availability of water
-
నదీ జలాల లభ్యతపై అధ్యయనం
సీడబ్ల్యూసీ అధికారులకు ఎన్ఆర్ఎస్సీలో ముగిసిన శిక్షణ వచ్చే ఏడాది జూలైలోగా 19 బేసిన్లలో నీటి లభ్యతపై నివేదిక సాక్షి, హైదరాబాద్: దేశంలోని 19 నదీ బేసిన్లలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేస్తోంది. బ్రహ్మపుత్ర, కావేరి, మహానది, నర్మద, యమున వంటి ప్రముఖ నదులతో పాటు కృష్ణా; గోదావరి బేసిన్ల్లో నీటి లభ్యతను తెలుసుకునేందుకు కేంద్ర జలసంఘం కసరత్తు వేగిరం చేసింది. నీటి లభ్యతపై కచ్చితమైన అంచనా కోసం నేషన ల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) సహకారం తీసుకుంటున్న సీడబ్ల్యూసీ ఇప్పటికే ఎంపిక చేసిన అధికారులకు శిక్షణ సైతం ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఎన్ఆర్ఎస్సీలో ఈ నెల 5 నుంచి మొదలైన శిక్షణ కార్యక్రమాలు 9తో ముగిశాయి. శిక్షణ పొందిన అధికారులు సోమవారం నుంచి వారికి నిర్దేశించిన బేసిన్ల పరిధిలో అధ్యయనం మొదలు పెట్టనున్నారు. నిజానికి నదుల్లో నీటి లభ్యతపై 1993లో ఒకమారు, ఆ తర్వాత 1998లో మారోమారు అధ్యయనం జరిగింది. అప్పటి లెక్కలనే ఇప్పటికీ పరిగణనకు తీసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. నదుల్లో నీటి లభ్యతపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధ్యయనం జరగాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. దీంతో నీటి వినియోగం విషయంలో అంతర్రాష్ట్ర వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి లభ్యత లెక్కలను కొత్తగా తేల్చాలని సీడబ్ల్యూసీ నిర్ణరుుంచింది. దీంతో పాటే నదుల పరీవాహక పరిధిలో గడచిన 30 ఏళ్లుగా నమోదైన వర్షపాతం, పరీవాహక పరిధిలో వాతావరణంలో మార్పులు, భూగర్భజలాల పరిస్థితి, సాగు విస్తీర్ణంపై లెక్కలన్నింటినీ ఎన్ఆర్ఎస్సీ సహకారంతో శాటిలైట్ చిత్రాలను తీసి, వచ్చే ఏడాది జూలై నాటికి కచ్చితమైన అంచనాలు తయారు చేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఈ లెక్కల ఆధారంగా భవిష్యత్తులో నదుల అనుసంధానం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి, అంతర్రాష్ట్ర నదీ బేసిన్ల మధ్య వివాదాలను పరిష్కాలను పరిష్కరించాలని భావిస్తోంది. -
నీటి లభ్యత ఇప్పుడేమైంది..?
తమ్మిడిహెట్టి నీటి లభ్యతపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నలు సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని తమ్మిడిహెట్టి వద్ద ఏడేళ్ల కింద 160 టీఎంసీలుగా ఉన్న గోదావరి జలాల నీటి లభ్యత.. తర్వాతి కాలంలో ఎక్కడికి పోయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స ప్రశ్నించింది. 2007లో ఇంజనీర్లు, సలహాదారులు అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసి నీటి లభ్యతపై నివేదికలు ఇచ్చారని, ప్రస్తుతం అదే ఇంజనీర్లు, సలహాదారులు నీటి లభ్యత లేదంటూ మరో నివేదిక ఇవ్వడం విడ్డూరంగా ఉందంది. ఈ ఏడేళ్లలో ప్రాణహిత కింద రూ.12,333 కోట్లు ఖర్చు చేశారని, రూ.1,937 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చారని, ఇవన్నీ ఇప్పుడు వృథా అయ్యాయని ఆరోపించింది. ప్రజాధనం వృథా అవ్వడానికి కారకులైన ఇంజనీర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, సలహాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆర్థిక దుర్వినియోగంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో, లేదా ఉన్నత స్థారుు కమిటీతో విచారణ చేపట్టాలని కోరింది. మంగళవారం ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి విలేకరుల సమావేశంలో మట్లాడారు. ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడె టెరుుల్పాండ్ల పనులను రూ.వేల కోట్లతో ఆరంభించి మధ్యలో నిలిపివేసిందని, దీని వల్ల రూ.2,250 కోట్లు వృథా అయ్యాయని తెలిపారు. మొత్తంగా ఇంజనీర్ల తప్పుడు నిర్ణయాలతో రూ.14,483 కోట్లు వృథా చేశారని ఆరోపించారు. అవసరమున్నా లేకున్నా అడ్వాన్సులు అవసరమున్నా లేకున్నా ఇంజనీర్లు మొబిలైజేషన్ అడ్వాన్సుకు రికమండ్ చేయడం, దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆమోదం తెలపడం ద్వారా అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.3,644 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారని, ఇందులో రూ.2,735 కోట్లు తిరిగి రాబట్టగా.. రూ.909 కోట్లు మొండి బకారుుగా ఉందని తెలిపారు. -
మీ బండారం బయటపెడతాం
కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం మీ హయాంలోని పాపాలను అసెంబ్లీలోనే చెబుతాం మహారాష్ట్రతో ఒప్పందంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువేనని సీడబ్ల్యూసీ నాడే చెప్పింది అయినా వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? హైదరాబాద్: ‘‘గోదావరి జలాలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం విషయంలో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు ఆడుతోంది. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. సాగునీరు తెచ్చేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అవాస్తవాలు, అబద్ధాలు చెబుతున్నారు. మీ పాపాలను, తప్పులను అసెంబ్లీలోనే వివరిస్తాం. మీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాటలు దొంగే దొంగ అన్నట్లు ఉందని దుయ్యబట్టారు. ఏపీ, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ఎందుకు చొరవచూపలేదని నిలదీశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘‘152 మీటర్ల కంటే తక్కువ ఎత్తుకు ఒప్పందం చేసుకున్నారని లేనిపోని ప్రచారం చేస్తున్నారు. అసలు మీరు 152 మీటర్ల ఎత్తుతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమన్నా ఉంటే ఆ కాగితాలు తీసుకు రండి. అప్పుడు మేం ఎంత ఎత్తుకు అగ్రిమెంట్ చేసుకున్నామో చెబుతాం..’’ అని అన్నారు. ‘‘ప్రాజెక్టుకు సంబంధించి 2007లో మొదటి జీవో విడుదల చేశారు. 2014 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఏడేళ్ల కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదో ఆ పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి సమాధానం చెప్పాలి. ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తును మీకు మీరే ఊహించుకుని కడుతున్నారు. కనీసం మాతో మాట్లాడలేదు..’ అని అప్పటి మహారాష్ట్ర సీఎం ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినా.. అందులో ఎక్కడా 152 మీటర్లని ప్రస్తావించలేదు. కేవలం 2009 ఎన్నికల ముందు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అన్న విషయం కూడా విస్మరించి.. మహారాష్ట్రతో మాట్లాడకుండా 152 మీటర్ల ఎత్తును ఊహించుకుని పనులు మొదలు పెట్టారు’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం 25 ప్యాకేజీలకు ఒకే సారి టెండర్లు పిలిచారని, కానీ ఏడేళ్లలో బ్యారేజీ పనులు మాత్రం మొదలు పెట్టలేదన్నారు. ఎలాంటి సూత్రప్రాయ అంగీకారం కూడా లేకుండానే ప్రాజెక్టు మొదలును (హెడ్) వదిలిపెట్టి చివరన (టెయిల్) పనులు చేశారని విమర్శించారు. సీడబ్ల్యూసీ నాడే లేఖ రాసింది తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసిందని, ఇందులో 70 నుంచి 75 శాతం కూడా నీటిని డ్రా చేసుకోలేరని వివరించినట్లు హరీశ్ గుర్తుచేశారు. ‘‘బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల వద్ద 5 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 148 మీటర్ల వద్ద కేవలం 1.5 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంటుంది. ఇక నీళ్లెలా తీసుకుంటారు? దీంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం లేదని సీడబ్ల్యూసీ చెప్పినా.. వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదు. జలాశయాల డిజైన్ సరిగా లేదు. 11 టీఎంసీల డెడ్ స్టోరేజీ పోతే కనీసం 7 టీఎంసీల నీరు కూడా ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లివ్వని ప్రాజెక్టులు చేపట్టారు. దేవాదులకు కూడా బ్యారేజీ లేదు’’ అని పేర్కొన్నారు. తాము 165 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాలు సిద్ధం చేస్తామని, మేడిగడ్డ వద్ద బ్యారేజీ వల్ల 300 రోజులు నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుందని, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, ఎస్సారెస్పీ వరద కాల్వ ఆయకట్టును స్థిరీకరించవచ్చని వివరించారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ మధ్యనే 70 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లాపై మీకు ప్రేమ ఉందా? ‘‘రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ నేతలకు ప్రేమ ఉందా? 2007లో టెండర్లు పిలిస్తే 2014 వరకు పనులు ఎందుకు చేయలేదు..? 4 ప్యాకేజీల పనులకు ఒకేసారి రూ.165 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. కానీ రూ.26కోట్ల పనులు మాత్రమే చేయించారు. ఇదీ మీకున్న ప్రేమ..’’ అని హరీశ్ ఎద్దేవా చేశారు. ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు వెరసి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి
తుమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లుండాలి: జానా అందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి {పాణహిత నిర్వహణ వ్యయం ఎకరాకు రూ.36 వేలు ఇదంతా ఆయకట్టు రైతులపైనే పడుతుంది పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపులు ఎక్కడ? నీటి లభ్యత లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణమా? పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ చుక్క నీరు అదనంగా తీసుకోడానికి వీల్లేదు హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విపక్ష నేత కె.జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల రంగ నిపుణులు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారని, పారదర్శకత కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బడ్జెట్‌పై సాధారణ చర్చలో భాగంగా గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ఎత్తుతో పోలిస్తే.. కాళేశ్వరం వద్ద కేవలం 101/102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తుండడంతో అదనంగా మరో 50 మీటర్లు ఎత్తుకి నీళ్లను ఎత్తిపోయాల్సి రావడం భారం కాబోతోందన్నారు. గతంలో రూ.38,500 కోట్లు అవుతుందన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పుడు రూ.84 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం, పెట్టుబడి వడ్డీలు, విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వం భరించినా.. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం(ఓఅండ్ఎం) ఎకరాకు రూ.36 వేలు ఉంటుందని, ఇదంతా ఆయకట్టు రైతులపైనే పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఎమ్మార్పీ వెంటనే పూర్తి చేయాలి పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తోందని, శ్రీశైలం నుంచి రాష్ట్ర వాటాను పొందడానికి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలని జానారెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఒక్క చుక్క అదనంగా తీసుకోకుండా నిరోధించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాల ఆయకట్టు సాగే కష్టమని, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల కింద ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు నీరిస్తామని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరమన్నారు. సూక్ష్మ సేద్యంతో 15 వేల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పినప్పటికీ ప్రాజెక్టుల డీపీఆర్‌లో అది పొందుపర్చలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ జోక్యం చేసుకుంటూ... తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని సమాధానమిచ్చారు. పాలమూరు - రంగారెడ్డికి నీళ్లు ఎక్కడివి? కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని మిగులు జలాల్లో ఉమ్మడి ఏపీకి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన 194 టీఎంసీల్లో తెలంగాణ వాటా కింద 87 టీఎంసీలు మాత్రమే వస్తాయని జానారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 95 టీఎంసీల మిగులు జలాలపై ఆధారపడి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లకు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నించారు. నీటి లభ్యత పరిశీలించకుండానే ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్ణయం తగదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి లభ్యతపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీతో అధ్యయనం జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్లో 90 రోజుల పాటు మిగులు జలాల లభ్యత ఉంటుందనే అంచనాలపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారని, అయితే వాస్తవానికి మిగులు జలాల లభ్యత 47 రోజులు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అందులో మన వాటా లభ్యత 30 రోజులేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు లిఫ్టు సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పెంచాలన్నారు. కేటాయింపులు సరే.. ఆదాయం ఏదీ? బడ్జెట్లో ప్రభుత్వ లక్ష్యాలు, కేటాయింపులతో పోలిస్తే ప్రభుత్వ ఆదాయానికి పొంతన కుదరడం లేదని జానారెడ్డి తెలిపారు. 2014-15, 2015-16 బడ్జెట్లో కేటాయింపులకు తగ్గట్లు ఆదాయం రాకపోవడంతో వ్యయం తగ్గిందన్నారు. 2014-15 బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీలకు 34 శాతం, బీసీలకు 52 శాతం, మైనారిటీలకు 30 శాతమే నిధులు ఖర్చు చేశారన్నారు. 2016-17లో బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్లు వ్యయం చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం జీవోల వెబ్‌సైట్‌ను ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. -
ప్రాజెక్టుల అధ్యయనం షురూ!
కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిశీలన మొదలు కృష్ణా బేసిన్లో ఏరియల్ సర్వే చేసిన నిపుణుల కమిటీ నేడు గోదావరి పరీవాహకంలో పర్యటన 26, 27 తేదీల్లో నక్కలగండిని సందర్శించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటా మేరకు జలాల పూర్తిస్థాయి విని యోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రెండు నదుల్లో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల మేరకు నికర, మిగులు జలాల వినియోగం కోసం చేపట్టిన పరీవాహక ప్రాజెక్టుల స్థితిగతులపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయిస్తోంది. ప్రాజెక్టులకు వాస్తవ నీటి కేటాయింపు, లభ్యత నీరు, నిర్దేశించుకున్న ఆయకట్టు, ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన రిజర్వాయర్, పంప్‌హౌజ్‌ల నిర్మాణం తదితరాలపై నిశిత పరిశీలన చేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని, అవసరమైతే రీడిజైనింగ్ చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా రంగంలోకి దిగింది. ఇద్దరు చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ సోమవారం రెండు హెలికాప్టర్లలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పరిశీలించింది. మంగళవారం గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనుంది. పట్టుదలగా ఉన్న కేసీఆర్.. కృష్ణా బేసిన్లో 811 టీఎంసీలు, గోదావరిలో 900 టీఎంసీల మేర ఉమ్మడి కేటాయింపులున్న సంగతి తెలిసిందే. జలాలు అందుబాటులో ఉన్నా ప్రాజెక్టులు పూర్తికాని దృష్ట్యా రాష్ర్ట వాటాను పూర్తిగా వినియోగించుకోలేని పరి స్థితి నెలకొంది. గోదావరి బేసిన్ పరిధిలోని దేవాదుల(60 టీఎంసీలు), కంతనపల్లి(50 టీఎంసీలు), ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు)తో పాటు కృష్ణా పరిధిలో నెట్టెంపాడు(22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), భీమా(20టీఎంసీలు) తదితర ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల భూసేకరణ సమస్యలు ఉండగా, మరి కొన్ని చోట్ల రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల నిర్మాణంపై స్పష్టత లేదు. దేవాదుల, ప్రాణహిత విషయంలో ఒక ప్రాజెక్టు ఆయకట్టు, మరో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో చేరి అయోమయంగా మారింది. ఇక ప్రాణహిత, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల్లో పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో నీటి కేటాయింపులు ఉన్నా వినియోగం లో మాత్రం రాష్ట్రం చతికిలపడుతోంది. దీనిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టుల పూర్తికి అవసరమైతే రీ డిజైనింగ్ చేస్తామని ప్రకటించి సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని వేశారు. ప్రాజెక్టుల పరి శీలనకు ఏకంగా హెలికాప్టర్లను సైతం సమకూర్చారు. ఈ కమిటీ తాజాగా రాజోలిబండ డైవర్సన్ స్కీమ్(ఆర్డీఎస్) మొదలుకుని మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల మీదుగా నల్లగొండలోని సాగర్, కొత్తగా చేపట్టనున్న నక్కలగండి వరకు పరిశీలన జరిపింది. మంగళవారం ప్రాణహిత ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం వరకు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు మీదుగా ప్రాజెక్టుల పరిశీలన జరుపనుంది. దేవాదుల, కంతనపల్లి, వరదకాల్వ పరిసరాల్లోనూ పర్యటించి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయనుంది. పది, పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక అందజేసే అవకాశముంది. మరోవైపు ఈ నెల 26, 27 తేదీల్లో ఏదో ఒకరోజు నక్కలగండి ప్రాజెక్టును కేసీఆర్ సందర్శించనున్నారు. వచ్చే నెల తొలి వారంలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును పరిశీలించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. మొరాయించిన