జూన్ నాటికి ఎస్సారెస్పీ–2
పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పనుల పురోగతిని ఇకపై ప్రతివారం సమీక్షించాలని చెప్పారు. బుధవారం జలసౌధలో ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ–2 నుంచి పాత నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే పనుల వేగం పెంచాలని కోరారు. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద రూ.1,321 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఎస్సారెస్పీ స్టేజ్–2 పరిధిలో 2.25 లక్షల ఎకరాలు స్థిరీకరించిందని, మరో 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. కాకతీయ ప్రధాన కాలువలో లైనింగ్ దెబ్బతినడం, పూడికతో వరంగల్, ఖమ్మం, నల్లగొండల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో భూములకు నీరందడం లేదని.. ఈ మరమ్మ తులు పూర్తి చేసి, ఫీల్డ్ చానల్స్ అన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఈ పథకంతో పాత నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,13,175 ఎకరాలకు.. ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో 75, 262 ఎకరాలు, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాల్లో 1,09,512 ఎకరాలకు సాగు నీరందుతుందని గుర్తు చేశారు.
శ్రీరాంసాగర్ చివరి భూములకు నీరు
శ్రీరాంసాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నడుం బిగించారని హరీశ్‌రావు అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్సారెస్పీని కలుపుతున్నందున ఈ లోగా ఎస్సారెస్పీ–2 పనులు పూర్తి కావాలని.. ఎల్‌ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాలలో కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి ఈఎన్‌సీ మురళీధర్, ఈఎన్‌సీ(అడ్మిన్) నాగేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.