సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతూ అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్–3 కింద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణపై ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంబించనుంది. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా మినిట్స్ రూపంలో వెలువడ్డాక... దానిలో కేంద్రం ఇచ్చే హామీల ఆధారంగానే పిటిషన్ ఉపసంహరించుకోవాలనే యోచనలో ఉంది. సెక్షన్–3 కింద దాఖలు చేసుకున్న పిటిషన్‌ను రాష్ట్రం ఉపసంహరించుకుంటే తెలంగాణ వినతిని కొత్త ట్రిబ్యునల్‌కు లేక ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌కు రిఫర్ చేస్తామని స్పష్టమైన హామీ పొందాకే ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అవసరాలపై వాదనలు వినిపించే అవకాశం రాలేదు. పరవాహకం, ఆయకట్టు ఆధారంగా చూసినా రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాల్సి ఉంది. ఈ దృష్ట్యా కృష్ణా జలాల్లో న్యాయం జరిగేలా కొత్త ట్రిబ్యునల్‌తో పునః విచారణ చేయించండని రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే సెక్షన్–3ను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని కోరింది. దీనిపై ఏడాదిలోగా నిర్ణయం చేయాల్సి ఉన్నా కేంద్రం ఇంతవరకూ స్పందించలేదు. ఏడాది వేచిచూశాక ఈ అంశంపై తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదే విషయాన్ని అపెక్స్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్ సెక్షన్–3పై సుప్రీంలో పిటిషన్ ఉన్నందున... ట్రిబ్యునల్‌కు రిఫర్ చేసే అంశం న్యాయ పరిధిలోకి వస్తుందని, తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకుంటే న్యాయ సలహా మేరకు కొత్త ట్రిబ్యునల్ లేదా ప్రస్తుత ట్రిబ్యునల్‌తో విచారణ చేయించేలా నిర్ణయం చేస్తామని హామీ ఇచ్చారు.
అపెక్స్ భేటీ అనంతరం మీడియా సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. బుధవారమే కేసు విత్‌డ్రా చేసుకుంటానని తెలంగాణ సీఎం చెప్పారంటూ షెకావత్ ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకుంటుందా? అన్న దానిపై అందరి దృష్టి పడింది. అయితే దీనిపై అధికారవర్గాలను కదిలించగా అపెక్స్‌లో కేంద్రం ఇచ్చిన హామీ అధికారికంగా మినిట్స్ రూపంలో రాష్ట్రానికి అందాల్సి ఉందని, అందులో విస్పష్టమైన హామీ ఉంటే పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరమేమీ లేదని తేల్చిచెప్పారు. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
గోదావరి ట్రిబ్యునల్‌పై మౌనమే?
ఇక, గోదావరి నదీ జల వివాదాల పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఇరురాష్ట్రాల నుంచి వినతులు వస్తే ఏడాదిలోపు నిర్ణయం చేస్తామని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. అయితే గోదావరిలో నీటి వినియోగం, వాటాలకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ అంటోంది. నికర జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందని, ఆ వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెబుతోంది. నికర జలాల వాటా 65 శాతం ఉండగా అదే నిష్పత్తిలో వరద జలాలను వినియోగించుకుంటామని అంటోంది. ఈ లెక్కన ఏడాదిలో గోదావరిలో సగటున 3 వేల టీఎంసీల వరద ఉన్నా తెలంగాణకు 1900 టీఎంసీల మేర వరద జలాలపై హక్కు ఉంటుందని చెబుతోంది. గోదావరిలో నీటి వాటాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా చెప్పినందున కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ ఎలాంటి లేఖలు రాయబోమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్డుల పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కృష్ణా (కేఆర్‌ఎంబీ), గోదావరి (జీఆర్‌ఎంబీ) నదీ జలాల యాజమాన్య బోర్డులు బుధవారం సమావేశమై వర్కింగ్ మాన్యువల్‌పై చర్చించాయి.
Comments
Please login to add a commentAdd a comment