హెలికాప్టర్ గండేడ్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సర్వే చేసేందుకు సోమవారం రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులు రంగారెడ్డి జిల్లా గండేడ్‌కు రెండు హెలికాప్టర్లలో వచ్చారు. సర్వే అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఓ హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో మొరాయించింది. దీంతో సిబ్బంది దానిని ఇలా నెట్టారు. ఆ తర్వాత అది స్టార్ట్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
9 విధివిధానాలు
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ‘పరిధి’ని తేల్చడానికి ఖరారు కృష్ణా జలాలను 4 రాష్ట్రాలకు మళ్లీ కేటాయించాలా? కేవలం ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకే జరిపితే సరిపోదా?.. విధివిధానాలపై ప్రతిపాదనలు అందజేసిన నాలుగు రాష్ట్రాలు నీటి లభ్యతను మళ్లీ అంచనా వేయాలన్న ఏపీ అసహనం వ్యక్తంచేసిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ కొత్తగా లెక్కించాల్సిన అవసరమేంటని వ్యాఖ్య సుదీర్ఘ చర్చ అనంతరం ముసాయిదాపై ఆదేశాలు జారీ.. ఫిబ్రవరి 25 నుంచి తుది వాదనలు, అనంతరం ట్రిబ్యునల్ పరిధి, విస్తృతి ఖరారు సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ విచారణ పరిధిని తేల్చడానికి తొమ్మిది విధివిధానాలు ఖరారయ్యాయి. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాలను ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయించాలా లేక కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే కొత్త కేటాయింపులు జరపాలా అన్న కీలకాంశంపై నిర్ణయం తీసుకునే క్రమంలో ఈ ముందడుగుపడింది. ఇందుకోసం ముసాయిదా విధివిధానాలను జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ రూపొందించింది. వీటిపై వచ్చే నెల 25 నుంచి మూడు రోజుల పాటు ట్రిబ్యునల్‌లో వాదనలు జరగనున్నాయి. నదీ పరీవాహకంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు విన్న తర్వాత తుది విధివిధానాలను ట్రిబ్యునల్ ఖరారు చేస్తుంది. బుధవారం ఢిల్లీలోని కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్‌లో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత నెలలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు నాలుగు రాష్ట్రాలు ఈ సందర్భంగా ముసాయిదా విధివిధానాలను సమర్పించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అఫిడవిట్ ఇవ్వలేదు. దీంతో రాష్ట్రాల అభిప్రాయాలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్.. అన్ని రాష్ట్రాల ముసాయిదాలను క్రోడీకరించి 9 విధివిధానాలను ఖరారు చేసింది. కాగా ఈ జాబితాలో ‘నీటి లభ్యతను కొత్తగా లెక్క కట్టాలి’ అన్న అంశాన్ని చేర్చాలని ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. అయితే దీనిపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ కొంత అసహనం వ్యక్తంచేశారు. ఇదివరకే నీటి లభ్యతను లెక్కించినప్పుడు.. ఇక కొత్తగా లెక్కించాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. ఏపీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, గుంటూరు ప్రభాకర్ కూడా వాదనలు వినిపించారు. అలాగే ట్రిబ్యునల్ పరిధి, విధివిధానాలపై తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, రవీందర్రావు, కర్ణాటక తరఫున అనిల్ దివాన్, మహారాష్ట్ర తరఫున అంధ్యార్జున తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఖరారైన ముసాయిదా విధివిధానాలు 1. ఇప్పటివరకు బ్రిజేష్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు జరిపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కొత్తగా వివాదం తలెత్తిన రాష్ట్రాల కోసం నదీ జలాల చట్టంలోని సెక్షన్ 5(3)ప్రకారం తిరిగి కేంద్ర ప్రభుత్వం తదుపరి సూచన చేయాలా? 2. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీజలాల కేటాయింపు జరపాల్సి ఉంది. అయితే గత కేటాయింపును నోటిఫై చేయకుండా ఈ కేసును పదే పదే తెరవడం ద్వారా ప్రయోజనం ఉందా? 3. రెండు కొత్త రాష్ట్రాలకే పరిమితమై వాటి పరిధిలోని ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలా లేక నాలుగు రాష్ట్రాలకు తిరిగి కేటాయించాలా? తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్ రెండు కొత్త రాష్ట్రాలకే పరిమితం కావాలా లేక నాలుగు రాష్ట్రాలకా? 4. ఏపీ విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ విచారణ పరిధి, విస్తృతి, విధివిధానాలను నాలుగు రాష్ట్రాలకు వర్తింపజేయాలా లేక ఏపీ, తెలంగాణలకే పరిమితం చేయాలా? 5. డిసెంబర్ 13, 2010 నాటి అవార్డు, నవంబర్ 29, 2013 నాటి తుది అవార్డుల్లో ఏపీకి కేటాయించిన నీటి కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని రెండు కొత్త రాష్ట్రాలకే నీటి కేటాయింపులు జరపాలా? 6. కొత్త రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ, నియంత్రణకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85(ఎ), 85(ఇ) ప్రకారం ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇప్పటివరకు ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం పనిచేయాలా లేక తిరిగి జరిపే కేటాయింపుల ప్రకారం పనిచేయాలా? 7. మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపకుండా.. కేవలం తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులకే కేటాయింపులు జరిపితే ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా? 8. తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టులవారీగా నీటి విడుదలకు ఆపరేషన్ ప్రొటోకాల్ ఎలా ఉండాలి? 9. ట్రిబ్యునల్ గత రెండు అవార్డులు నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్ 6 ప్రకారం గెజిట్‌లో నోటిఫై కాలేదు. దీనిపై సుప్రీంలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఆ రెండు అవార్డులను ‘ఫైనల్ అండ్ బైండింగ్’గా పరిగణించగలమా? -
‘కుప్టి'... ఖర్చు తక్కువ, ఫలం ఎక్కువ
కుప్టి ప్రాంత నీటి లభ్యత దక్షిణ భారతంలోనే అత్యధికం. అతి తక్కువ దూరంలో అతి ఎక్కువ ఫాల్‌తో, అత్యధిక విద్యుదుత్పత్తికి అనువైన ఇలాంటి ప్రాంతం దేశంలోనే లేదు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు పాలకులకు ఇంతకాలంగా పట్టకపోవడం దురదృష్టకరం. నూతన తెలంగాణ రాష్ట్రం ఎదు ర్కొంటున్న తీవ్ర విద్యుత్ కొరత, కరువు సమస్యల పరిష్కా రానికి కుప్టి ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం, కుప్టి గ్రామంలో బహుముఖ ప్రయోజనాలను అందించే ఈ ప్రాజెక్టును నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో నిపుణుల బృందం సూచించింది. కుంటాల జలపాతానికి ఎగువన ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ప్రాంతపు ఖాయమైన నీటిలభ్యత దక్షిణ భారతం లోనే ఎక్కువ. ఏటా కనీసం 18.7 టీఎంసీల నీరు లభి స్తుంది. ప్రాజెక్టు వల్ల కనీసం 6.51 టీఎంసీల నీటిని బహు విధాలా ఉపయోగించుకోవచ్చు. సెకనుకు 500 క్యూసె క్కుల నీటిని వదిలితే, గంటకు 3 మెగావాట్లు, రోజుకు 70 మెగావాట్ల ప్రకృతికి హానిచేయని పరిశుభ్రమైన జల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. నవంబర్ లేదా డిసెం బర్ నుండి 150 రోజులపాటు ఈ స్థాయి విద్యుదుత్పత్తికి (మొత్తం 10,500 మెగావాట్లు) హామీ ఉంటుంది. పైగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటికంటే ఇక్కడ 3 రెట్లు ఎక్కు వ నీటి లభ్యతకు (18.7 టీఎంసీలు) హామీ ఉంటుంది. కాబట్టి ఆగస్టు నుండి 3 నెలలపాటు అదనంగా మరొక 6,300 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ప్రాజె క్టు నిర్మాణ వ్యయానికి (100 నుండి 150 కోట్ల రూపా యలు) సరిపడే విద్యుదుత్పత్తి 8 ఏళ్లలోనే లభిస్తుంది. గత ఏడాది ఈ ప్రాంతం నుండి 50 క్యూసెక్కుల నీరు సముద్రం పాలైందంటేనే ఇక్కడ గరిష్ట నీటి లభ్యత ఎంత ఎక్కువో అర్థమౌతుంది. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తున కుప్టి ప్రాజెక్టును నిర్మిస్తే... సువిశాలమైన ఈ క్యాచ్మెంట్ ఏరియాలో లభించే చివరి నీటి బొట్టును సైతం నిలువ చేసి, విద్యుదుత్పత్తితో పాటూ, సాగునీటి, తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చు. కుప్టి - కుం టాల నీటి ప్రవాహం దిగువకు ఎంత ఉధృతితో ప్రవహి స్తుందంటే... ఆ వరదకు పూర్తిగా ఎండి, ఖాళీయైన కడెం ప్రాజెక్టు గంటలో నిండిపోవడమే కాదు, గేట్లు ఎత్తేయ కపోతే గండి పడి, ఉపద్రవానికి దారితీస్తుంది. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన మెరుపు వరదలకు గురయ్యే ప్రాజెక్టుల్లో కడెం ఒకటి. 1972 నుండి 2014 వరకు ఆ ప్రాజెక్టుకు 1,400 టీఎంసీల నీళ్లు వస్తే 800 టీఎంసీలు వృథాగా గోదావరి ద్వారా సముద్రంలో కలిశాయి. 1,700 మి.మీ. (2013) వర్షపాతంతో సుభిక్షంగా ఉండాల్సిన బోథ్-ప్రాణహిత ప్రాంతంలో వందలాదిగా రైతులు ఆత్మ హత్యలకు పాల్పడాల్సివచ్చింది. శ్రీరాంసాగర్ పూర్తి నిలు వ సామర్థ్యం కంటే ఎక్కువ నీటిలభ్యత ఉండే ఈ ప్రాం తం నుండి ఈ కరువు ఏడాదిలో కూడా ఒక పంటకు సరి పడే నీరు అనేక రోజుల పాటు వృథా అయింది. సర్వే చేసిన కుప్టి ప్రాజెక్టుకు, కడెం ప్రాజెక్టుకు మధ్య 200 మీటర్ల తీవ్రమైన దిగుడు (ఫాల్)ఉంటుంది. ఆ భారీ నీటి దిగుడులో విద్యుదుత్పత్తితోపాటూ, పైసా ఖర్చు లేకుండా వందలాది గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందిం చగలుగుతాం. అతి తక్కువ దూరంలో అతి ఎక్కువ ఫాల్ (దిగుడు)తో, అత్యధిక జల విద్యుదుత్పత్తికి అనువైన ఇలాంటి ప్రాంతం దేశంలోనే లేదని చెప్పొచ్చు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు ఇంత కాలంగా పాలకులకు పట్టక పోవడం దురదృష్టకరం. కుప్టి గాక, దానికి 200 మీటర్ల దిగుడులో 25 మీట ర్లకు ఒకటి చొప్పున మరో రెండు జలవిద్యుత్ కేంద్రాల ను... పెంబి సమీపంలోనూ, బాబ్జీపేట వద్ద నిర్మించవ చ్చు. నిత్యం పై నుంచి జలపాతం, క్రింది బ్యాక్ వాటర్ లతో కనులకు విందుచేసే ఆ జల కళ వర్ణనకు అందదు. ఏటా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో జలకళ లేక కుంతాల జలపాతం వెలవెల పోతుంటుంది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఏడాది పొడవునా అది కళకళలాడుతూ పర్యాటకు లను ఆకర్షిస్తుంది. దానిని రాష్ట్రంలోనే ముఖ్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. ఈ మూడు ప్రాజెక్టులతో లభించే విద్యుత్తు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండా నీరుంటే జరిగే విద్యుత్తుకు సమానం. ఇవి ఆగస్టు నుంచి మార్చి వరకు ఆదిలాబాద్ జిల్లా నీటి అవసరాలను తీర్చడంతో పాటు 50,400 మెగావాట్ల విద్యుత్తును అందిస్తాయి. కుప్టి ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యేది ఒక్క గ్రామం, 1,600 ఎకరాల భూమి మాత్రమే. ఈ ప్రాజె క్టులో 6.5 టీఎంసీల నీటిని నిలువ చేయగా, మిగతా 12.14 టీఎంసీల నీటిని కడెం ప్రాజెక్టుకు అందించవచ్చు. అత్యధిక వర్షపాతం ఉన్నా, చుక్క నీరు నిలవని కరువు మండలాలైన ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్లకు ముందుగా ఈ ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా సాగు నీరు అందిం చాలి. పైగా ఇది అద్భుతమైన వాటర్ గ్రిడ్‌గా పనిచేసి, దిగువనున్న వందలాది గ్రామాలకు తాగు నీరందించ గలుగుతుంది. 200 మీటర్ల ఎత్తు నుండి దిగువకు పరు గులు తీసే ఈ నీటిని వదలి, అత్యంత వ్యయప్రయా సలతో కడెం ప్రాజెక్టు నుండి ఎగువనున్న ఆదివాసీ గ్రామాలకు నీరందించాలనుకోవడం అవివేకం. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులు) మొబైల్: 7095474920 నైనాల గోవర్ధన్ -
