భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలి
రెవెన్యూ అధికారులకు మంత్రి ఆదేశాలు
సిద్దిపేట జోన్:జిల్లా కేంద్రంగా త్వరలో ఏర్పాటు కానున్న సిద్దిపేట పట్టణ సరిహద్దు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా భూకబ్జాలు ,ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారు? అసలు విధులు నిర్వహిస్తున్నారా లేదా? తెలిసి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కబ్జాలపై కఠినంగా వ్యవహరించండి’ అంటూ మంత్రి హరీశ్‌రావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆదివారం పట్టణంలో పర్యటిస్తున్న క్రమంలో మంత్రి నర్సాపూర్ శివారులో చేపడుతున్న డబుల్ బెడ్‌రూం నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 12 గుంటల భూమి అసైన్డ్ అయిన విషయం తెలుసుకున్న మంత్రి రెవెన్యూ అధికారులతో ఆరా తీశారు. ఒక దశలో పొన్నాల గ్రామ శివారుల్లో అనుమతులు లేకుండానే నిర్మాణాలు ఇష్టానుసారంగా జరుగుతున్నప్పటికీ, భూకబ్జాలు , అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నప్పటికి రెవెన్యూ అధికారుల్లో స్పందన లేకపోవడం సమంజసం కాదన్నారు. ఆసలు రెవెన్యూ అధికారులు తిరుగుతున్నారా.. లేదా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఆర్డీఓ ముత్యంరెడ్డికి సంబంధిత అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం డబుల్ బెడ్‌రూం పథకం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. పనులను వేగవంతం చేయాలని సూచించారు. దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోడికి సొంత ఇంటికల నిజంచేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు.పేదల పెన్నిధిగా కేసీఆర్ చరిత్రలో నిలువడం ఖాయమన్నారు. సిద్దిపేటలో రూ. 118 కోట్లతో డబుల్ బెడ్‌రూం పథకం కింద 1968 మందికి గృహ వసతి కల్పించడం జరుగుతుందన్నారు. సిద్దిపేటలో జీ ప్లస్‌టూ పథకంలో కొనసాగుతున్నాయన్నారు. ఆయన వెంట దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.