ఆర్బీకే ఛానల్ లో ప్రసారం చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న విదేశీ ప్రతినిధి బృందం సభ్యులు ( ఫైల్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది.
ఫలితంగా తక్కువ కాలంలోనే రైతులు ఆర్బీకే ఛానల్‌పై అధిక సంతృప్తి కనపరుస్తున్నారు. సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండడంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్లుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా ఛానల్ అనతి కాలంలోనే అన్నదాతలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారి మన్ననలు చూరగొంటోంది. ప్రారంభించి మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే 2.75లక్షల సబ్ స్క్రిప్షన్, 55 లక్షల వ్యూయర్ షిప్‌తో దూసుకుపోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ‘ఆర్‌బీకే’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూ ట్యూబ్ ఛానల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తుండగా.. పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నీతి ఆయోగ్, ఐసీఎఆర్, ఆర్‌బీఐ వంటి జాతీయ సంస్థలకే కాదు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్‌ఏఒతోపాటు వివిధ దేశాల ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఛానల్‌ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు.
ఎస్‌ఎంఎస్ ద్వారా రైతులకు సమాచారం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగులో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేసింది. రైతుల అభ్యుదయ గాథలు, ఆదర్శ రైతుల అనుభవాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ప్రసారం చేస్తున్నారు.
అలాగే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు రైతులందరికీ తెలిసేలా రైతు గ్రూపులతో ఛానల్ ద్వారా ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిసున్నారు. ఏ రోజు ఏ శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయో? ఆర్బీకేల ద్వారా ప్రసారం చేసున్నారు. ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుండడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షిస్తున్నారు.
1,628 వీడియోలు.. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు
ఆర్బీకే ఛానల్ కోసం ప్రత్యేకంగా గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌లో మూడేళ్ల క్రితం డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేసింది. డిజిటల్ రంగంలో విశేష అనుభవం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. క్షేత్ర స్థాయిలో ఆదర్శ, అభ్యుదయ రైతులు సాధిస్తోన్న విజయాలపై ఇంటరŠూయ్వలు, డాక్యుమెంటరీలు రూప కల్పన కోసం ప్రత్యేకంగా అవుట్ డోర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసారు.
శాఖల వారీగా అప్‌లోడ్ చేస్తున్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 599 వ్యవసాయ, 589 ఉద్యాన, 257 పశు సంవర్ధక, 97 మత్స్య, 13 పట్టు శాఖలకు చెందిన వీడియోలతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 73 వీడియోలు కలిపి ఇప్పటి వరకు 1,628 వీడియోలను అప్‌లోడ్ చేశారు. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలను చేసారు. ఛానల్‌ను 2.75లక్షల మంది సబ్ స్క్రిప్షన్ చేసుకోగా, జనవరి 4వ తేదీ నాటికి అప్‌లోడ్ చేసిన వీడియోలు, ప్రసారాలను 54,67,079 మంది వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ లభించడం గొప్ప విషయమని చెబుతున్నారు.
ఆర్‌బీకే ఛానల్ ద్వారా ఎంతో మేలు
‘ఆర్‌బీకే చానల్’ చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే వీడియోలను రెగ్యులర్‌గా వీక్షిస్తుంటాను. సీజన్‌లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు నిల్వ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలి. సాగులో సందేహాలనే కాకుండా.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం ప్రభుత్వ పరంగా చేపట్టడం నిజంగా ప్రశంసనీయం. –నందం రఘువీర్, మొక్కల జన్యు రక్షక్షుకుని అవార్డు గ్రహీత, పెనమూలురు, కృష్ణ జిల్లా
రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్
రైతు ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్‌కు వ్యూయర్‌షిప్ అరకోటి దాటడం నిజంగా గొప్ప విషయం. సాగులో సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తోన్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛానల్ ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం. రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్నారు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment