harisravu
-
జూన్ నాటికి ఎస్సారెస్పీ–2
పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పనుల పురోగతిని ఇకపై ప్రతివారం సమీక్షించాలని చెప్పారు. బుధవారం జలసౌధలో ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ–2 నుంచి పాత నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే పనుల వేగం పెంచాలని కోరారు. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద రూ.1,321 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఎస్సారెస్పీ స్టేజ్–2 పరిధిలో 2.25 లక్షల ఎకరాలు స్థిరీకరించిందని, మరో 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. కాకతీయ ప్రధాన కాలువలో లైనింగ్ దెబ్బతినడం, పూడికతో వరంగల్, ఖమ్మం, నల్లగొండల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో భూములకు నీరందడం లేదని.. ఈ మరమ్మ తులు పూర్తి చేసి, ఫీల్డ్ చానల్స్ అన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఈ పథకంతో పాత నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,13,175 ఎకరాలకు.. ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో 75, 262 ఎకరాలు, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాల్లో 1,09,512 ఎకరాలకు సాగు నీరందుతుందని గుర్తు చేశారు. శ్రీరాంసాగర్ చివరి భూములకు నీరు శ్రీరాంసాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నడుం బిగించారని హరీశ్‌రావు అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్సారెస్పీని కలుపుతున్నందున ఈ లోగా ఎస్సారెస్పీ–2 పనులు పూర్తి కావాలని.. ఎల్ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాలలో కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి ఈఎన్సీ మురళీధర్, ఈఎన్సీ(అడ్మిన్) నాగేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఏడాదిలో మిడ్ మానేరుకు ఎల్లంపల్లి నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ఎల్లంపల్లి, మిడ్ మానేరు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వచ్చే ఏడాదిలో అడుగుపెట్టే నాటికి ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరులో పడాలన్నారు. ఆదివారం జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని హరీశ్‌రావు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ఏడు జిల్లాల రైతుల జీవితాలతో ముడిపడిందని మరోసారి గుర్తు చేశారు. ప్రాజెక్టులోని 6, 7, 8 ప్యాకేజీల పనులు జరుగుతున్న ప్రాంతంలో వారంలో రెండు రోజులపాటు ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించాలని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని ఆదేశించారు. నవంబర్ చివరి కల్లా ఎలక్ట్రికల్, మెకానికల్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి ప్యాకేజీ 6, 7, 8 పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ కల్లా పంప్‌హౌజ్‌లు, టన్నెల్ పనులు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు పనులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ వ్యవధిలోగా పూర్తి చేయాలన్నారు. మేడారం రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని, రిజర్వాయర్‌కు సంబంధించిన రైతులకు పంట పరిహారం వెంటనే ఇవ్వాలని సూచించారు. క్రాప్ హాలిడేకు సంబంధించిన ఫైలును వెంటనే క్లియర్ చేయాలని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాసరాజ్ను కోరారు. సమీక్షలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, భూసేకరణ సలహాదారు జి.మనోహర్, ఈఈ నూనె శ్రీధర్, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మీరా.. రైతుల గురించి మాట్లాడేది?
⇒ ఉత్తమ్, జానాలపై మంత్రి హరీశ్ ధ్వజం ♦ మీ పాలనలో గోస పెట్టినందుకు ధర్నాలు చేస్తున్నారా? ♦ మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు సాక్షి, నల్లగొండ: రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురు వారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియో జకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రు లు జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డిలు దేనికోసం ధర్నాలు చేస్తున్నా రని ప్రశ్నించారు.‘‘కాంగ్రెస్ హయాంలో ఎరువులు ఇవ్వక రైతులను గోస పెట్టారనా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేనందుకు ధర్నా చేస్తారా? మీ హయాంలో విత్తనాలు దొరకక పోలీసు స్టేషన్ల ముందు రైతులు నిలబడినందుకా..? లేక చాలీచాలని, రాత్రిపూట కరెంట్ ఇచ్చినందుకు, మోటార్లు, స్టార్టర్లు కాలలేదని ధర్నా చేస్తారా? అని నిలదీశారు. యాసంగిలో ప్రతి గింజా కొనుగోలు యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజా కొనుగోలు చేసి రూ.6,500 కోట్లు ఇచ్చామ న్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో లోలెవల్ కెనాల్, మహ బూబ్‌నగర్‌లో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కరీంనగర్లో ఎల్లపల్లి, ఖమ్మంలో భక్తరామదాసు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నీళ్లిచ్చామన్నా రు. వచ్చే ఏడాది నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. డిండితో సస్యశ్యామలం డిండి ఎత్తిపోతల కింద నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాలను సస్య శ్యామలం చేసేందుకు రూ.6 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని హరీశ్ అన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2తో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కాళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేస్తామన్నారు. గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్లు నిర్మించి భువన గిరి, ఆలేరు నియోజకవర్గాల భూములకు నీళ్లిస్తామని చెప్పారు. ఉత్తమ్ పిట్టల దొర: జగదీశ్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిట్టల దొరలా అబద్ధాలు మాట్లాడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో సబ్స్టేషన్ల నిర్మాణం చేశామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సంక్షోభంలో ఉన్నారని, రైతులు సంక్షోభంలో ఉన్నట్లు మాట్లాడుతు న్నారన్నారు. -
అధికారంలో ఉన్నామనే సోయి లేదు
♦ హరీశ్‌పై భట్టి ఫైర్ ♦ మంత్రి పోచారంపై పీడీ కేసు పెట్టాలని డిమాండ్ ♦ కేసీఆర్‌కు మాగలోమేనియా సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే సోయి మంత్రి హరీశ్‌రావుకు లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. టీపీసీసీ నేతలు ఎం.కోదండ రెడ్డి, ఆరేపల్లి మోహన్, బండి సుధాకర్‌తో కలిసి మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించకుండా ఇంకా ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్న హరీశ్‌కు అధికారంలో ఉన్నామనే సోయిలేదన్నారు. నకిలీ సంస్థలను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందని చెబుతున్న మంత్రి అధికారంలో ఉంటూ ఏం చేస్తున్నారని, నకిలీ సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైన, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నకిలీ విత్తనాల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన మంత్రి పోచారంపై, అధికారులపై పీడీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతా బాగున్నట్టుగా, ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టుగా మహత్వోన్మాదంలో ఉన్న కేసీఆర్‌కు మాగలోమేనియా అనే జబ్బు ఉందని, ఈ జబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే ఇలాంటి భ్రమలు, భ్రాంతి కలుగుతాయని భట్టి వ్యాఖ్యానించారు. ఇళ్లు కట్టుకున్న నిరుపేదలకు బిల్లులు ఇవ్వకుండా, కొత్త ఇళ్లు కట్టకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి సచివాలయాన్ని, సీఎం క్యాంపు కార్యాలయాన్ని కట్టాలని నిర్ణయించడం బాధాకరమన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీశ్‌రావు వరంగల్ సిటీ/పరకాల/కూసుమంచి: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నదని మార్కెటింగ్‌శాఖ, భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నిర్వహించిన వరంగల్ అర్బన్ జిల్లాలోని ఏనుమాముల, పరకాల వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఏనుమాముల కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు, దేవాదుల, కాళేశ్వరం, ఎస్సారెస్పీ స్టేజీ-1, 2 ప్రాజెక్టుల పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. రబీలోనూ 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని మంత్రి ఆగ్రహించారు. ఓర్వలేకనే ధర్నాలు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు ధర్నాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. నవంబర్ నాటికి భక్త రామదాసు పూర్తి ఖమ్మం జిల్లాలో కరువుపీడిత పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని సవాల్‌గా తీసుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం పాలేరు రిజర్వాయర్ సమీపంలో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ పనులను పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఎత్తిపోతల పనులు తుదిదశకు చేరుకున్నాయనీ, నవంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావు ప్రోద్బలంతో ఎత్తిపోతల పనులు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలి
రెవెన్యూ అధికారులకు మంత్రి ఆదేశాలు సిద్దిపేట జోన్:జిల్లా కేంద్రంగా త్వరలో ఏర్పాటు కానున్న సిద్దిపేట పట్టణ సరిహద్దు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా భూకబ్జాలు ,ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారు? అసలు విధులు నిర్వహిస్తున్నారా లేదా? తెలిసి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కబ్జాలపై కఠినంగా వ్యవహరించండి’ అంటూ మంత్రి హరీశ్‌రావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆదివారం పట్టణంలో పర్యటిస్తున్న క్రమంలో మంత్రి నర్సాపూర్ శివారులో చేపడుతున్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 12 గుంటల భూమి అసైన్డ్ అయిన విషయం తెలుసుకున్న మంత్రి రెవెన్యూ అధికారులతో ఆరా తీశారు. ఒక దశలో పొన్నాల గ్రామ శివారుల్లో అనుమతులు లేకుండానే నిర్మాణాలు ఇష్టానుసారంగా జరుగుతున్నప్పటికీ, భూకబ్జాలు , అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నప్పటికి రెవెన్యూ అధికారుల్లో స్పందన లేకపోవడం సమంజసం కాదన్నారు. ఆసలు రెవెన్యూ అధికారులు తిరుగుతున్నారా.. లేదా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఆర్డీఓ ముత్యంరెడ్డికి సంబంధిత అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం డబుల్ బెడ్రూం పథకం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. పనులను వేగవంతం చేయాలని సూచించారు. దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోడికి సొంత ఇంటికల నిజంచేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు.పేదల పెన్నిధిగా కేసీఆర్ చరిత్రలో నిలువడం ఖాయమన్నారు. సిద్దిపేటలో రూ. 118 కోట్లతో డబుల్ బెడ్రూం పథకం కింద 1968 మందికి గృహ వసతి కల్పించడం జరుగుతుందన్నారు. సిద్దిపేటలో జీ ప్లస్‌టూ పథకంలో కొనసాగుతున్నాయన్నారు. ఆయన వెంట దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం పనులను వేగవంతం చేయాలి
జిల్లాల పునర్విభజనకు ముందే భూసేకరణ సమన్వయంతో లక్ష్యాన్ని సాధించండి అధికారుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్:కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ , దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో కాళేశ్వరం పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రాథమిక దశలను సమస్య పరిష్కారం కోసం ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు సహకరించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. మార్కింగ్ ఏజెన్సీలతో సరిగ్గా పనిచేయించుకోవాలన్నారు. కొత్త జిల్లాల పునర్విభజనకు ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు సమ్మతి ఇచ్చిన తర్వాత రిజిష్ట్రేషన్లు ఎందుకు చేయడం లేదని ఇలా జాప్యం చేయకుండా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి ఇరిగేషన్, రెవెన్యూ సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. వీటితో పాటు రంగనాయకసాగర్ ఎడమ, కుడి కాలువ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట , చిన్నకోడూరు మండలాల్లో వివిధ దశల్లో ఉన్న భూసేకరణ, భూ తగదాల విషయాలపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన చర్చించారు. జీవో నంబర్ 123 ప్రకారం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అప్పగించే క్రమంలో వారికి తరుగుదల లేకుండా తగినహోదా ఇచ్చేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో జరిగే పనుల రిపోర్టును అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలన్నారు. సమీక్షలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఇరిగేషన్ సీఈ హరిరాం, ఎస్ఈ వేణు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ ఆనంద్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
నల్లవాగుకు ఖరీఫ్ కళ..
రైతన్నకు వరప్రదాయిని మధ్య తరహా ప్రాజెక్టు కలే్హర్ : నల్లవాగు ఆయకట్టు భూములకు ‘ఖరీఫ్’ కళ వచ్చింది మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులకు నల్లవాడు ప్రాజెక్టు వరప్రదాయిని. జూలై, అగస్టు నెలల్లో నల్లవాగు ఎగువభాగంలోని కర్ణాటక, కంగ్టి మండలంలో అడపాదడపగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపై నుంచి నీళ్లు పారుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 1491.5 ఫీట్లుగా ఉంది. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కష్ణాపూర్, ఇందిరానగర్, కలే్హర్ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఇటివల ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు సాగు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కింద రైతులు సోయాబీ¯ŒS, మొక్కజొన్న పంటలు వేశారు. కొందరు రైతులు వరి సాగు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలు సాగుకు నోచుకుంటున్నాయి. ప్రత్యామ్నాయంగా కాల్వల మరమ్మతు పనులు కలే్హర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ. 98లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడి, నీటి పారుదల శాఖా మంత్రి శీలం సిద్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. నల్లవాగు ప్రాజెక్టు సాగు నీటి విడుదలకు ముందు శిథిలం కావడంతో వాటిని బాగు చేసి ఆయకట్టు అంతట సాగు నీరందించాలని రైతులు ప్రభుత్వన్ని కోరుతున్నారు. ఇటీవలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. ప్రాజెక్టును పూర్తిగా అధునికరిస్తామని మంత్రి హరీశ్‌రావు రైతన్నలకు భరోసా కల్పించారు. దీంతో ఆయకట్టు కింది రైతుల్లో ‘ఆశలు’ చిగురించాయి. ఆయకట్టుకు సక్రమంగా సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృషి మేరకు ప్రభుత్వం రూ. 13 లక్షలు మంజూరు చేసింది. ప్రత్యామ్నాయంగా కాల్వల్లో పేరుకున్న పూడిక, పిచ్చి మొక్కలు తొలగించారు. కాల్వలకు జలకళ సంతరించుకుంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
రెండు కోట్లతో సిద్దిపేటలో స్టడీ సర్కిల్ ఏర్పాటు
అన్నగా చెబుతున్నా.. ఇష్టపడి చదవండి ఉద్యోగం సాధించండి రూ. కోట్లతో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశా.. సద్వినియోగం చేసుకున్నప్పుడే సార్థకత స్టడీ సర్కిల్ కేంద్రంలో మంత్రి హరీశ్ సిద్దిపేట జోన్:‘ఉచితం అనగానే విలువ ఉండదు. అది మానవ సహజ గుణం. రెండు కోట్లతో సిద్దిపేట ప్రాంతంలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశా. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నప్పుడే నా ప్రయత్నానికి సార్థకత. శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందితే నాకు సంతృప్తి మిగులుతుంది. విద్యార్థుల్లో సీరియస్‌నెస్ ఉండాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే భావితరాల్లోని మీ తమ్ముళ్లకు , చెల్లెళ్లకు ఇబ్బంది కావొద్దు. అన్నగా చెబుతున్న ఎంపికైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్లాస్‌లకు హాజరుకావాల్సిందే..’ అంటూ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం విద్యార్థులకు హితబోధ చేశారు. సిద్దిపేటలో పర్యటిస్తున్న క్రమంలో మంత్రి ఆకస్మికంగా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న కోఆర్డీనేటర్ శ్రీనివాస్‌తో మంత్రి హరీష్‌రావు శిక్షణ ప్రక్రియపై ఆరా తీశారు. సిద్దిపేట సెంటర్‌కు వంద సీట్లు మంజూరుకాగా 83 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు కోఆర్డినేటర్ మంత్రికి వివరించారు. స్పందించిన ఆయన తనీఖీ సమయంలో కేవలం 33 మంది మాత్రం ఉండడం సరైంది కాదన్నారు. కాగా వంద సీట్లను భర్తీ చేయాల్సిందేనని మిగిలిన 15 సీట్లను ఎస్సీ, ఎస్టీ, ఓసీ, విద్యార్ధులచే వెంటనే భర్తీ చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. స్టడీ సర్కిల్లో చేరి మూడు రోజుల పాటు వరుసగా శిక్షణ తరగతులకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో సెంటర్ నిర్వహకులు వెంటనే మాట్లాడి హాజరుశాతాన్ని పెంచాలన్నారు. మంత్రి వెంట ఓఎస్డీ బాల్‌రాజు, టీఆర్ఎస్ నాయకులు శర్మ, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, శేషుకుమార్ తదితరులు ఉన్నారు. -
పంద్రాగస్టు.. అదిరేట్టు
- వేడుకలకు భారీ ఏర్పాట్లు - ముస్తాబైన పరేడ్ గ్రౌండ్ - ముఖ్యఅతిథిగా రానున్న మంత్రి హరీశ్‌రావు - పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సంగారెడ్డి టౌన్: 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. జెండా గద్దెను ముస్తాబు చేశారు. మైదానంలో ప్రభుత్వ శాఖల తరఫున ఏర్పాటు చేయనున్న స్టాళ్లు, శకటాలను సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, అతిథులు, ప్రజలు వీక్షించేందుకు వీలుగా షామియానాలు వేశారు. సోమవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు. పోలీసు కవాతు ద్వారా గౌరవ వందనం స్వీకరిస్తారు. ఏడాది కాలంలో జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులను జిల్లా ప్రజలకు వివరిస్తారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక, కళారూప ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శిస్తారు. వివిధ శాఖల్లో పని చేస్తోన్న ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేస్తారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, అనధికారులు, ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. -
సిద్దిపేటకు అరుదైన గౌరవం
- హరితమిత్ర అవార్డుకు ఎంపికైన పట్టణం - రేపు గవర్నర్, సీఎం చేతుల మీదుగా ప్రదానం - రూ.2 లక్షల నగదు, జ్ఞాపికతో సత్కారం - ఫలించిన మంత్రి ప్రయత్నం సిద్దిపేట జోన్: సిద్దిపేటకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ పట్టణం హరితమిత్ర అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు శనివారం సిద్దిపేట మున్సిపాలిటీకి హరితమిత్ర అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది పట్టణంలో లక్ష మొక్కలు నాటిన స్ఫూర్తితో ఈసారి 2.30 లక్షల మొక్కలను నాటి రికార్డు సృష్టించింది. ఇందులో భాగంగా హరితమిత్ర అవార్డును పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా సోమవారం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌ల చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి అందుకోనున్నారు. జ్ఞాపికతోపాటు రూ.2లక్షల నగదును స్వీకరించనున్నారు. 1998లో అప్పటి ఎమ్మెల్యే కేసీఆర్ తొలి ప్రయోగంగా సిద్దిపేటలో మొక్కలు నాటే క్రమంలో హరితహారానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే పట్టణ ప్రజలు, వ్యాపారులు పెద్ద ఎత్తున కదిలారు. ఇదే స్ఫూర్తితో కేసీఆర్ గత ఏడాది సీఎం హోదాలో సిద్దిపేటలో హరితహారానికి నాంది పలికారు. గత ఏడాది మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పట్టణంలో లక్ష మొక్కలను నాటగా ఈ ఏడాది 2.30లక్షల మొక్కలు నాటారు. సిద్దిపేట ప్రజలకు అంకితం... స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యాన్ని సాధించి, గ్రీన్ సిద్దిపేట దిశగా ముందుకు సాగుతోన్న ఈ పట్టణానికి హరితమిత్ర అవార్డు రావడం సంతోషదాయకం. ఈ విజయం ప్రజలకు అంకితం. అన్ని వర్గాల ప్రజలు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమష్టిగా హరితహార లక్ష్యాన్ని అధిగమించారు. నాటిన ప్రతి మొక్క బతికినప్పుడే నిజమై ఆనందం కలుగుతుంది. రాష్ర్ట స్థాయిలోనే సిద్దిపేటకు హరితమిత్ర అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో సిద్దిపేట ముందుకు సాగాలి. - టి.హరీశ్‌రావు, మంత్రి -
ప్రధానికి ఘనస్వాగతం పలుకుదాం
మంత్రి హరీశ్‌రావు అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో సమావేశం హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి నంగునూరు: రాష్ట్రానికి మొదటి సారిగా వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలకాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం సిద్దన్నపేటలో అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు ఏ గ్రామం నుంచి ఎంత మంది వస్తున్నారు, ఎన్ని బస్సులు అవసరం, ఇన్చార్జీలు, వారి ఫోన్ నంబర్ల వివరాలను సేకరించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి వస్తున్న ప్రధానికి కనివిని ఎరుగని రీతిలో స్వాగతం పలకాలన్నారు. నంగునూరు మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వారి కోరిక మేరకు బస్సులు పంపుతామన్నారు. శనివారం రాత్రికి బస్సులు గ్రామాలకు చేరుకుంటాయని, సిద్దిపేట నుంచి వచ్చేవారు ముందు వరుసలో కూర్చోవాల్సి ఉన్నందున సభా ప్రాంగణానికి తొందరగా చేరుకోవాలన్నారు. అన్ని గ్రామాల నుంచి మహిళలు ఎక్కువగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలి ప్రతి గ్రామంలో 40 వేలకు తగ్గకుండా మొక్కలు నాటాలని సర్పంచ్‌లు, ఎంపీడీఓను మంత్రి ఆదేశించారు. ఒక్కో గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారో అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులు, ప్రజలు ఏమొక్కలను ఎక్కువగా అడుగుతున్నారో ఆరా తీశారు. సీత ఫలం, నీలగిరి మొక్కలు డిమాండ్ అధికంగా ఉన్నందున వాటిని బయట నుంచి తెప్పించి రైతులకు అందజేస్తామన్నారు. పొలం గట్లు, రైతు భూములకు బౌండరీలుగా వీటిని నాటాలన్నారు. ప్రతి గ్రామానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పురేందర్, పీఏసీఎస్ చైర్మన్లు రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర్, తహీసీల్దార్ గులాం ఫారూక్ అలీ, ఎంఈఓ దేశిరెడ్డి, ఏపీఎం ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లు ముమ్మరం
