డెల్టాకు ఆల్‌మట్టి | Delta half injustice | Sakshi
Sakshi News home page

డెల్టాకు ఆల్‌మట్టి

Published Sat, Nov 30 2013 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

Delta half injustice

వరికి ఇక ఉరే..
 =బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పర్యవసానం
 =డెల్టా రైతన్నకు తీరని అన్యాయం
 =వాదనలు సమర్థంగా వినిపించ లేకపోయిన ప్రభుత్వం

 
 ఇది కృష్ణాడెల్టాకు
 గుండెకోత.. వరి సిరులు పండించే మాగాణులను బీళ్లుగా మార్చే తీర్పు..మన పాలకుల నేరపూరిత అసమర్థ నిర్వాకానికి తరతరాలు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి.. అంతర్జాతీయ నదీజలాల పంపిణీకి అనుసరించే సహజ న్యాయసూత్రాలకు సమాధి కడుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల పంపిణీపై ఇచ్చిన తీర్పు డెల్టా అన్నదాతకే కాదు ప్రతిఒక్కరికీ తీరని శాపంగా, శోకంగా మారింది. మిగులు జలాల హక్కును హరించింది. మునేరు, పాలేరు వరదనీటిని మిగులుజలాలుగా చూపి తీరని అన్యాయం చేసింది. ఆల్మట్టి ఎత్తుపెంపును సమర్థించి జనం నోటమట్టికొట్టింది. ఈ తీర్పుపై జిల్లా ఒక్కసారిగా భగ్గుమంది.
 
సాక్షి, విజయవాడ : కృష్టాడెల్టాను ఎడారిలా మార్చే తీర్పుతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జిల్లావాసులకు తీరని అన్యాయం చేసింది. డెల్టాలోని 13లక్షల ఎకరాల్లో వరికి ఉరి వేస్తూ అన్నదాతల తలరాతను తలకిందులు చేసేలా తయారైంది. ఈ తీర్పుపై జిల్లావాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ఉదాసీన వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు, సాగునీటిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే నిరసన వ్యక్తంచేస్తూ వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ కాళేశ్వరరావు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు.
 
నాగార్జునసాగర్ దిగువభాగంలోని పరీవాహక ప్రాంతంలో మునేరు, పాలేరు ఉప నదుల నుంచి వచ్చే 50టీఎంసీల నీటిని నికర జలాలుగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ లెక్కగట్టడం అర్థరహితమని పలువురు రైతు నాయకులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరదలు వచ్చే సమయంలోనే ఈ రెండు ఉపనదుల నీరు కృష్ణా నదిలోకి చేరుతుంది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల కన్నా ఎక్కువ నీరు నిల్వ చేసే అవకాశం లేదు. అందువల్ల ఈ రెండు ఉపనదుల నుంచి వచ్చే నీరు వృథాగా సముద్రంలోకి పోవడమే తప్ప డెల్టాకు ఏ విధంగానూ ఉపయోగపడవు. ఇప్పటి వరకూ అటువంటి దాఖలాల్లేవు.

ఈ నేపథ్యంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల కృష్ణాడెల్టాకు జూన్, జూలై నెలల్లో నీరు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. దీంతో వరినాట్లు ఆలస్యమవుతాయి. ఫలితంగా నవంబరు, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్లకు పంట చేతికి రాకుండాపోతుంది. ఈ ఏడాది ఆలస్యంగా నీరివ్వడంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. పై-లీన్, హెలెన్, లెహర్ వరుస తుపాన్లు వచ్చి రైతన్న వెన్నువిరిచిన విషయం తెలిసిందే. మిగులు జలాలపై పూర్తిహక్కు ఉన్నప్పుడే 2002, 2003 సంవత్సరాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో 20 లక్షల ఎకరాల్లో భూములు బీళ్లుగా మారాయి. ఈ తీర్పుతో డెల్టాలో సాగు ఒకటి రెండు నెలలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల డెల్టాకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం తలె త్తుతుంది.
 
