోగించేసుకుం ది. వినియోగం పూర్తి కావచ్చిన సమయంలో కొత్తగా గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు జలా లను తరలింపును లేవనెత్తింది. గోదావరి నుంచి కృష్ణాకు తరలిస్తున్న నీటితోపాటు.. తెలంగాణ మైనర్ ఇరిగేషన్ కింద చేస్తున్న వినియోగాన్ని సైతం లెక్కలోకి తీసుకోవాలని బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. వాస్తవానికి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాలో మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపులున్నా... గత పదేళ్లలో సగటున 30 టీఎంసీలను మాత్రమే. ఈ ఏడాది కూడా మైనర్ ఇరిగేషన్‌లో 27 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా.. అందులో 7 టీఎంసీల మేర కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడుల ద్వారా చెరువులకు తరలించిన నీరే. అంటే 20 టీఎంసీలనే లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ చెబుతుంటే... ఏపీ మాత్రం 89.15 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలంటోంది. ఆ ప్రాతిపదికనే జలా లు పంచాలని పట్టుబడుతోంది. దీంతో వివాదం మళ్లీ మొదటికి వస్తోంది.