ప్రధాని పర్యటనకు సిద్ధమవుతున్న కోమటిబండ ‘భగీరథ’ను ప్రారంభించనున్న నరేంద్రమోడీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు గజ్వేల్: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 7న గజ్వేల్‌లో ‘మిషన్ భగీరథ’ పథకం ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగం రేయింబవళ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ప్రధాని కోమటిబండ అటవీ ప్రాంతంలోనిగుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్వర్్క్స ప్రాంగణంలో పథకం ప్రారంభసూచికగా నల్లాను ఆన్ చేస్తారు. ఆ తరువాత గుట్ట కింది భాగంలో బహిరంగ సభ జరుగనున్నది.సుమారు 2లక్షలకుపైగా జనసమీకరణ లక్ష్యంగా ఉండగా... అందుకు తగ్గట్లు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సభా స్థలిలో పూర్తిగా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయడానికి నిర్ణయించారు. ప్రధాని సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా వీవీఐపీల రాజీవ్ రహదారి నుంచి సింగాయపల్లి స్టేజీ, చౌదర్పల్లి మీదుగా కోమటిబండలోని సభాస్థలికి చేరుకునే విధంగా ఆ మార్గాన్ని కేటాయించబోతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కోసం వేర్వేరుగా హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నారు. సభావేదిక డిజైన్ సిద్ధం సభావేదిక కోసం ఇప్పటికే డిజైన్ సిద్ధం చేశారు. మరో రెండ్రోజుల తర్వాత సభాస్థలిని, ‘మిషన్ భగీరథ’ ప్రారంభోత్సవ ప్రదేశాన్ని కేంద్రానికి చెందిన ఎస్పీజీ బలగాలు ఆధీనంలోకి తీసుకునే అవకాశముంది. శనివారం ఏర్పాట్లన్నింటినీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. బహిరంగ సభాస్థలి చదును పనులను పరిశీలించారు. అంతకుముందు కోమటిబండ హెడ్వర్్క్స ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లపై కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో చర్చించారు. సభావేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో 3 గంటలకుపైగా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ముందుగా హెడ్వర్క్క్స ప్రాంతంలో నల్లాను ప్రారంభించిన అనంతరం సభావేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీపీసీకి చెందిన 1600 మెగావాట్ల పవర్‌స్టేషన్, ఎఫ్‌సీఐఎల్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్, వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స, మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేమార్గం పనులకు ప్రధాని శంకుస్థాపన ఇక్కడే చేస్తారని వెల్లడించారు. వర్షాల వల్ల సభకు అంతరాయం కలగకుండా రేయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చకచకా హెలిప్యాడ్ పనులు వర్గల్: ప్రధాని పర్యటన నేపథ్యంలో వర్గల్ మండలం నెంటూరు శివారులో హెలిప్యాడ్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కోమటిబండ మిషన్‌భగీరథ పథకం సంప్‌నకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నెంటూరు శివారు ప్రభుత్వ భూమిలో మొత్తం నాలుగు హెలిప్యాడ్ నిర్మాణాలు చేస్తున్నారు. ఒకటి ప్రధాన మంత్రి కోసం, రెండోది ప్రధానమంత్రి కార్యాలయ అధికారులకు, మూడోది సిబ్బంది కోసం నిర్మిస్తున్నారు. వీటికి కొద్ది దూరంలో సీఎమ్ కోసం ప్రత్యేకంగా నాలుగో హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ బాలప్రసాద్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. కంకర్, వెట్‌మిక్స్ వేసి రోలర్‌తో బాగా తొక్కించారు. సబ్‌రోడ్డు పనులను వేగవంతం చేశారు. శనివారం గడా ఓఎస్డీ హన్మంతరావు నెంటూరు సందర్శించారు. హెలిప్యాడ్ నిర్మాణ పనులు పరిశీలించారు. డిప్యూటీ ఈఈ బాలప్రసాద్‌తో మాట్లాడి పనుల పురోగతి సమీక్షించారు. పలు సూచనలు చేశారు. -
మల్లన్న సాగర్ కట్టితీరుతాం
- రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు - అడ్డుకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు - రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చిన్నకోడూరు: నాడు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకున్నాయని.. అయినా ప్రజల సంఘటితంతో రాష్ట్రాన్ని సాధించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నేడు రైతుల మేలు కోసం ప్రాజెక్టులకు పూనుకుంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. మన బతుకు దెరువు చూపేది మల్లన్న సాగర్ అన్నారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ మెతుకు సీమను తయారు చేసిది మల్లన్న సాగరేనని ఆయన చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రాజెక్టును అడ్డుకోవడానికి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
కల తీరకుండానే
♦ కన్నుమూశారు.. ♦ ఇందిరమ్మ లబ్ధిదారుల దయనీయం ♦ సొంతింటి కల తీరకుండానే కన్నుమూత ♦ ‘సమీక్ష’లో బయటపడిన వాస్తవం ♦ ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:పునాదులు తీశారు.. బేస్మెంట్ కట్టారు.. గోడలు లేపారు. పై కప్పు వేసుకుంటే ఇక గృహప్రవేశమే.. సొంతింటి కల నెరవేరబోతుందనుకున్నారు వాళ్లు.. కానీ ఏళ్లకేళ్లుగా బిల్లులు రాక.. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో దాదాపు వంద మంది చనిపోయారని, వారి ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, ఇప్పుడు వారికి బిల్లులు చెల్లించడం సాధ్యం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని, రూ.16 కోట్ల బకాయి ఉదంటూ గు‘బిల్లు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’ జిల్లా సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశానికి ఆదేశించారు. ఈ మేరకు గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం అందోల్‌లో అదీ సంగతి! ‘అందోల్ ఐఏవై ఇళ్ల స్టేటస్ ఏమిటి? డీఈ ఎవరు? ఒకసారి లేవండి. సమావేశానికి రాలేదా?..’ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నారు. ఓ ఏఈ ధైర్యం చేసి ఆందోల్‌కు రెగ్యులర్ డీఈ, ఇన్చార్జి డీఈ లేరని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆందోల్ నియోజకవర్గానికి రెండేళ్లుగా గృహనిర్మాణ శాఖ డీఈ లేరు. ఈ విషయం సమీక్ష సమావేశంలో బయటపడే వరకు జిల్లా కలెక్టర్‌కు కూడా తెలియదు. అందోల్ గృహ నిర్మాణ శాఖ డీఈ ధర్మారెడ్డిని సంగారెడ్డి నియోజకవర్గానికి డీఈగా బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. కనీసం ఇన్చార్జి కూడా లేకుండానే రెండేళ్లు గడవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పట్టింది. -
మహాప్రస్థానం స్ఫూర్తిగా..
♦ వైకుంఠధామ నిర్మాణం అనిర్వచనీయం ♦ అభివృద్ధి పనుల కంటే ఎంతో సంతృప్తి మిగిలింది ♦ హైదరాబాద్‌లోని మహా ప్రస్థానం ♦ స్ఫూర్తిగా ఏర్పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్ : తన రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టానని, నియోజకవర్గ పురోగతికి వందలాది కోట్లతో పలు అభివృద్ధి పనులను నిర్వహించానని, కానీ సిద్దిపేటలో అత్యాధునిక హంగులతో నిర్మించిన వైకుంఠథామ నిర్మాణం మాత్రం అనిర్వచనీయమైన తృప్తిని ఇచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం సిద్దిపేటలో రూ. 2 కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఆయన సిద్దిపేట ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానాన్ని రాష్ట్ర కేబినేట్, జిల్లా కలెక్టర్లతో కలిసి సందర్శించడం జరిగిందన్నారు. శ్మశాన వాటికల అర్థాన్ని మార్చి ఆహ్లదకర వాతావరణంలో నిర్మించిన మహాప్రస్థానం స్ఫూర్తిగా అనాడే సిద్దిపేటలో వైకుంఠధామం ఏర్పాటుకు ఆలోచన చేశానన్నారు. ఫినిక్స్ సంస్థ సహకారంతో రూ. 2 కోట్లతో సిద్దిపేటలో సేవభావంతో అధునాతన వసతులతో వైకుంఠధామాన్ని నిర్మించామన్నారు. ఈ నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో శ్మశాన వాటికల స్థితిగతులను మార్చే కొత్త ఒరవడికి సిద్దిపేట నాందిగా నిలిచిందన్నారు. ఫినిక్స్ సంస్థ పనుల నిర్వహణలో రాజీపడకుండా అత్యాధునికంగా నిర్మించారని వారికి భగవంతుని అశీస్సులు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో మరో రెండు వైకుంఠధామాలను సిద్దిపేటలో నిర్మించడమే కాకుండా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో నిర్మాణానికి ఫినిక్స్ సంస్థతో కృషి చేస్తామన్నారు. స్మృతి వనం.. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కనిపించని కొత్త ఒరవడిని సిద్దిపేట వైకుంఠధామంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట పరిసరా ప్రాంతాలకు చెందిన ప్రజల్లోని తమ ఆత్మీయులు మృతి చెందినప్పుడు వారి సంస్మరణార్థం వైకుంఠధామంలోని స్మృతివనంలో మొక్క నాటే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. చనిపోయిన ఆత్మీయుల జ్ఞాపకార్థ ఒక మొక్కను వారి పేరిట నాటి సంరక్షణ బాధ్యతను చేపడతామన్నారు. అదే విధంగా బర్డ్గార్డెన్ను, పార్కును ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. అంతకు ముందు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, ఫినిక్స్ సంస్థ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని హైదరాబాద్ మహప్రస్థానం తర్వాత అదే స్థాయిలో సిద్దిపేటలో వైకుంఠధామ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇందుకు మంత్రి హరీశ్‌రావు కృషిని అభినందించారు. కార్యక్రమంలో జేసీ వెంకట్రాంరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్నా, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, పాలసాయిరాం, బర్లమల్లికార్జున్, మారెడ్డి రవీందర్‌రెడ్డి, శర్మ, మాణిక్యారెడ్డి, జాపశ్రీకాంత్రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. సిద్దిపేట ఏరియా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సర్కార్ వైద్యంపై హరీశ్‌రావు ఆరా.. సిద్దిపేట జోన్ : పేద ప్రజలకు అందుతున్న సర్కార్ వైద్యం, ప్రభుత్వ వసతుల గూర్చి రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. మంగళవారం రాత్రి సిద్దిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన బాధితులను, వారి కుటుంబ సభ్యులను వైద్య సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యం సరిగా అందుతోందా.. వైద్యం కోసం సిబ్బంది డబ్బులు అడుగుతున్నారా.. వసతులు సరిగా ఉన్నాయా.. అంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్వరలో ప్రారంభించనున్న ఐసీయూ యూనిట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఐసీయూ యూనిట్ సిబ్బంది శిక్షణ విషయం, సిద్దిపేట ప్రాంత వాసుల కోసం డయాలసిస్ యూనిట్ ఏర్పాటు, సీటీ స్కాన్, డెంగీ బాధితులకు రక్త కణాలను అందించే ప్లేట్లెట్స్ సెంటర్ ఏర్పాటు తదితర విషయాలను వైద్యశాఖా మంత్రి లకా్ష్మరెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిష్కారించారు. సిద్దిపేట ముంగిట్లో కార్పొరేట్ వైద్యం సిద్దిపేట ప్రాంత పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో రూ. 1.25 కోట్లతో ఐసీయూ యూ నిట్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నా రు. ఈ నెల 17న మంత్రి లకా్ష్మరెడ్డితో కలిసి ఐసీయూ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు అదే విధంగా డెంగీ బాధితులకు రక్షణగా నిలిచే ప్లేట్లెట్స్ సపరేటర్ కేంద్రాన్ని, కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం డయలసిస్ యూనిట్, సీటీ స్కాన్ సెంటర్‌ను, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల కోసం ఏఆర్టీ కేంద్రాన్ని, సిద్దిపేట ఆసుపత్రికి వచ్చే వారికి, పట్టణంలోని అభాగ్యుల కోసం ఏరియా ఆసుపత్రిలో రూ. 1.25 కోట్లతో నైట్ షెల్టర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు మంత్రి కోమటి చెరువు అధునీకరణ పనులను పరిశీలించారు. -
చంద్రబాబు పరార్
♦ ‘ఓటుకు కోట్లు’ దెబ్బతో హైదరాబాద్ వదిలారు ♦ ‘సాక్షి’తో మంత్రి హరీశ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అది మంత్రి హరీశ్‌రావు అధికారిక నివాసం.. ‘నా కొడుకు గుండెకు రంధ్రం పడింది.. ఆపరేషన్‌కు డబ్బు లేదు’ అని ఓ తండ్రి కన్నీళ్లు. ‘నా పెనిమిటిని పోలీసులు పట్టుకపోయిండ్రయ్యా’ అని ఓ మహిళ ఆవేదన. ‘బోరు బాయికి కరెంటు కనెక్షన్ అడిగితే ఏఈ సారు దమ్ము దమ్ము జేస్తున్నడు’ అని ఓ రైతు మొర.. వారందరి బాధలు వింటూ అధికారులకు ఫోన్లు కలుపుతున్నారు మంత్రి. కచ్చితంగా పని చేయాలని ఆదేశాలిస్తున్నారు. ఎన్నికల స్పెషలిస్టుగా.. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావును ‘సాక్షి’ పలకరించగా.. తన మనసులోని భావాలను ఇలా బయటపెట్టారు. మంత్రి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. బాబు ఎత్తుగడలు తెలియనివి కావు.. చంద్రబాబు నాయుడు ఎన్నికల ఎత్తుగడలు మనకు తెలియనివి కావు. ఆరు నెలల ముందే డబ్బు ఎక్కడెక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చి రాజకీయాలు చేస్తారు. పత్రికలు, ప్రెస్మీట్లతో నానా హడావుడి చేసేవారు. కానీ ‘ఓటుకు కోట్లు’ దెబ్బతో హైదరాబాద్ వదిలి పరారయ్యారు. ఆరు నెలల నుంచి ఇక్కడ అసలు కనిపించడం లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నాయకుడు లేని సేనల తీరుగా మారింది. ఇక గ్రేటర్లో వాళ్లకు గెలుపు పరిస్థితి ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ. దీటుగా నడిపించే నాయకుడు లేడు. మెజారిటీ స్థానాలు కాదు... నాకు ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ గ్రేటర్లో కేవలం 10 సీట్లయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. కేవలం ఆ 10 సీట్ల మీదనే కసరత్తు చేస్తూ కాలం గడుపుతోంది. హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో బీజేపీ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. అందులోంచి ఎలా బయట పడాలని వాళ్లు ఆలోచన చేస్తున్నారు. ఈ కేసు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మెడకు చుట్టుకుంది. ఆయన పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా ఉసురు పోసుకోవాలా? నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నారాయణఖేడే. ఇక్కడి ప్రజలు కనీస మౌలిక వసతులకు దూరంగా ఉన్నారు. తాగడానికి సురక్షితమైన నీళ్ల సంగతి దేవుడెరుగు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కాలేజీలు ఏమీ లేవు. కుటుంబంలో సగటున ఒకరి జీవితం మొత్తం నీళ్లు మోయడానికే సరిపోతుంది. రికార్డులు చూస్తే రూ.వందల కోట్లు నారాయణఖేడ్‌కు కేటాయించినట్లు ఉంది. మరి ఈ నిధులు ఎటుపోయాయి. ఆస్పత్రులు, కాలేజీలు అన్ని వాళ్ల కుటుంబాలకే. వైద్యం చేయించుకోవాలంటే వాళ్ల ఆసుపత్రికే వెళ్లాలి.. చదువుకోవాలంటే వాళ్ల కాలేజీకే వెళ్లాలి. ఇక్కడి ప్రజల ప్రధాన జీవన ఆధారం వ్యవసాయం. కానీ ఇప్పటి వరకు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ లేదు. ఎవరు కారణం? సింపతీ కోసమని మళ్లీ ఆ కుటుంబానికే అధికారం అప్పగించి లక్షల మంది నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకోవాలా? మిగిలిన రాష్ట్రా ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన చోట కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. రాష్ట్రానికో నీతి అవలంబిస్తామంటే ఎలా కుదురుతుంది? పైగా ఓ కుటుంబం ఈ పర్యాయం పోటీ చేస్తే, మరో కుటుంబం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ప్రజా సేవ అంటే ఒప్పంద పత్రాలు రాసుకోవడమా? త్వరలోనే చెంచులను కలుస్తా ఓ జర్నలిస్టు మిత్రుడు రాసిన ‘మరణం అంచున’ పుస్తకావిష్కణ సభలో నల్లమల చెంచులను కలవటం జరిగింది. నిజంగా చెంచులు కల్మషం లేని మనుషులు. చెంచు జాతి అభివృద్ధి కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని ఆ రోజు సభలో మాట ఇచ్చాను. వాళ్లు నా కోసం ఎదురు చూస్తుంటారు. వీలైనంత త్వరలో మరోసారి నల్లమలకు వెళ్తా. అడవిలో తిరిగి చెంచులను కలుస్తాను. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తా. చెంచు జాతి రక్షణ కోసం ఏమేమి చేయాలో అవి తప్పకుండా చేస్తాం. అపురూపమైన ఆ జాతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. నీళ్లు కావాలా? మొసలి కన్నీళ్లు కావాలా? నారాయణఖేడ్‌లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాం. దాదాపు రూ.750 కోట్లతో మిషన్ భగీరథ పనులు ప్రారంభించాం. ప్రతి గ్రామాన్ని కలుపుతూ బీటీ రోడ్డు వేస్తున్నాం. నారాయణపేట, పెద్ద శంకరంపేట పట్టణాల్లో వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేశాం. దుబ్బాక తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంతకాలం నియోజకవర్గ అభివృద్ధి నిరోధకులే మళ్లీ ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. తండ్రి చనిపోయాడంటూ మొసలి కన్నీళ్లతో సింపతీ ఓట్లు పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నీళ్లు కావాలో? మొసలి కన్నీళ్లు కావాలో నారాయణఖేడ్ ప్రజలకు తెలుసు. అభివృద్ధి అంటే ఏమిటో కళ్లారా చూస్తున్నారు. ఎవరికి ఓటేయాలో.. ఎవరిని గెలిపించాలన్నదానిపై ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. -
పదహారు పద్దులకు ఆమోదం
రాత్రి తొమ్మిది వరకు నిరాఘాటంగా కొనసాగిన సభ అర్థవంతమైన చర్చ కోసమే: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌కు సంబంధించి శాసనసభ పదహారు పద్దులకు ఆమోదం తెలిపింది. పురపాలన -పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, భారీ, మధ్యతరహా నీటిపారుదల, చిన్నతరహా నీటిపారుదల, ఇంధనం, రెవెన్యూ రిజిస్ట్రేషన్ సహాయం, ఆబ్కారీ నిర్వహణ, వాణిజ్య పన్నుల నిర్వహణ, రవాణా నిర్వహణ, హోం పాలన, వ్యవసాయం, పశుసంవర్ధన, మత్స్యాగారాలు, సహకారం, పౌర సరఫరాల నిర్వహణ పద్దులకు సభ ఆమోదం తెలిపింది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు నిర్విరామంగా ఈ పద్దులపై చర్చ కొనసాగింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయని ప్రకటించిన స్పీకర్ రాత్రి తొమ్మిదింటికి ఆయా పద్దులు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందించాలి: హరీశ్‌రావు ప్రజా సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని, దానికి ప్రస్తుతం సభ జరుగుతున్న తీరే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి పద్దులపై చర్చ అనంతరం ఆయన సభలో మాట్లాడారు. గతంలో ఇలా సభను నిర్వహిం చిన దాఖలాలు లేవని, కనీవినీ ఎరుగని రీతిలో తాము పద్దులపై అర్ధవంతమైన చర్చకు అవకాశం కల్పించామన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా టీడీఎల్పీ తరహాలో అధికారపక్షం సభను నిర్వహిస్తోందని, దాన్ని గమనించి తెలంగాణ సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందిస్తాయని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణకు కమిటీలు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఇతర జలవనరులపై చర్చించడానికి త్వరలోనే అఖిలపక్షంతో సమావేశం కానున్నట్టుగా హరీశ్‌రావు వెల్లడించారు. మిషన్ కాకతీయకు ఇది మొదటి సంవత్సరం కాబట్టి ప్రాథమిక సమస్యలుంటాయని, అన్నింటిపై సమగ్రంగా చర్చించడానికి అన్ని పార్టీలతో సీఎం సమావేశం అవుతారన్నారు. భూముల రీ-సర్వే: మహమూద్ అలీ త్వరలో భూములను రీసర్వే చేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భూములను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. గీతదాటే వైన్స్‌లపై వేటు: పద్మారావు నిబంధనలను ఉల్లంఘించిన కల్లు, వైన్స్ దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు స్పష్టంచేశారు. ప్రార్థనామందిరాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 100 మీటర్లలోపు వైన్స్‌లు ఉన్నాయని సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మూసేస్తామన్నారు. కల్లుగీత వృత్తిలో ఇతర కులాలకు కొన్ని ప్రాంతాల్లో లెసైన్సులు ఇచ్చామన్నారు. పన్నులు పెంచేది లేదు: తలసాని వాణిజ్య పన్నులు పెంచాలని, టెక్స్టైల్ వంటివాటికి పన్నును విస్తరించాలనే యోచన ప్రభుత్వానికి లేదని వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బస్టాపుల్లో టాయిలెట్లు: మహేందర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న బస్టాపుల్లోనూ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు రోడ్డు, రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో 500 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి నడిపించడానికి 100 ఏసీ బస్సులు, గ్రామీణ ప్రాంతాల్లో నడిపించడానికి 400 పల్లెవెలుగు కోసం కేటాయించినట్టు వెల్లడించారు. వ్యవసాయానికి పదేళ్ల యాక్షన్ ప్లాన్: చెన్నమనేని అంతకు ముందు పద్దులపై సుదీర్ఘ చర్చ జరిగింది. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అన్నారు. ‘సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు అని సరైన ప్రాధాన్యతలనే ప్రభుత్వం నిర్ణయించుకుంది. వ్యవసాయానికి సంబంధించి తక్కువ దిగుబడి, ఎక్కువ వ్యయం అనేది సమస్యగా ఉంది. దీనిని అధిగమించేందుకు పదేళ్ల కాలానికి వ్యవసాయ పర్స్పెక్టివ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటే ఉత్పాదకతను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. జానా బాగుందంటున్నారు..ఎమ్మెల్యేలు బాలేదంటున్నారు బడ్జెట్ బాగా ఉందని ప్రతిపక్షనేత జానారెడ్డి మెచ్చుకుంటే, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాగా లేదంటూ విమర్శిస్తున్నారని టీఆర్ఎస్ సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యానిం చారు. ‘పనికి ఆహారపథకాన్ని సిమెంట్ పనులు, మిషన్ కాకతీయకు, చెరువుల పూడికతీత ఇతర పనులకు మళ్లించాలి’ అని కోరారు. విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలి: చింతల రామచంద్రారెడ్డి విశ్వనగరంలో హైదరాబాద్‌ను పేర్కొంటున్నా అంతర్గతంగా పరిస్థితి భయంకరంగా ఉంది. విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ‘వీసా గడువు ముగిసిన విదేశీయులు ఎంత మంది ఇక్కడ ఉన్నారో లెక్కలు తీయాలి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ట్రాఫిక్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలి’ అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పర్మిట్‌రూమ్‌ల వల్ల ఆగడాలు: ఖాద్రీ మద్యం దుకాణాల పక్కనే పర్మిట్‌రూమ్‌లకు అనుమతినివ్వడం వల్ల రోడ్లపై ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని ఖాద్రీ (ఎంఐఎం) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. -
‘న్యాక్’ వివాదం కొత్త మలుపు
సీఎం చైర్మన్‌గా కొత్త పాలక మండలి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఉత్తర్వులిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ముదిరిన లొల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) వివాదం కొత్త మలుపు తిరిగింది. న్యాక్‌కు ఆంధప్రదే శ్ సీఎం చైర్మన్‌గా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన 48 గంటల్లోనే... తెలంగాణ ప్రభుత్వం పాలక మం డలిని నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, రోడ్లు భవనాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, న్యాక్ డీజీ సభ్య కార్యదర్శిగా, మరో 23 మందిని సభ్యులుగా పేర్కొంటూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో న్యాక్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగింది. ఇప్పటికే పలు సమావేశాల పేరుతో తెలంగాణ సీఎం తరచూ న్యాక్‌కు వెళ్తున్నారు. ఏపీ సీఎం అక్కడికి వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారటం ఖాయమని అధికారులు పేర్కొంటున్నా రు. సొసైటీ జాబితాలో ఉన్నందున న్యాక్ విభజన జరగలేదు. సొసైటీల చట్టాన్ని మార్చనందున న్యాక్ తమకే దక్కుతుందని ఏపీ వాదిస్తుండగా, తెలంగాణలో ఉన్నం దున మాకే చెందుతుందని ఈ ప్రభుత్వం పేర్కొంటోంది. పాలక మండలిలో సభ్యులు వీరే... తెలంగాణ ప్రభుత్వం న్యాక్‌కు ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యులు వీరే.. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ డీజీ, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఢిల్లీ) అధ్యక్షుడు, ఆ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఢిల్లీ) చైర్మన్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ రీసెర్చ్ కౌన్సిల్ (ఢిల్లీ) డెరైక్టర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ క న్‌స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెరైక్టర్, జేఎన్టీయూ వీసీ, ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డీజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ, గృహ నిర్మాణం, ఆర్అండ్బీ, పురపాలక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వీసీఎండీ, గృహ నిర్మాణ సంస్థ, పోలీసు గృహ నిర్మాణ సంస్థల ఎండీలు, ఆర్అండ్బీ ఈఎన్సీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్, డీఆర్డీవో అడిషనల్ డీజీలు. చంద్రబాబు నోట నీతులు.. చేతల్లో రోతలు: మంత్రి హరీశ్‌రావు ఏపీ సీఎం చంద్రబాబు నోటితో నీతు లు చెబుతూ రోత పనులకు దిగజారుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ‘న్యాక్’ కేంద్ర గవర్నింగ్ బాడీకి చంద్రబాబే చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఫిబ్రవరి దాకా గవర్నింగ్ బాడీకి కాలపరిమితి ఉన్నా ఇప్పటికిప్పుడే చంద్రబాబు స్వయంగా చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణతో వివాదాలు, గొడవలు పెట్టుకోవడానికే ఈ గవర్నింగ్ బాడీని ఏర్పాటుచేశారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును సమర్థించిన టీటీడీపీ నేతలు హైదరాబాద్ న్యాక్‌కు చంద్రబాబు ఉండాలని సమర్థిస్తరా.. వ్యతిరేకిస్తరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. -
ఎస్ఎల్బీసీ ధరలపై అదే సందిగ్ధం
2010 నుంచే పెంచిన ధరలు ఇవ్వాలన్న కాంట్రాక్టు సంస్థ జూన్ 2 తర్వాత నుంచే చెల్లిస్తామన్న ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థ కోరినట్టు చెల్లిస్తే సర్కారుపై రూ.250 కోట్ల భారం మంత్రి హరీశ్ సమక్షంలో పలు పార్టీలు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ధరల సర్దుబాటు అం శం ఎటూ తేలలేదు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2010 నుంచి ధరల సర్దుబాటును పరిగణనలోకి తీసుకుని రూ.750 కోట్ల మేర చెల్లించాలని ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ కోరగా.. తాము అధికారంలోకి వచ్చినప్పట్నుంచి (జూన్ 2, 2014) అయ్యే ఖర్చులను మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాంట్రాక్టు సంస్థ కోరిన విధంగా ధరల సర్దుబాటు చేస్తే ఖజానాపై ఏకంగా రూ.250 కోట్ల భారం పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోసారి భేటీ అయి ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. మేం వచ్చినప్పట్నుంచే ఇస్తాం.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించి అసంపూర్తిగా మిగిలిన మరో 19.8 కిలోమీటర్ల పనులపై గురువారం సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొనసాగింపుగా శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ నిర్వహించారు. దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎంవీవీఎస్ ప్రభాకర్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జయప్రకాశ్ అసోసియేషన్ కాంట్రా క్టు సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు ప్రాజెక్టు పనులు, కాంట్రాక్టరు కోరుతున్న ధరల సర్దుబాటు అంశాలపై చర్చించారు. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.750 కోట్ల మేర ఎస్కలేషన్ చెల్లింపులతో పాటు మరో రూ.150 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు. 2010 నుంచి స్టీలు, సిమెంట్, ఇంధనల ధరలను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇందుకు ప్రభుత్వంతో సహా అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 2010 ధరలను పరిగణనలోకి తీసుకొని చెల్లిస్తే ప్రభుత్వంపై అదనంగా రూ.250 కోట్ల మేర అదనపు భారం పడుతుందని వెల్లడించాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన కాంట్రాక్టు సంస్థ కనీసం 2012 నుంచైనా ధరలు చెల్లించాలని కోరింది. ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన జాప్యానికి తమకు సంబంధం లేదని, తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచే పెరిగిన ధరలను చెల్లిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి విపక్ష పార్టీలన్నీ అంగీకారం తెలిపాయి. మధ్యేమార్గంగా ఓ నిర్ణయానికి రావాలని సూ చించాయి. దీంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రూ.100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేం దుకు ప్రభుత్వం సానుకూలత తెలిపింది. ప్రజలపైభారం మోపకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి తాటి వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. -
ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు
చెరువుల పునరుద్ధరణ పై మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లను పిలుస్తామని చెప్పారు. నామినేషన్ల విధానంలో పనులకు ఏమాత్రం ఆస్కారం లేదని చెప్పారు. తూములను, అలుగుల ను పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలంగాణలో 10జిల్లాలకు ఐదుగురుఎస్ఈలు మాత్రమే ఉన్నారని, ఇప్పుడు జిల్లాకో ఎస్ఈని నియమిస్తామని చెప్పారు. ప్రతీ రెండు మూడు నియోజకవర్గాలకు కలిపి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని నియమిస్తామన్నారు. అలాగే ప్రతీ మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)ని నియమిస్తామన్నారు.ప్రతీ ఏఈకి సర్వే పరికరాలు, ఒక ల్యాప్‌టాప్ ఇస్తామన్నారు. పనులకు సంబంధించిన ఫొటోలను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు నెట్లో అందరికీ అందుబాటులో ఉండేలా అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో అన్ని చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. రజకులు, ముదిరాజ్‌లు, రైతులందరినీ భాగస్వామ్యం చేస్తామన్నారు. అంతకు ముందు టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, పూడికతీత పనులను పారదర్శకతతో చేయాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ ఒక్క కాకతీయులే చెరువులు తవ్వించలేదని, తమ ప్రాంతంలోని రాజులు కూడా చెరువులు తవ్వించారని, చెరువుల పునరుద్ధరణ పనులకు ‘మిషన్‌కాకతీయ’ పేరు ఎలాపెడతారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి మెగావాట్ల సోలార్‌పార్కు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక సోలార్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందుకోసం 5,481.86 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం 1500 వ్యవసాయ సోలార్ పంపుసెట్లను మంజూరు చేసిందన్నారు. మార్కెట్ కమిటీల కంప్యూటరీకరణ ఏడాదికి 20 నుండి 30 వ్యవసాయ మార్కెట్ కమిటీలను కంప్యూటరీకరిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల వీరేశంలు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. బహిరంగ వేలంపాటల స్థానంలో ఈ-టెండర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద్, వి.శ్రీనివాస్‌గౌడ్‌లు అడిగిన ప్రశ్నకు ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ లిఖితపూర్వక సమాధానమిస్తూ 80చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్న 6,707 ఆక్రమిత స్థలాలతోపాటు 13,134 ఇళ్లను క్రమబద్ధీకరించామని తెలిపారు. -
విద్యుత్ కష్టాలకు బాబే కారణం
రఘునాథపల్లి : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కష్టాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రఘునాథపల్లి మండలంలోని శ్రీమన్నారాయణపురంలో శనివారం ఆయన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యమ నేత కాసం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలు ఎలాం టి స్ఫూర్తి చూపారో... అభివృద్ధిలో ముం దుకు సాగకుండా అడ్డుకుంటున్న శక్తులపైనా అదే స్ఫూర్తి చాటాలన్నారు. తెలంగాణ అమరవీరుల రుణం తీర్చుకోనిదని, వారి కుటుంబాలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారంతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఉద్ఘాటిం చారు. అమరులెందరున్నా... ఆదుకుంటామన్నారు. అమరుల జ్ఙాపకార్థం స్థూపం నిర్మించిన సత్యనారాయణ, చింత స్వామి అభినందనీయులన్నారు. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రజ ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నారన్నారు. అనంతరం మంత్రులను టీఆర్ఎస్ నేతలు గజమాలతో సత్కరించారు. సమావేశంలో ఎంపీ కడియం శ్రీహరి, జిల్లాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, జనగామ, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, వినయ్‌బాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్‌నాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజలింగం, జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యులు బానోతు శారద, రంజిత్‌రెడ్డి, సర్పంచ్ మాచర్ల సోమలక్ష్మి, నాయకులు గొరిగ రవి, నామాల బుచ్చయ్య, మారుజోడు రాంబాబు, గోపాల్‌నాయక్, దాసరి బుగ్గయ్య, శేరి లక్ష్మారెడ్డి, గైని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జిల్లాకు ఎస్సారెస్పీ జలాలు
కాకతీయ కాల్వ ద్వారా విడుదల కేవలం మెట్ట ప్రాంతాలకు మాత్రమే.. 70 వేల ఎకరాలకు ప్రాణం ఈ నెల 16 వరకు రెండు టీఎంసీలు విడుదల హన్మకొండ : జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ఎస్సారెస్పీ జలాలను విడుదల చేశారు. నీటి లభ్యత లేని వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లితో పాటు ములుగు, నర్సంపేట ప్రాంతాలకు కాకతీయ ప్రధాన కాల్వ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాంతాల్లో 70 వేల ఎకరాలకు అదును సమయంలో కాల్వ నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం కాల్వ ఆయకట్టులో వేసిన పంటలు ఎండిపోయో దశకు చేరుకోవడం, సాగునీరు అందించేందుకు ఎలాంటి సదుపాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడం అక్కడి రైతులకు ఉపశమనం కలిగించినట్లయింది. ప్రస్తుతం విడుదల చేసిననీటిని కాకతీయ కాల్వ 194 కిలోమీటర్ నుంచి డీబీఎం 31 వరకు(234వ కిలోమీటర్) ఆయకట్టుకు అందించనున్నారు. ఇక్కడ వినియోగించుకుని, మిగిలిన నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీ నుంచి దిగువకు రెండు రోజుల క్రితమే నీరు విడుదల చేసినా... కాల్వ ఆయకట్టులో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉండటంతో విడుదల చేసిన నీరు కాల్వల నుంచి జిల్లాకు వచ్చేందుకు రెండు రోజుల సమయం పట్టింది. ఈ మేరకు ఎస్సారెస్పీ జలాలు శుక్రవారం ఉదయం జిల్లాకు చేరాయి. మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో... మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్య, ప్రత్యామ్నాయాలు లేని విషయమై పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, ములుగు, నర్సంపేట సెగ్మెంట్ల నుంచి రైతుల తరఫున ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడం తప్ప వేరే మార్గం లేదని వారు మంత్రికి విన్నవించారు. అయితే, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఇన్‌ఫ్లో రాకపోవడంతో మంత్రి నీటి విడుదలకు అడ్డంకి చెప్పారు. కానీ కాల్వ నీటిపైనే ఆధారపడి సేద్యం చేస్తుండడం, కరెంటు కోతతో మోటార్లు సాగక పంటలన్నీ ఎండిపోయే దశకు చేరిన నేపథ్యంలో పంటలకు ప్రమాదం వాటిల్లుతోందని గుర్తించిన మంత్రి ఎల్ఎండీ నుంచి రెండు టీఎంసీల నీరుని విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. కాకతీయ కాల్వ ద్వారా రోజుకు రెండు వేల టీఎంసీల నీటిని విడుదల చేయాలని అత్యవసర ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఈనెల 7వ తేదీనే నీరు విడుదల చేసిన అధికారులు ఆయకట్టులో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ నీటి విడుదల విషయం తెలుసుకున్న రైతులు కాల్వల వెంట పడిగాపులు ఉన్నారు. మోటర్లు, జనరేటర్ల సాయంతో కాల్వలో పారుతున్న నీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారు. ఫలితంగా జిల్లాకు కొంత ఆలస్యంగా శుక్రవారం ఎస్సారెస్పీ నీరు చేరింది. ఈనెల 16 వరకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేయనుండగా, డీబీఎం 31 వరకు ఈ నీటిని పూర్తిస్థాయి ఆయకట్టుకు అందిస్తామని ఎస్సారెస్పీ స్టేజ్-1 ఎస్ఈ సుధాకర్‌రెడ్డి చెప్పారు. ప్రధానంగా వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లితో పాటు నర్సంపేట, ములుగు ప్రాంతాల్లోని 70వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. ప్రస్తుత పరిస్థితి మేరకు 16వ తేదీ వరకు నీరు విడుదల చేస్తామే తప్ప ఆ తర్వాత చుక్క నీరు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, అదను సమయంలో కాల్వల ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులకు ఉపశమనం కలిగినట్లయింది. ఈ ఒక్క తడితోనైనా పంటలకు ప్రాణం వస్తుందని వారు ఆశ పడుతున్నారు.