అధికారంలో ఉన్నామనే సోయి లేదు
♦ హరీశ్‌పై భట్టి ఫైర్
♦ మంత్రి పోచారంపై పీడీ కేసు పెట్టాలని డిమాండ్
♦ కేసీఆర్‌కు మాగలోమేనియా
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే సోయి మంత్రి హరీశ్‌రావుకు లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. టీపీసీసీ నేతలు ఎం.కోదండ రెడ్డి, ఆరేపల్లి మోహన్, బండి సుధాకర్‌తో కలిసి మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించకుండా ఇంకా ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్న హరీశ్‌కు అధికారంలో ఉన్నామనే సోయిలేదన్నారు.
నకిలీ సంస్థలను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందని చెబుతున్న మంత్రి అధికారంలో ఉంటూ ఏం చేస్తున్నారని, నకిలీ సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైన, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నకిలీ విత్తనాల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన మంత్రి పోచారంపై, అధికారులపై పీడీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అంతా బాగున్నట్టుగా, ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టుగా మహత్వోన్మాదంలో ఉన్న కేసీఆర్‌కు మాగలోమేనియా అనే జబ్బు ఉందని, ఈ జబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే ఇలాంటి భ్రమలు, భ్రాంతి కలుగుతాయని భట్టి వ్యాఖ్యానించారు. ఇళ్లు కట్టుకున్న నిరుపేదలకు బిల్లులు ఇవ్వకుండా, కొత్త ఇళ్లు కట్టకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి సచివాలయాన్ని, సీఎం క్యాంపు కార్యాలయాన్ని కట్టాలని నిర్ణయించడం బాధాకరమన్నారు.