జిల్లాకు ఎస్సారెస్పీ జలాలు
కాకతీయ కాల్వ ద్వారా విడుదల కేవలం మెట్ట ప్రాంతాలకు మాత్రమే.. 70 వేల ఎకరాలకు ప్రాణం ఈ నెల 16 వరకు రెండు టీఎంసీలు విడుదల హన్మకొండ : జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ఎస్సారెస్పీ జలాలను విడుదల చేశారు. నీటి లభ్యత లేని వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లితో పాటు ములుగు, నర్సంపేట ప్రాంతాలకు కాకతీయ ప్రధాన కాల్వ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాంతాల్లో 70 వేల ఎకరాలకు అదును సమయంలో కాల్వ నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం కాల్వ ఆయకట్టులో వేసిన పంటలు ఎండిపోయో దశకు చేరుకోవడం, సాగునీరు అందించేందుకు ఎలాంటి సదుపాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడం అక్కడి రైతులకు ఉపశమనం కలిగించినట్లయింది. ప్రస్తుతం విడుదల చేసిననీటిని కాకతీయ కాల్వ 194 కిలోమీటర్ నుంచి డీబీఎం 31 వరకు(234వ కిలోమీటర్) ఆయకట్టుకు అందించనున్నారు. ఇక్కడ వినియోగించుకుని, మిగిలిన నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీ నుంచి దిగువకు రెండు రోజుల క్రితమే నీరు విడుదల చేసినా... కాల్వ ఆయకట్టులో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉండటంతో విడుదల చేసిన నీరు కాల్వల నుంచి జిల్లాకు వచ్చేందుకు రెండు రోజుల సమయం పట్టింది. ఈ మేరకు ఎస్సారెస్పీ జలాలు శుక్రవారం ఉదయం జిల్లాకు చేరాయి. మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో... మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్య, ప్రత్యామ్నాయాలు లేని విషయమై పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, ములుగు, నర్సంపేట సెగ్మెంట్ల నుంచి రైతుల తరఫున ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడం తప్ప వేరే మార్గం లేదని వారు మంత్రికి విన్నవించారు. అయితే, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఇన్‌ఫ్లో రాకపోవడంతో మంత్రి నీటి విడుదలకు అడ్డంకి చెప్పారు. కానీ కాల్వ నీటిపైనే ఆధారపడి సేద్యం చేస్తుండడం, కరెంటు కోతతో మోటార్లు సాగక పంటలన్నీ ఎండిపోయే దశకు చేరిన నేపథ్యంలో పంటలకు ప్రమాదం వాటిల్లుతోందని గుర్తించిన మంత్రి ఎల్ఎండీ నుంచి రెండు టీఎంసీల నీరుని విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. కాకతీయ కాల్వ ద్వారా రోజుకు రెండు వేల టీఎంసీల నీటిని విడుదల చేయాలని అత్యవసర ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఈనెల 7వ తేదీనే నీరు విడుదల చేసిన అధికారులు ఆయకట్టులో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ నీటి విడుదల విషయం తెలుసుకున్న రైతులు కాల్వల వెంట పడిగాపులు ఉన్నారు. మోటర్లు, జనరేటర్ల సాయంతో కాల్వలో పారుతున్న నీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారు. ఫలితంగా జిల్లాకు కొంత ఆలస్యంగా శుక్రవారం ఎస్సారెస్పీ నీరు చేరింది. ఈనెల 16 వరకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేయనుండగా, డీబీఎం 31 వరకు ఈ నీటిని పూర్తిస్థాయి ఆయకట్టుకు అందిస్తామని ఎస్సారెస్పీ స్టేజ్-1 ఎస్ఈ సుధాకర్‌రెడ్డి చెప్పారు. ప్రధానంగా వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లితో పాటు నర్సంపేట, ములుగు ప్రాంతాల్లోని 70వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. ప్రస్తుత పరిస్థితి మేరకు 16వ తేదీ వరకు నీరు విడుదల చేస్తామే తప్ప ఆ తర్వాత చుక్క నీరు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, అదను సమయంలో కాల్వల ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులకు ఉపశమనం కలిగినట్లయింది. ఈ ఒక్క తడితోనైనా పంటలకు ప్రాణం వస్తుందని వారు ఆశ పడుతున్నారు.