కృష్ణా నది జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సమర్థంగా వాదనలు వినిపించని ఏపీ
రాష్ట్ర హక్కులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
ఏపీ ప్రభుత్వం తీరుపై నిపుణుల విస్మయం
బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షిస్తే విభజన చట్టం, ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ–1956ను ఉల్లంఘించినట్లే
సర్కారు తీరు ఇలాగే ఉంటే సాగుకే కాదు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
వాదనల విషయంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
అధికారులకు దిశానిర్దేశం చేయకుండా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో, ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సర్కారు తీరు ఇలాగే ఉంటే కృష్ణా బేసిన్‌లో సాగు నీటికే కాదు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై విచారిస్తున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు.
ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు విన్పించేలా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు న్యాయవాదులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా నిర్లక్ష్యం వహిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని, జలాలను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుందంటూ 2013లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది నివేదికను ఇప్పటి విచారణలో చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తావించలేదు.
ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ–1956లో సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. దీనినీ వాదనల్లో వినిపించి ఉంటే ట్రిబ్యునల్ నిర్ణయం మరోలా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను ఆ ట్రిబ్యునలే ఉల్లంఘించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పలేకపోయిందని ఆక్షేపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన వాదనల వల్లే సెక్షన్–3 కింద కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన అదనపు విధి విధానాల మేరకు కృష్ణా జలాల పంపిణీపై ముందుగా వాదనలు వింటామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేస్తున్నారు.
నాడే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల పంపిణీకి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపిణీకి ఎంచుకున్న న్యాయ సూత్రాలపై ముందుగా అధ్యయనం చేసిన ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తీర్పు ఇచ్చింది. ‘ఫస్ట్ ఇన్ టైమ్ ఫస్ట్ ఇన్ రైట్ (మొదటి ప్రాజెక్టు నిర్మించి నీటిని వినియోగించుకున్న వారికే మొదటి హక్కు)’ న్యాయసూత్రంగా నిర్దేశించుకుంది. చారిత్రక ఒప్పందాలు, వినియోగాల ప్రాతిపదికగా 1951 నాటికే పూర్తయిన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెపెంబరు మధ్య పూర్తయిన ప్రాజెక్టులు, 1960 సెప్టెంబరు తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా వర్గీకరించి నీటిని కేటాయించింది.
కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్కకట్టింది. ఆ ప్రాతిపదికన మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో అప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ 749.16 టీఎంసీలను కేటాయించింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు, ఆవిరి నష్టాల రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలు, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది.
వాటిని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే.. రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాకు 387.34 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ఆధునికీకరణలో మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణలోని బీమా ఎత్తిపోతలకు కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కుతాయి. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.
పునఃపంపిణీ చట్టవిరుద్ధం
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఇక విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)ఈ–4 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. దీన్ని బట్టి చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. దానిప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా అంటే 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపైనే ప్రస్తుతం ఆ ట్రిబ్యునల్ విచారణ చేయాలి.
అందులోనూ తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను తుది నివేదికలో కేటాయించినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించింది. వీటిని మినహాయిస్తే మిగతా 165 టీఎంసీల కేటాయింపులో విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాధాన్యత ఇవ్వాలి.
కానీ.. ఇందుకు భిన్నంగా సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల పునఃపంపిణీపై విచారణ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు.
అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ) – 1956 సెక్షన్ 6(2) ప్రకారం.. నదీ జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. ఆ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఆ మేరకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపుల జోలికి వెళ్లడంలేదు. ఆ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుంది.
– కేంద్ర ప్రభుత్వానికి 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టీకరణ
Comments
Please login to add a commentAdd a comment