దశాబ్దాలుగా తీరని కలగా ఉన్న పులిచింతల ప్రాజెక్టు పనులు వైఎస్ అధికారంలోకి వచ్చే వరకూ ప్రారంభం కాలేదు. ఆయన మృతితో ఆ పనులు నత్తనడక సాగుతూ ఇంకా పూర్తికాలేదు. అదే విధంగా బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల నీరు కూడా ప్రస్తుతం నిల్వ ఉండడంలేదు. ఎన్టీటీపీఎస్‌కు నీటి సరఫరాకు బ్యారేజీలో 12 అడుగులు నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీంతో బ్యారేజీలో పూడిక చేరి మట్టిదిబ్బలు ఏర్పడ్డాయి. వాటిని తొలగించకపోవడంతో ప్రస్తుతం 1.8 టీఎంసీలే నిల్వ ఉంటున్నాయి. వర్షాభావం, పైనుంచి నీరు రాకపోవడం వల్ల భూగర్బజలాలు తగ్గిపోతున్నాయి. దీంతో సముద్రపునీరు చొచ్చుకొచ్చి డెల్టాలోని చాలా భాగం ఉప్పుతేలి పంటలు పండని పరిస్థితి పొంచి ఉంది. బోర్ల కింద సాగుకు దెబ్బతింటుంది.
 
ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల డెల్టా రైతునోట్లో మట్టికొట్టినట్లయింది. ఈ తీర్పు ఆ ఎత్తు పెంచడాన్ని సమర్థించి డెల్టా రైతుకు తీరని అన్యాయం చేసింది. 2003-04లో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితు ఏర్పడగా ఆల్మట్టిలో 137 టిఎంసీల నీరు ఉన్నా 10 టిఎంసీలు విడుదలచేయలేదు. భవిష్యత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండదని గ్యారెంటీ లేదు. 1956లో అంతరాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం ఏర్పాటుచేసిన ఈ ట్రిబ్యునల్ జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ 85 ఏళ్లలో ఎంత ప్రవాహం ఉందో లెక్కగట్టి 75శాతం డిపెండబులిటీని ఆధారంగా చేసుకుని మూడు రాష్ట్రాలకు నదీజలాలను పంచింది.

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 47 ఏళ్ల ప్రవాహాన్ని గమనంలోకి తీసుకుని 65 శాతం డిపెండబులిటీని లెక్కించడం అశాస్త్రీయమనే వాదన వ్యక్తమవుతోంది. ఈ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు ఇచ్చినప్పుడు దీన్ని సమీక్షించేందుకు అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు నేతృత్వంలో ఒక కమిటీని కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి ముందుకు పలు సూచనలు చేసింది. ఉత్తరాది రాష్ట్రాలలో నీటిపంపిణీకి సంబంధించిన తీర్పులలో ప్రాజెక్టులలో సిల్ట్ మేనేజ్‌మెంట్ (పూడిక నిర్వహణ)అనే పద్ధతిని అవలంబిస్తున్నాయి.

ప్రాజెక్టులలో పూడిక ఏర్పడటం వల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినా వాటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. ఈ అంశాలన్నింటినీ రివ్యూ పిటిషన్‌లో చేర్చాలని నిపుణుల కమిటీ సూచించింది. దీనిపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. ట్రిబ్యునల్ ముందు సరైన పద్ధతిలో వాదించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. సరైన వాదనలు వినిపించనందున నష్టం వాటిల్లిందని దుయ్యబడుతున్నారు.
 
 డెల్టా  రైతాంగానికి శరాఘాతం
 కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు డెల్టా రైతాంగానికి శరాఘాతంలా ఉంది. ఈ తీర్పులో కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్‌కు లేదని చెప్పడం డెల్టా రైతాంగానికి గొడ్డలిపెట్టులాంటిది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుకోవచ్చని తీర్పునివ్వడం దారుణం. ఈ తీర్పుతో అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుంది. ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిపుణులైన న్యాయవాదులను ఏర్పాటుచేసి బలమైన వాదనలు వినిపించడంవల్లే మనకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం నిపుణులైన న్యాయవాదులను నియమించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ తీర్పు వల్ల కృష్ణాడెల్టాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడో కృష్ణా డెల్టాకు సాగునీరందించేందుకు విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందనే కాటన్ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించి తక్షణమే అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని నిర్వహించి చర్చించాలి. కృష్ణా మిగులు జలాలపై మనకున్న హక్కులను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టులో పోరాడాలి. నిపుణులైన న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేలా  సీఎం చర్యలు తీసుకోవాలి.
 - వసంత నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు
 
