రెండు కోట్లతో సిద్దిపేటలో స్టడీ సర్కిల్ ఏర్పాటు
- అన్నగా చెబుతున్నా.. ఇష్టపడి చదవండి
- ఉద్యోగం సాధించండి
- రూ. కోట్లతో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశా..
- సద్వినియోగం చేసుకున్నప్పుడే సార్థకత
- స్టడీ సర్కిల్ కేంద్రంలో మంత్రి హరీశ్
సిద్దిపేట జోన్:‘ఉచితం అనగానే విలువ ఉండదు. అది మానవ సహజ గుణం. రెండు కోట్లతో సిద్దిపేట ప్రాంతంలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశా. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నప్పుడే నా ప్రయత్నానికి సార్థకత. శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందితే నాకు సంతృప్తి మిగులుతుంది. విద్యార్థుల్లో సీరియస్‌నెస్ ఉండాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే భావితరాల్లోని మీ తమ్ముళ్లకు , చెల్లెళ్లకు ఇబ్బంది కావొద్దు. అన్నగా చెబుతున్న ఎంపికైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్లాస్‌లకు హాజరుకావాల్సిందే..’ అంటూ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం విద్యార్థులకు హితబోధ చేశారు.
సిద్దిపేటలో పర్యటిస్తున్న క్రమంలో మంత్రి ఆకస్మికంగా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న కోఆర్డీనేటర్ శ్రీనివాస్‌తో మంత్రి హరీష్‌రావు శిక్షణ ప్రక్రియపై ఆరా తీశారు. సిద్దిపేట సెంటర్‌కు వంద సీట్లు మంజూరుకాగా 83 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు కోఆర్డినేటర్ మంత్రికి వివరించారు. స్పందించిన ఆయన తనీఖీ సమయంలో కేవలం 33 మంది మాత్రం ఉండడం సరైంది కాదన్నారు.
కాగా వంద సీట్లను భర్తీ చేయాల్సిందేనని మిగిలిన 15 సీట్లను ఎస్సీ, ఎస్టీ, ఓసీ, విద్యార్ధులచే వెంటనే భర్తీ చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. స్టడీ సర్కిల్‌లో చేరి మూడు రోజుల పాటు వరుసగా శిక్షణ తరగతులకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో సెంటర్ నిర్వహకులు వెంటనే మాట్లాడి హాజరుశాతాన్ని పెంచాలన్నారు. మంత్రి వెంట ఓఎస్డీ బాల్‌రాజు, టీఆర్‌ఎస్ నాయకులు శర్మ, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, శేషుకుమార్ తదితరులు ఉన్నారు.