కాళేశ్వరం పనులను వేగవంతం చేయాలి
- జిల్లాల పునర్విభజనకు ముందే భూసేకరణ
- సమన్వయంతో లక్ష్యాన్ని సాధించండి
- అధికారుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్:కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ , దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో కాళేశ్వరం పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు.
అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రాథమిక దశలను సమస్య పరిష్కారం కోసం ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు సహకరించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. మార్కింగ్ ఏజెన్సీలతో సరిగ్గా పనిచేయించుకోవాలన్నారు. కొత్త జిల్లాల పునర్విభజనకు ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు సమ్మతి ఇచ్చిన తర్వాత రిజిష్ట్రేషన్లు ఎందుకు చేయడం లేదని ఇలా జాప్యం చేయకుండా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి ఇరిగేషన్, రెవెన్యూ సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.
వీటితో పాటు రంగనాయకసాగర్ ఎడమ, కుడి కాలువ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట , చిన్నకోడూరు మండలాల్లో వివిధ దశల్లో ఉన్న భూసేకరణ, భూ తగదాల విషయాలపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన చర్చించారు.
జీవో నంబర్ 123 ప్రకారం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అప్పగించే క్రమంలో వారికి తరుగుదల లేకుండా తగినహోదా ఇచ్చేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో జరిగే పనుల రిపోర్టును అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలన్నారు. సమీక్షలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఇరిగేషన్ సీఈ హరిరాం, ఎస్‌ఈ వేణు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ ఆనంద్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.