 డెల్టాకు తీరని అన్యాయం
 గతంలో ఇచ్చిన తీర్పునకే బ్రిజేష్ కమిటీ కట్టుబడి ఉన్నట్టుంది. డెల్టా రైతుల ఆందోళన, గోడును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు అనుమతివ్వడం డెల్టాకు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే కర్ణాటకలో రిజర్వాయర్లు నిండిన తరువాత డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల పంటల సాగుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ తీర్పుతో డెల్టా భూములకు సరైన సమయంలో నీరందక సకాలంలో పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. డెల్టా రైతాంగం తరఫున సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు వేసి ఉన్నాం. అక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర విభజనకు ముందే డెల్టాకు సరిగా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. విభజన జరిగి, కమిటీ తీర్పు అమలైతే డెల్టాలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
 - మండలి బుద్ధప్రసాద్,  రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్
 
  కిరణ్ అసమర్థతే కారణం
 సీఎం కిరణ్ అసమర్థత వల్లే తెలుగు ప్రజలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రూపం లో ప్రమాదం ముంచుకొచ్చింది. గతంలో మధ్యంతర ఉత్తర్వుల్లో ఏవైతే ఆదేశాలున్నాయో దాదాపు ప్రస్తుత తీర్పులోనూ అవే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 సవరణలకు విజ్ఞప్తి చేస్తే ఒకదానిపై కూడా న్యాయం చేయకపోవడం దారుణం. ఆంధ్రపదేశ్ అభ్యంతరాలను పట్టించుకోకుండా కర్ణాటకకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రంలోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతం మొత్తం తీవ్ర ప్రమాదంలోకి వెళ్లనుంది. ఎగువ ప్రాజెక్టులలోని నీరు దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు విడుదలయ్యేలా ఒత్తిడి తేవాల్సి ఉంది. డిపెండబిలిటీ 65 శాతం కాకుండా 75 శాతం ఉండాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంది.  ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థనీయమైన లాయర్లను నియమించి మిగులు జలాల్లో న్యాయం జరిగేలా పోరాడాలి.
 - సామినేని ఉదయభాను,  వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్
 
 సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం

 బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం. మిగులు జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, నష్టం జరగనుంది. రాష్ట్రం విడిపోతే ఇలాంటి సమస్యలు అనేకం వస్తాయనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నాం.  తీర్పును, జలాల సమస్యను రాజకీయం చేయవద్దు. ఆల్‌మట్టి నిర్మాణం ఎత్తు పెంపు, మిగుల జలాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ముడిపెడుతూ ఆరోపణలు చేయటం సరికాదు. వాస్తవాలు తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలి. ట్రిబ్యునల్‌లో వాదించే న్యాయవాదులను కాంగ్రెస్ మార్చటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించటం మంచి పద్ధతి కాదు.                               

- కొలుసు పార్థసారథి, రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి
 
 అసమర్థ వాదన వల్లే అన్యాయం

 బ్రిజేష్‌కుమార్ తుది తీర్పు రైతాంగ ప్రయోజనాలను తీవ్రంగా నష్టపరిచేలా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయతను ప్రామాణికంగా తీసుకున్న అంశాన్ని అలా ఉంచి కర్ణాటక రాష్ట్రానికి ఎక్కువ కేటాయించాలనే ఆలోచనతో 65 శాతం విశ్వసనీయతను తీసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ప్రభుత్వం తరఫున నియమితులైన న్యాయవాదుల అసమర్థ వాదన కారణంగానే తీర్పులో గెలవలేకపోయాం. ఏడాది క్రితం ప్రాథమిక తీర్పు వెలువరించిన అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, రైతుసంఘ నాయకులం వెళ్లి ప్రభుత్వానికి సమర్థవంతమైన లాయర్లను పెట్టాలని సూచించాం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక తీర్పులో ఓడిన లాయర్లనే మళ్లీ నియమించారు. ఈ చర్య వల్లే తీర్పులో పూర్తిగా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థనీయమైన లాయర్లను నియమించి మిగులు జలాల్లో న్యాయం జరిగేలా పోరాడాలి.
 - వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి
 
 మన రైతులకు ఇబ్బందే..
 గతంలో మాదిరిగా మిగులు జలాలను వాడుకునే సౌకర్యం లేకపోవటం మన రైతులకు ఇబ్బందే. నికర జలాల విషయంలో కృష్ణా జలాలు 456 టీఎంసీలు మనకు వచ్చిన తరవాతే ఎగువ రాష్ట్రం వాడుకోవాలని చెప్పటం ఊరటనిచ్చే అంశం. ఆల్‌మట్టి ఎత్తు పెంచినప్పుడు మూడేళ్ల క్రితం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పటం జరిగింది.
 - యెర్నేని నాగేంద్రనాధ్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement