9 విధివిధానాలు | Krishna tribunal of inquiry 'ruling finalized paridhini | Sakshi
Sakshi News home page

9 విధివిధానాలు

Published Thu, Jan 8 2015 1:46 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

9 విధివిధానాలు - Sakshi

9 విధివిధానాలు

  • కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ‘పరిధి’ని తేల్చడానికి ఖరారు
  •  కృష్ణా జలాలను 4 రాష్ట్రాలకు మళ్లీ కేటాయించాలా?
  •  కేవలం ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకే జరిపితే సరిపోదా?.. విధివిధానాలపై ప్రతిపాదనలు అందజేసిన నాలుగు రాష్ట్రాలు
  •  నీటి లభ్యతను మళ్లీ అంచనా వేయాలన్న ఏపీ
  •  అసహనం వ్యక్తంచేసిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్
  •  కొత్తగా లెక్కించాల్సిన అవసరమేంటని వ్యాఖ్య
  •  సుదీర్ఘ చర్చ అనంతరం ముసాయిదాపై ఆదేశాలు జారీ..  ఫిబ్రవరి 25 నుంచి తుది వాదనలు, అనంతరం ట్రిబ్యునల్ పరిధి, విస్తృతి ఖరారు
  • సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ విచారణ పరిధిని తేల్చడానికి తొమ్మిది విధివిధానాలు ఖరారయ్యాయి. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం  కృష్ణా జలాలను ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయించాలా లేక కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే కొత్త కేటాయింపులు జరపాలా అన్న కీలకాంశంపై నిర్ణయం తీసుకునే క్రమంలో ఈ ముందడుగుపడింది. ఇందుకోసం ముసాయిదా విధివిధానాలను జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ రూపొందించింది. వీటిపై వచ్చే నెల 25 నుంచి మూడు రోజుల పాటు ట్రిబ్యునల్‌లో వాదనలు జరగనున్నాయి.

    నదీ పరీవాహకంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు విన్న తర్వాత తుది విధివిధానాలను ట్రిబ్యునల్ ఖరారు చేస్తుంది. బుధవారం ఢిల్లీలోని కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్‌లో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత నెలలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు నాలుగు రాష్ట్రాలు ఈ సందర్భంగా ముసాయిదా విధివిధానాలను సమర్పించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అఫిడవిట్ ఇవ్వలేదు. దీంతో రాష్ట్రాల అభిప్రాయాలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్.. అన్ని రాష్ట్రాల ముసాయిదాలను క్రోడీకరించి 9 విధివిధానాలను ఖరారు చేసింది.

    కాగా ఈ జాబితాలో ‘నీటి లభ్యతను కొత్తగా లెక్క కట్టాలి’ అన్న అంశాన్ని చేర్చాలని ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. అయితే దీనిపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ కొంత అసహనం వ్యక్తంచేశారు. ఇదివరకే నీటి లభ్యతను లెక్కించినప్పుడు.. ఇక కొత్తగా లెక్కించాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. ఏపీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, గుంటూరు ప్రభాకర్ కూడా వాదనలు వినిపించారు. అలాగే ట్రిబ్యునల్ పరిధి, విధివిధానాలపై తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, రవీందర్‌రావు, కర్ణాటక తరఫున అనిల్ దివాన్, మహారాష్ట్ర తరఫున అంధ్యార్జున తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.
     
    ఖరారైన ముసాయిదా విధివిధానాలు

    1.   ఇప్పటివరకు బ్రిజేష్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు జరిపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కొత్తగా వివాదం తలెత్తిన రాష్ట్రాల కోసం నదీ జలాల చట్టంలోని సెక్షన్ 5(3)ప్రకారం తిరిగి కేంద్ర ప్రభుత్వం తదుపరి సూచన చేయాలా?
     
    2. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీజలాల కేటాయింపు జరపాల్సి ఉంది. అయితే గత కేటాయింపును నోటిఫై చేయకుండా ఈ కేసును పదే పదే తెరవడం ద్వారా ప్రయోజనం ఉందా?
     
    3. రెండు కొత్త రాష్ట్రాలకే పరిమితమై వాటి పరిధిలోని ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలా లేక నాలుగు రాష్ట్రాలకు తిరిగి కేటాయించాలా? తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్ రెండు కొత్త రాష్ట్రాలకే పరిమితం కావాలా లేక నాలుగు రాష్ట్రాలకా?
     
    4. ఏపీ విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ విచారణ పరిధి, విస్తృతి, విధివిధానాలను నాలుగు రాష్ట్రాలకు వర్తింపజేయాలా లేక ఏపీ, తెలంగాణలకే పరిమితం చేయాలా?
     
    5.    డిసెంబర్ 13, 2010 నాటి అవార్డు, నవంబర్ 29, 2013 నాటి తుది అవార్డుల్లో ఏపీకి కేటాయించిన నీటి కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని రెండు కొత్త రాష్ట్రాలకే నీటి కేటాయింపులు జరపాలా?
     
    6. కొత్త రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ, నియంత్రణకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85(ఎ), 85(ఇ) ప్రకారం ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇప్పటివరకు ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం పనిచేయాలా లేక తిరిగి జరిపే కేటాయింపుల ప్రకారం పనిచేయాలా?
     
    7. మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపకుండా.. కేవలం తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులకే కేటాయింపులు జరిపితే ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా?
     
    8. తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టులవారీగా నీటి విడుదలకు ఆపరేషన్ ప్రొటోకాల్ ఎలా ఉండాలి?
     
    9. ట్రిబ్యునల్ గత రెండు అవార్డులు నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్ 6 ప్రకారం గెజిట్‌లో నోటిఫై కాలేదు. దీనిపై సుప్రీంలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఆ రెండు అవార్డులను ‘ఫైనల్ అండ్ బైండింగ్’గా పరిగణించగలమా?
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement