జిల్లాకు ఎస్సారెస్పీ జలాలు | District essarespi waters | Sakshi
Sakshi News home page

జిల్లాకు ఎస్సారెస్పీ జలాలు

Published Sat, Oct 11 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

District essarespi waters

  • కాకతీయ కాల్వ ద్వారా విడుదల
  • కేవలం మెట్ట ప్రాంతాలకు మాత్రమే..
  • 70 వేల ఎకరాలకు ప్రాణం
  • ఈ నెల 16 వరకు రెండు టీఎంసీలు విడుదల
  • హన్మకొండ : జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ఎస్సారెస్పీ జలాలను విడుదల చేశారు. నీటి లభ్యత లేని వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లితో పాటు ములుగు, నర్సంపేట ప్రాంతాలకు కాకతీయ ప్రధాన కాల్వ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాంతాల్లో 70 వేల ఎకరాలకు అదును సమయంలో కాల్వ నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం కాల్వ ఆయకట్టులో వేసిన పంటలు ఎండిపోయో దశకు చేరుకోవడం, సాగునీరు అందించేందుకు ఎలాంటి సదుపాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడం అక్కడి రైతులకు ఉపశమనం కలిగించినట్లయింది. ప్రస్తుతం విడుదల చేసిననీటిని కాకతీయ కాల్వ 194 కిలోమీటర్ నుంచి డీబీఎం 31 వరకు(234వ కిలోమీటర్) ఆయకట్టుకు అందించనున్నారు.

    ఇక్కడ వినియోగించుకుని, మిగిలిన నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండీ నుంచి దిగువకు రెండు రోజుల క్రితమే నీరు విడుదల చేసినా... కాల్వ ఆయకట్టులో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉండటంతో విడుదల చేసిన నీరు కాల్వల నుంచి జిల్లాకు వచ్చేందుకు రెండు రోజుల సమయం పట్టింది. ఈ మేరకు ఎస్సారెస్పీ జలాలు శుక్రవారం ఉదయం జిల్లాకు చేరాయి.
     
    మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో...

    మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్య, ప్రత్యామ్నాయాలు లేని విషయమై పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, ములుగు, నర్సంపేట సెగ్మెంట్ల నుంచి రైతుల తరఫున ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడం తప్ప వేరే మార్గం లేదని వారు మంత్రికి విన్నవించారు. అయితే, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఇన్‌ఫ్లో రాకపోవడంతో మంత్రి నీటి విడుదలకు అడ్డంకి చెప్పారు.

    కానీ కాల్వ నీటిపైనే ఆధారపడి సేద్యం చేస్తుండడం, కరెంటు కోతతో మోటార్లు సాగక పంటలన్నీ ఎండిపోయే దశకు చేరిన నేపథ్యంలో పంటలకు ప్రమాదం వాటిల్లుతోందని గుర్తించిన మంత్రి ఎల్‌ఎండీ నుంచి రెండు టీఎంసీల నీరుని విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. కాకతీయ కాల్వ ద్వారా రోజుకు రెండు వేల టీఎంసీల నీటిని విడుదల చేయాలని అత్యవసర ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఈనెల 7వ తేదీనే నీరు విడుదల చేసిన అధికారులు ఆయకట్టులో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ నీటి విడుదల విషయం తెలుసుకున్న రైతులు కాల్వల వెంట పడిగాపులు ఉన్నారు.

    మోటర్లు, జనరేటర్ల సాయంతో కాల్వలో పారుతున్న నీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారు. ఫలితంగా జిల్లాకు కొంత ఆలస్యంగా శుక్రవారం ఎస్సారెస్పీ నీరు చేరింది. ఈనెల 16 వరకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేయనుండగా, డీబీఎం 31 వరకు ఈ నీటిని పూర్తిస్థాయి ఆయకట్టుకు అందిస్తామని ఎస్సారెస్పీ స్టేజ్-1 ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి చెప్పారు.

    ప్రధానంగా వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లితో పాటు నర్సంపేట, ములుగు ప్రాంతాల్లోని 70వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. ప్రస్తుత పరిస్థితి మేరకు 16వ తేదీ వరకు నీరు విడుదల చేస్తామే తప్ప ఆ తర్వాత చుక్క నీరు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, అదను సమయంలో కాల్వల ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులకు ఉపశమనం కలిగినట్లయింది. ఈ ఒక్క తడితోనైనా పంటలకు ప్రాణం వస్తుందని వారు ఆశ పడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement