bhukabjalu
-
టీడీపీ తోడు నిఘా జోడు
నిఘా వ్యవస్థలో కీలక భూమిక పోషించే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల్లో కొందరు అధికార పార్టీ నాయకుల్లా పనిచేస్తున్నారు. భద్రతను పక్కనపెట్టారు. కేవలం టీడీపీ కోసమే తాము ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, వారి అనుచరుల కదలికలపై నిత్యం నిఘా పెట్టారు. వారు ఎక్కడికెళ్లినా.. ఎవరిని కలిసి మాట్లాడినా ఆ వివరాలను ఆఘమేఘాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా కుప్పం, చంద్రగిరి, చిత్తూరు, తిరుపతి, పలమనేరుతో పాటు పలు నియోజక వర్గాల్లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సీఎం పీఏ మనోహర్ కనుసన్నల్లో నడుచుకుంటున్నారు. మనోహర్, స్పెషల్ బ్రాంచ్ ముఖ్య అధికారి రాంకుమార్ ఆదేశించిన రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఐదేళ్ల పాలనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీవైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. దిక్కుతోచని టీడీపీ అధినేత ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఆశ్రయించారు. సొంత పార్టీ నేతలు, వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రధానంగా నిఘా పెట్టమని ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అధి కారులు వారి వాహనాలు, ముఖ్య అనుచరుల కదలికలపై దృష్టి సారించారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఇటీవల ఎనిమిది మంది టీడీపీ, స్వతంత్ర కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వాస్తవానికి 20 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో చేరాల్సి ఉంది. ఎవరెవరు పార్టీలో చేరుతున్నారనే వివరాలను ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలుసుకుని సీఎం పీఏ, టీడీపీ ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు కార్పొరేటర్లను నయాన, భయాన ఒప్పించే ప్రయత్నం చేశారు. పార్టీ మారితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిం చారు. దీంతో వారు వెనుకడుగు వేశారు. గతవారం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీలోకి వస్తున్నారని తెలుసుకున్న మేయర్ హేమలత, ఆమె భర్త కఠారి ప్రవీణ్ పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లిన నిఘా విభాగానికి చెందిన అధికారులు ‘పార్టీ వీడొద్దు.. వీడితే మీరు రోడ్లపై కూడా తిరగలేరు. పాత కేసులు తిరగదోడుతాం’ అంటూ భయపెట్టారు. మేయర్ దంపతులు పార్టీ మారేందుకు సాహసించలేదు. టీడీపీ బీసీ నేత రావూరి ఈశ్వరరావు ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ‘మళ్లీ మాట్లాడొద్దంటూ’ ఈశ్వరరావుకు హుకుం జారీ చేశారు. అంతటితో విడిచిపెట్టలేదు. ఆయనను చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ వద్దకు తీసుకెళ్లారు. సీఎంతో చెప్పి చుడా (చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ ఇప్పిస్తామని ఈశ్వరరావును శాంతపరిచారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మరికొందరు టీడీపీ కార్యకర్తలను ఇంటెలిజెన్స్ అధికారులు బెదిరించి పార్టీ మారకుండా ఆపించారు. కుప్పం.. చంద్రగిరిలో బహిరంగం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం, సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికా రులు బహిరంగంగానే టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. రామకుప్పం మండలం విజిలాపురంలో ఇటీవల మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకులు అడ్డుపడి రచ్చరచ్చ చేశారు. ఇంటెలిజెన్స్, పోలీసులు అక్కడే ఉన్నా వారించకపోగా వీడియో చిత్రీకరించారు. ఆపై వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసే విషయంలో కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో విలువైన గ్రానైట్ అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నా, క్వారీలో పేలుళ్లు జరుగుతున్నా పట్టించుకోలేదు. శాంతిపురం మండ ల పరిధిలో ఓ గ్రామంలో రెండు కుటుం బాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో టీడీపీ నేతలు కల్పిం చుకుని ఓ మహిళను వివస్త్రను చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంత దారుణం జరిగినా టీడీపీ నేతలకు మద్దతుగా నిలబడి బాధితులపైనే కేసులు బనాయించారు. కుప్పంలో వెంకటేష్‌బాబుపై టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యు డు రాజ్‌కుమార్ దాడిచేశారు. తిరుపతి గంగ మ్మ ఆలయం వద్ద కాంగ్రెస్ నాయకుడు సురేష్‌బాబుపై దాడిచేశారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు అవేమీ పట్టించుకోలేదు. కార్యకర్తలకు ప్రత్యేక విధులు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులకు తోడుగా ప్రతి గ్రామం, పట్టణాల్లో టీడీపీ కార్యకర్తలకు నెలనెలా కొంత మొత్తం ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. వారు ఇచ్చే సమాచారంతో పాటు ఈ రెండు విభాగాల్లో పనిచేసే అధికారుల వద్ద నుంచి తీసుకున్న వివరాలను ప్రతిరోజూ టీడీపీ అధినేత చంద్రబాబుకు చేరవేస్తుండడం గమనార్హం. -
కృష్ణార్పణం
అది మారుమూల ప్రాంతం. అక్కడ ఏం జరిగినా.. ఏం చేసినా తొంగిచూసే దిక్కులేదు.. అడ్డుకునే చేతుల్లేవు.. అదే అధికార పార్టీనేతకు కలిసొచ్చింది. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాడు. ఇదే అదునుగా ఆక్రమణకు తెగబడ్డాడు. అడ్డగోలు దందా సాగించాడు. ఎకరాల కొద్దీ చదును చేసి సాగులోకి తెచ్చుకున్నాడు. ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు ఒత్తిళ్లకు చిత్తయ్యారు. ఇష్టారాజ్యంగా పట్టాలిచ్చి చేతులు దులుపు కున్నారు. అన్నీ తెలిసినా జిల్లా ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం గమనార్హం. సాక్షి, చిత్తూరు: పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం బూడిదవేడు రెవెన్యూ గ్రామం పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి పెద్దఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఎకరాల వరకు స్వాహా చేశాడు. రాళ్లురప్పలను తొలగించాడు. మొక్కలు, కంప చెట్లను తీసేసి యంత్రాలతో చదును చేశాడు. ట్రాక్టర్లతో దున్నకాలు చేపట్టి దర్జాగా జామ, అల్ల నేరేడు తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఇప్పటికే పది ఎకరాల్లో దానిమ్మ నేరేడు సాగులోకి తెచ్చాడు. అనధికారికంగా బోర్లు కూడా వేసుకున్నాడు. సాక్షి పరిశోధనతో వెలుగులోకి.. వాల్మీకిపురం మండలంలో అధికార పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి ఆగడాల గురించి గతంలో కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో పర్యటించి శోధిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బూడిదవేడు రెవెన్యూ గ్రామం 521/1, 560/2 సర్వే నంబర్లలో 16.98 ఎకరాలు, 483, 497, 521/3, 561 సర్వే నంబర్లలో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. అనుమతి లేకుండా బోర్లు వేశాడు. దర్జాగా ముళ్లపొదలతో కంచె వేసుకొని సాగు చేసుకుంటున్నాడు. ఒకే ఇంట్లో నలుగురికి.. కృష్ణారెడ్డికి భూములు అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు నిబంధనలను గాలికొదిలేశారు. కృష్ణారెడ్డి, ఆయన భార్య, కూతురు, అమ్మకు విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. ఎలాంటి ఆసరాలేని వారికే ప్రభుత్వ భూమిని ఇవ్వాలని నిబంధన. కానీ కృష్ణారెడ్డికి భూమి ఇచ్చే విషయంలో ప్రాథమిక నిబంధనలు కూడా పాటించలేదు. 560/2 సర్వే నంబరులో కృష్ణారెడ్డి భార్య లక్ష్మీదేవికి 4.92 ఎకరాలు, 521/1 సర్వే నెంబరులో కృష్ణారెడ్డి తల్లి సరస్వతమ్మకు 4.92 ఎకరాలు, కృష్ణారెడ్డి కూతురు బిందుకు 522/4,522/2,523/4 సర్వే నంబర్లలో4.93 ఎకరాలు, సర్వే నంబరు 560/1లో 2.21 ఎకరాలు కృష్ణారెడ్డి సమీప బంధువుకు రెవెన్యూ అధికారులు అప్పనంగా రాసిచ్చేశారు. టీడీపీ నాయకుల చేతుల్లో.. విలువైన ప్రభుత్వ భూములన్నీ టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లోకి వెళుతున్నాయి. వీరి ధాటికి కొండలు గుట్టలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిన అధికారులు ఒత్తిళ్లకు లొంగుతున్నారు. సాక్షాత్తు జిల్లా అత్యున్నతాధికారే టీడీపీ నాయకుల భూ కబ్జాలపై మౌనంగా ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు చేశా పైన పేర్కొన్న భూములను వెంకటరమణ, చిన్నప్ప, నారాయణ తదితరుల నుంచి కొనుగోలు చేశా. వాటిని కూడా వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు కూడా సర్వే చేసుకుని వెళ్లారు. భూమి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తీసుకోమని చెప్పాను. నాపై బురద చల్లడానికే కబ్జా ఆరోపణలు. – కె.కృష్ణారెడ్డి, టీడీపీ నాయకుడు, వాల్మీకిపురం సర్వే చేశాం.. రిపోర్టు సిద్ధం చేస్తున్నాం.. కృష్ణారెడ్డి ఆక్రమించారు అంటున్న భూములపై ఇప్పటికే విచారణ జరిపాం. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకా నివేదిక సమర్పించలేదు. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఆలస్యమవుతోంది. రెండు మూడు రోజుల్లో నివేదికను సబ్ కలెక్టర్‌కు సమర్పిస్తాం.– కళావతి, తహసీల్దార్, వాల్మీకిపురం కిశోర్ అండ ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురికాకుండా రక్షణ కల్పించాల్సిన వారే భూ దోపిడీకి సహకరిస్తున్నారు. పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కిశోర్‌కుమార్ రెడ్డి అండతో కృష్ణారెడ్డి రెచ్చిపోతున్నారు. కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈయన భూ బాగోతంపై అప్పటి సబ్‌కలెక్టర్ గుణభూషణ్ రెడ్డి గత సంవత్సరం ఏప్రిల్ 19న విచారణ చేయాలని వాల్మీకిపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం సర్వేయర్‌ను కూడా పంపిన దాఖలాలు లేవు. విచారణ ఆపేయాలని తహసీల్దార్‌పై పెద్ద ఎత్తున కిశోర్‌కుమార్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. రోడ్డు సర్వే, రైల్వే ట్రాక్ సర్వే అంటూ విచారణ వాయిదా వేస్తున్నారు. -
ఆశ్రమ భూములపై కన్నేశారు!
నరసన్నపేట మేజర్ పంచాయతీలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కొంతమంది టీడీపీ మద్దతుదారుల కన్ను తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శివరామ దీక్షిత అచల గురు ఆశ్రమం ఆస్తులపై పడింది. దీన్ని ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. నరసన్నపేట: నరసన్నపేటలో గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ ఆస్తులకు రెక్కలొచ్చాయి. అధికార పార్టీ నాయకుల అండతో విలువైన స్థలాలు పలువురి చేతిల్లోకి వెళ్లిపోయాయి. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని స్థలాలు కుల సంఘాలకు కట్టబెట్టగా.. మరికొన్ని అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చేశారు. తాజాగా టీడీపీ మద్దతుదారుల కళ్లు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శివరామ దీక్షిత అచల గురు ఆశ్రమం ఆస్తులపై పడింది. దీనికి ఆనుకొని ఉత్తర భాగము స్థలాన్ని కాజేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తప్పుడు రికార్డులు సృష్టించి నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ రికార్డులను మార్చేసినట్టు తెలిసింది. దీనిని పసి గట్టిన ఆశ్రమం వంశ పారంపర్య ధర్మకర్తలు ఈ స్థలం చేతులు మారకుండా ఆశ్రమం ఆధీనంలో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు కొందరు వీరి చర్యలకు ఆటంకాలు సృష్టిస్తూ తమకే ఆ స్థలం చెందాలని అధికారులపై వత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశమైంది. రికార్డులు తారుమారు విషయం ఇలా.. గొట్టిపల్లి సర్వేనంబర్ 99/7లో ఉన్న 36 సెంట్ల భూమిని ఆశ్రమ అవసరాలకు శ్రీ శివరామ దీక్షిత కార్య ఆశ్రమ ధనులు పేరున 1966 ఆగస్టు తొమ్మితో తేదీన 3265 డాక్యుమెంట్ ద్వారా పొట్నూరు రాజులు, రమణయ్యల నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2017 వరకూ ఈ భూమి ఆశ్రమం పేరునే రికార్డుల్లో ఉండగా 29–07–2017 నుంచి మారింది. ప్రభుత్వ పెద్దలు మద్దతుతో కొందరు ఈ స్థలాన్ని గిఫ్టు డీడ్ కింద రికార్డులు వారికి అనుకూలంగా మార్పు చేశారని శివరామ దీక్షితల వంశపారంపర్య ధర్మకర్త ముద్దాడ రఘుపతి నాయుడుతో పాటు ఆశ్రమానికి చెందిన శిష్యులు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని ఆనుకొని ఉన్న రాజేశ్వరి మహాల్‌కు చెందిన సర్వేనంబర్ ఆధారంగా ఆశ్రమ భూముల హద్దులను మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017 జూన్ వరకూ మీసేవలో అడంగల్, వన్–బీ లు తీస్తున్నప్పుడు ఆశ్రమం పేరునే వచ్చేవి. తరువాత పేర్లు మారడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతరులకు బదలాయించడం కుదరదు... నిబంధనల ప్రకారం ఆశ్రమం పేరున ఉన్న భూములు ఇతరులకు హక్కులు కల్పించేందుకు, బదలాయించేందుకు వీల్లేదు. అయినా కొందరు ఈ భూమిని కాజేసేందుకు రెవెన్యూ రికార్డులను మార్పులు చేసినట్లు తెలిసింది. అయితే ధర్మాన ఎర్రన్నాయుడు అనుయూయులు ఈ స్థలం వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకొనేందుకు తహసీల్దార్ కార్యాలయంలో నాలా కట్టారు. దీని ప్రకారం ఈ భూమిని కన్వర్షన్ చేయడానికి టీడీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు ససేమిరా అంటున్నారు. వారిపై వత్తిడులు వస్తున్నట్లు తెలుస్తోంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం ఈ వివాద స్థలం గురించి రెండు వర్గాల వారూ ఫిర్యాదులు చేశారు. రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. దీని విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జె.రామారావు, తహసీల్దార్ రంగనాథ స్వామి వీలునామా రాశారు ఆశ్రమం నిర్వహకుల్లో ఒకరైన కూరాకుల రంగనాథ స్వామి మా నాన్న ధర్మాన చిట్టెన్న పేరున ఈస్థలాన్ని వీలునామా రాశారు. చాల్లా ఏళ్లు నుంచి ఈ వివాద స్థలం నా స్వాధీనంలో ఉంది. మా నాన్న పేరున ఉన్న ఈ స్థలాన్ని నా భార్య పేరున మార్చాను. ఇప్పుడు దీని విలువ పెరగడంతో కొందరు వివాదం సృష్టిస్తున్నారు. – ధర్మాన ఎర్రన్నాయుడు -
భూ కబ్జా
నేలకొండపల్లి మండల కేం ద్రంలో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోంది. సుమారు ఆరు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి ఆస్పత్రికి కేటాయించారు. ఆరోగ్యశాఖకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కానీ పహాణీలో పేరు మార్చలేదు. ఇదే అదనుగా భావించి కొందరు కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. నేలకొండపల్లి (ఖమ్మం): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి భూమి యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. 1961లో ప్రభుత్వం ఆస్పత్రి కోసం సర్వే నంబర్ 219/1లోని రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అప్పటి పంచాయతీ పాలకవర్గం 1961, ఫిబ్రవరి 25న ప్రభుత్వ ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ కూడా చేసింది. కానీ పహాణీలో మాత్రం పేరు మార్చలేదు. ఇప్పటికీ 1961లో ఉన్న రైతుల పేరు మీదనే భూమి ఉన్నట్లు పహణీల్లో చూపిస్తోంది. ఇదే అవకాశంగా భావించి కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఇప్పటికే 29 కుంటల (3509 గజాలు) భూమి ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక తహసీల్దార్ 18 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. రెవిన్యూ, ఆరోగ్య శాఖల మధ్య కొరవడిన సమన్వయం నేలకొండపల్లి మండల కేంద్రంలో విలువైన స్థలాన్ని కాపాడాల్సిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు మిన్నకుండిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1961లో 2 ఎకరాల స్థలాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి ఎంతో మంది అధికారులు మారినప్పటికీ ఆ స్థలాన్ని మాత్రం పహాణీలో ఎక్కించలేదు. భూమికి సంబంధించిన పత్రం ఒక్కటి కూడా ఆరోగ్యశాఖాధికారుల వద్ద లేదు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా అటువైపు చూడడం లేదు. రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయం చేసుకుని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిపోయి, ఎవరికివారు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గత అధికారుల ఆదేశాలు బేఖాతర్ గతంలో ఆర్డీఓగా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు స్థలం ఆక్రమణపై స్పందించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టారు. ఆక్రమణ రుజువు కావటంతో పూర్తి స్థాయిలో సర్వే చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చేతులు దులుపుకున్నారు. గ్రామస్తుల పోరాట ఫలితంగా మరోసారి సర్వే.. గ్రామస్తులు ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో స్పందించి విచారణకు ఆదేశించారు. సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారిని ఆదేశించటంతో కొద్ది రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఆయన ఖమ్మంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కటంతో ఆక్రమణ కథ కంచికి చేరింది. సీపీఎం, సీపీఐ నాయకులు మరో మారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో విచారణాధికారిగా సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ మురళిని ఆదేశించారు. ఆయన కూడా రెండు రోజులు నేలకొండపల్లిలో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా స్థలంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రిలే దీక్షలకు అనుమతి నిరాకరణ ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 8 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో దీక్షలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సోమవారం నుంచి చేపట్టాల్సిన దీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టులో కేసు నడుస్తోంది ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణపై 18 మందికి నోటీసులు ఇచ్చాం. వారిలో ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. దీంతో ముందుకు సాగలేకపోతున్నాం. కోర్టు వాయిదాలు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. –దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి నిర్లక్ష్యం వీడాలి ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణ విషయం తెలిసి కూడా అధికార యంత్రాంగం స్పందించడంలేదు. ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటే పట్టించుకోకపోవటం సరికాదు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలి. –ఏటుకూరి రామారావు, నేలకొండపల్లి -
పెద్దలు.. గద్దలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న స్థలం జిల్లాకేంద్రంలోని కోతిరాంపూర్ 415 సర్వేనంబర్లోనిది. ఈ స్థలం ప్రభుత్వ భూమి. దీనిని ఎన్టీవోస్ల కోసం ఏళ్లక్రితమే ప్లాట్లుగా చేసి పార్కు కోసం రెండెకరాల స్థలాన్ని వదిలిపెట్టారు. ఈ స్థలాన్ని కొందరు అక్రమార్కులు క్రమక్రమంగా ఆక్రమించారు. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాల్సిన అధికారులు కళ్లుమూసుకుని అనుమతితోపాటు ఇళ్లకు నంబర్లు కూడా ఇచ్చారు. ఈ స్థలం పూర్వాపరాలు తెలిసిన ఓ వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ భూమిని రక్షించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని విచారించిన కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో కార్పొరేషన్ అధికారులు సర్వేచేయగా.. సదరు స్థలంలో ఏకంగా ఓ కార్పొరేటర్ కూడా ఇల్లు కట్టుకున్నట్లు గుర్తించి కూల్చివేశారు. ఇంకా ఆ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు చాలా ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్: సీనియర్ సిటిజన్ల కాలక్షేపం, పిల్లల ఆటల కోసం పార్కులు ఏర్పాటు చేద్దామంటే సెంటు భూమి లేకుండా పోతోంది. రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో స్థానికులు నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు çహడావుడి చేయడం తప్ప అడ్డుకున్న సంఘటనలు కానరావడం లేదు. కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు 44 ప్రాంతాల్లో 19.22 ఎకరాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా యి. కబ్జాల బారిన పడి ఇప్పటికే సగానికి పైగా భూములు మాయమయ్యాయి. ఇప్పుడు వేళ్లపై లెక్కపెట్టే విధంగా స్థలాలు కనిపిస్తున్నాయి. అవి కూడా నాలుగు వైపులా ఆక్రమణలకు గురై కుంచించుకుపోయాయి. కనీసం ఉన్న భూములునైనా కాపాడుకోవాలనే ధ్యాస కూడా అధికారులకు లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కింది స్థాయి అధికారుల అండదండలతో కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ పరులపాలవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మున్సిపల్ పార్కుస్థలాలు కబ్జా.. నగరంలోని మున్సిపల్‌కు చెందిన సుమారు 44 పార్కుల స్థలాలుండగా.. కేవలం ఏడు ప్రాంతా ల్లోనే పార్కుల ఆకారాలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్‌గడ్డ, హౌసింగ్‌బోర్డుకాలనీ, వావిలాలపల్లి, బ్యాం కుకాలనీ, అలకాపురి, జ్యోతినగర్, జెడ్పీ క్వార్టర్స్ ప్రాంతాల్లో మాత్రమే పార్కు స్థలాలకు ప్రహరీలు నిర్మించారు. మిగతా ప్రాంతాల్లో పార్కు స్థలాలు ఎక్కడ ఉన్నాయని బూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వినాయకమార్కెట్ స్థలం పూర్తిగా అన్యాక్రాంతమై భవనాలు వెలిశాయి. కోతిరాంపూర్ ఎన్జీవో కాలనీలోని 415, 711 సర్వేనెంబర్లలోని ఐదెకరాల పార్కు స్థలంలో గుడిసెలు వెలిశాయి. ఆ తర్వాత పక్కా భవనాలు నిర్మాణం జరిగాయి. వాటికి నగరపాలక సంస్థ అధికారులు నంబర్లు ఇచ్చేశారు. భగత్‌నగర్ ఎన్జీవో కాలనీల్లో పార్కుకు చెందిన రెండెకరాల స్థలం మాయమైంది. క్రిస్టియన్ కాలనీ, జ్యోతినగర్ మోర్ సూపర్‌మార్కెట్ ముందు, శివథియేటర్ వెనుక స్థలం, కట్టరాంపూర్ ప్రాంతాల్లోని స్థలాలు వివాదాస్పం గా మారాయి. హౌసింగ్ బోర్డులో 21 గుంటల పార్కు స్థలం కబ్జా కోరల్లో చిక్కింది. సాయికృష్ణ థియేటర్ వెనుక ఉన్న స్థలం అన్యాక్రాంతం కావడానికి సిద్ధంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే దేవేందర్‌రావు ఇంటివద్ద నున్న పార్కు స్థలాన్ని స్థానికులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుకోగలిగారు. ఈ స్థలానికి ఇటీవలే ప్రహరీ నిర్మించారు. పార్కు పనులు చేపట్టారు. ఇవే కాకుండా మరిన్ని స్థలాలు కబ్జాలకు గురై కోర్టు కేసుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిపై అధికారులు పోరాడడం మానేయడంతో అవి కబ్జాదారులకే దక్కే అవకాశం ఉంది. రెవెన్యూ స్థలాల పరిస్థితీ ఇంతే.. నగరంలో ఉన్న 243 ఎకరాల రెవెన్యూ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించినవి మినహా మిగతా స్థలాలన్నీ పక్కా నిర్మాణాలే వెలిశాయి. గుడిసెలు వేయడం కబ్జాలు చేయడం, ఆ తర్వాత అధునాతన భవనాలు నిర్మించడం.. పూర్తిగా రాజ కీయంగా మారిన కబ్జాల వ్యవహారాన్ని అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో కబ్జాదారులకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. నగరంలోని సప్తగిరికాలనీలోని 1026 స ర్వేనంబర్లో గతంలోనే అక్రమ నిర్మాణాలు వెలి శాయి. సర్వేనెంబర్ 1026లో సుమారు 11 ఎకరాల స్థలం, ఎస్సారార్ కళాశాల గ్రౌండ్‌లోని కొం తభాగం కూడా ఆక్రమణపాలైంది. ఇలా ప్రభు త్వ స్థలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, ఆసుపత్రి నిర్మాణం చేయాలన్నా సెంటుస్థలం కూ డా లేకుండాపోయింది. పాలకులు, అధికారులు స్థలాలు కాపాడడంలో విఫలమవడంతోనే ఈ పరి స్థితి నెలకొందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆలస్యంగా మేల్కొని.. స్థలాలన్నీ కబ్జాలకు గురయ్యాక ఆలస్యంగా అధికారులు మేల్కొన్నారు. ఇటీవల అమృత్ నిధులతో పార్కుల నిర్మాణం చేపట్టారు. అమృత్ కోసం ఎంపిక చేసిన పార్కుల్లో సైతం కోర్టు వివాదాలు తలెత్తడంతో బల్దియా అధికారులకు తలనొప్పిగా మారింది. పార్కు స్థలాలను కబ్జాకోరల నుంచి కాపాడేందుకు, ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధగా ముందుకెళ్లి పార్కుల నిర్మాణానికి కదులుతున్నారు. జ్యోతినగర్ మోర్‌సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న 1.04 ఎకరాల స్థలంపై ఇటీవలే కోర్టు తీర్పునిచ్చింది. బల్దియాకే స్థలం చెందుతుందని తేల్చిచెప్పింది. వెంటనే స్థలానికి ప్రహరీ పనులు ప్రారంభించారు. శివథియేటర్ సమీపంలోని స్థలానికి సైతం కోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పోలీసు పహార మధ్యన ప్రహరీ పనులను ప్రారంభించారు. హౌసింగ్‌బోర్డులోని రెండు ప్రాంతాల్లో కబ్జాకు గురైన పార్కుల స్థలాలను మున్సిపల్ స్వాధీనం చేసుకుంది. కోతిరాంపూర్‌లోని 415 సర్వేనంబర్‌లో ఆ డివిజన్ కార్పొరేటర్ ఇల్లు నిర్మాణం చేసుకుంటే కోర్టు ఆదేశంతో కూల్చివేశారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సైతం పార్కుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మున్సిపాలిటీలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని మిగిలి ఉన్న ప్రభుత్వ స్థలాలకు పెన్సింగ్, ప్రహరీ నిర్మించి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పటికే ఐదు విలువైన పార్కు స్థలాలను కాపాడాం. హౌసింగ్‌బోర్డులో రెండు స్థలాలు, జ్యోతినగర్‌లో రెండు స్థలాలు, కోతిరాంపూర్‌లో ఒక స్థలాన్ని మున్సిపల్ ఆధీనంలోకి తీసుకుని రక్షణ ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న విలువైన భూముల్ని రక్షించేందుకు చర్యలు చేపడతున్నాం. రాబోయే రోజుల్లో అన్ని స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేస్తాం. – కె.శశాంక,నగరపాలక సంస్థ కమిషనర్ -
బడినీ మింగేశారు!
ఒంగోలు టూటౌన్: అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖాళీ స్థలం కనపడితే కబ్జా చేయకుండా ఉండలేకపోతున్నారు. అది కుంటైనా, మందబయిలు పోరుంబోకు అయినా, పాఠశాల స్థలం అయినా గద్దల్లా వాలిపోతూ తమ కబంధ హస్తాల్లోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్లాట్లుగా వేసి లక్షల సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కరవదిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (98) స్థలంపై స్థానిక టీడీపీ ముఖ్య నేత కన్ను పడింది. వెంటనే దానిని ఆక్రమించి ప్లాట్లగా మలిచాడు. వాటిని స్థానికులకే అమ్మకాలు చేపట్టాడు. ఒక్కొక్క ప్లాట్ లక్ష వరకు అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసినా.. అధికార పార్టీ నేతల దెబ్బకు కిమ్మనకుండా ఉన్నారు. ఎవరికి వారే మనకెందుకనుకుంటూ నోరుమెదపకుండా ఉండిపోయారు. అడ్డుకున్న విపక్షం అంతా సైలెంట్‌గా ఉన్నా వైఎస్సార్సీపీ నేతలు ఊరుకోలేదు. పాఠశాల కబ్జాకు గురయిన విషయం తెలుసుకొని వెంటనే మీకోసంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లారు. స్థానిక గ్రామపంచాయతీలో, మండలస్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అధికార పార్టీ నేతల దెబ్బకు అంతా మిన్నుకుండిపోయారు. చేసేదేం లేక లోక్ అదాలత్‌లో వైఎస్సార్సీపీ నేతలు కేసు వేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇటీవల మండల ఎంఈఓ పాఠశాల స్థల పరిశీలనకు వచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులంతా సంఘటన స్థలం వద్దకు వెళ్లారు. స్థలం కబ్జాపై వివరించారు. తరువాత ఎంఈఓ స్థానిక టీడీపీ నేతలను కలిశారు. లోక్ అదాలత్‌కు ఎంఈఓ హాజరు జూలై 31వ తేదీన మండల విద్యాశాఖాధికారి లోక్ అదాలత్ జడ్జి వద్దకు హాజరయ్యారు. స్థలం ఆక్రమించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆయన ప్రశ్నించారు. పాఠశాల స్థలం కొలిచి స్వాధీనం చేయాలని తెలియజేశామని జడ్జికి వివరించారు. అనంతరం మళ్లీ వాయిదా వేసినట్లు పిటిషనర్లు తెలిపారు. మండల స్థాయికి చెందిన కొంతమంది అధికారులకు, గ్రామపంచాయతీ అధికారులకు నోటీసులు జారీ చేశారని పిటిషనర్లు తెలిపారు. వీరితో పాటు పాఠశాల స్థలం కొని నిర్మాణాలు చేపడుతున్న మరో ముగ్గురికి కూడా నోటీసులు పంపించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆక్రమణదారులు లోక్‌అదాలత్ కోర్టుకి హాజరు కాకుండా మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కూడా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు పిల్లర్స్ వేసి నిర్మాణాలు చేపడుతున్నారని మండల విద్యాశాఖాధికారి, గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికుడు టి. యల్లమంద తెలిపారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వం పాఠశాల స్థలం కబ్జాకు గురయితే గ్రామంలో పెద్దలు నోరుమెదపడం లేదంటే అధికార పార్టీ నేతల ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠశాల స్థలమే కాకుండా అంతకుముందు గ్రామాన్ని వరద ముంపు నుంచి కాపాడే కుంటను ఆక్రమించి అమ్ముకున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు టి. యల్లమంద, మన్నే శ్రీనివాసరావు, రాయపాటి, మేడికొండ కోటేశ్వరరావు, వాకా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇలా ఖాళీగా కనపడిన ప్రభుత్వ పోరంబోకు స్థలాలను కబ్జా చేసి లక్షలు పోగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురైన మండల ప్రాథమిక పాఠశాల స్థలంను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: ఎంఈఓ పాఠశాల స్థలంలో ఎవరూ ఆక్రమణలు చేపట్టవద్దని చెప్పాం. నిర్మాణదారులను కూడా హెచ్చరించాం. ఈ స్థలం వ్యవహారం ప్రస్తుతం లోక్ అదాలత్‌లో ఉన్నట్లు ఆక్రమణదారులకు తెలియజేశాం. ప్రభుత్వం నిబంధనలను ధిక్కరించి ఎవరైనా స్థలంలో ప్రవేశిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. -
భూ కబ్జాలు కేరాఫ్ గంటా
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు టీడీపీ నాయకుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు వేసిన 25 ప్రశ్నలకు సమాధానం చెబుతాం .. ముందు మేమడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జనసేన ఉత్తరాంధ్ర అధ్యక్షుడు శివశంకర్ ప్రశ్నించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ ఇమేజ్ దెబ్బతీయడానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. వపన్‌పై విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాలుగేళ్ల కాలం పట్టిందా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పార్టీలు మారే మంత్రి గంటాకు నీతి నిజాయతీ గల పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించే నైతికత లేదని విరుచుకుపడ్డారు. ఎవరిమీదైనా బురద జల్లడం ఒక్క టీడీపీకే చెందిందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై మీరు మాట్లాడే తీరు నిసిగ్గుగా ఉందన్నారు. ఉత్తరాంధ్రపై మీకు అభిమానం ఉంటే..కేంద్రం విడుదల చేసిన రూ.350 కోట్లు వెనక్కి వెళ్లిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలుగేళ్లుగా ముంచిన చంద్రబాబు కానీ, విశాఖ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన గంటా కానీ జనసేనాను ఏ విధంగా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు. భూ కబ్జాలు కేరాఫ్ గంటా విశాఖ రూరల్ మండల పరిధిలోని పరదేశిపాలెం, పోతినమల్లయ్యపాలెం, ఎండాడ, రుషికొండ, చినగదిలి, భీమునిపట్నం ప్రాంతాల్లో భూ కబ్జాలకు గంటా కేరాఫ్‌గా నిలిచారన్నారు. మాజీ సైనిక ఉద్యోగులను బెదిరించి భూములను చౌకగా లాక్కున విషయం నిజం కాదా? చివరికి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కూడా వదలకుండా కబ్జాలు చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మీ బంధువు షాడో మంత్రిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకోవడం నిజం కాదా? తహసీల్దార్ డిజిటల్ కీ దుర్వినియోగం చేసి రికార్డులను మాయం చేయించిన మీరు పవన్‌కు ప్రశ్నలు సంధించే అర్హత లేదన్నారు. మీ సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా విశాఖలో 6వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని ఒప్పుకోవడం వాస్తవం కాదా? పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ విషయంలో మీ వియ్యంకుడు నారాయణకు మీరు సహకరించలేదా? బీఈడీ, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో మీ భార్య, ఆమె సోదరుడు సుమారు 900 మంది నుంచి లక్షలు వసూళ్లు చేయడం నిజం కాదా? కోరుకున్న చోటకే పోస్టింగ్ కోసం లక్షలు లంచాలు తీసుకోవడం నిజం కాదా? అని నిలదీశారు. హోదాపై పోరాటంలో ఎవరికి చిత్తశుద్ధి ఉందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని శివశంకర్ సవాల్ విసిరారు. -
అక్రమాల అన‘కొండ’లు
ఇది ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి సమీపంలోని కొండ. రెవెన్యూ శాఖ పరిధిలోని ఈ కొండలో సాగుకు ఏమాత్రమూ అనువుగా లేదు. అయినా.. సర్వే నంబర్ 653లోని 104.98 ఎకరాలు, 239లోని 178.45 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. దాదాపు 160 మందికి ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ పంటలు కూడా సాగుచేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. వాటి ఆధారంగా అక్రమార్కులు బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆళ్లగడ్డ: రెవెన్యూ అధికారులు తలచుకుంటే ఏమైనా సాధ్యమే! ఎవరి భూమికి ఎవరి పేరుతోనైనా పట్టా ఇచ్చేయగలరు. కొండలు, గుట్టలు సైతం సాగులో ఉన్నట్లు చూపగలరు. వారు అడిగినంత ఇస్తే ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తారు. అక్కడ రకరకాల పంటలు సాగు చేస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. అడ్డదారుల్లో భూమి పొందిన వారు వీటిని బ్యాంకుల్లో పెట్టి ఎంచక్కా పంట రుణాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పొందవచ్చు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనైతే రెవెన్యూ లీలలకు అంతే లేకుండా పోతోంది. కొండలకు పాసు పుస్తకాలు ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ 653లో 104.98 ఎకరాలు, 239లో 178.45 ఎకరాలు, ఇవిగాక మర్రిపల్లి, ఆర్.కృష్ణాపురం, మిట్టపల్లి, రుద్రవరం మండలం ఆలమూరు, రుద్రవరం, లింగందిన్నె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, ఉయ్యాలవాడ మండలంలో మరో 900 ఎకరాల దాకా రెవెన్యూ కొండలు, తిప్పలు ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రమూ సాగుకు అనుకూలంగా లేదు. వీటికి కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. సర్వే నంబర్లను వెబ్‌ల్యాండ్‌లో 145 సబ్ డివిజన్లుగా విభజించి.. ఏకంగా 232 మందికి పాసు పుస్తకాలు జారీ చేశారు. వీటిలో డి.పట్టాలిచ్చింది మాత్రం 50 ఎకరాలకే. మిగతాదంతా అనధికారికంగా కట్టబెట్టారు. నాలుగేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. ఇప్పటికీ ఎవరు డబ్బు ఇస్తే వారికి అన్లైన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా రికార్డులు అనధికారికంగా కట్టబెట్టిన భూములు కావడంతో ఆన్లైన్ చేసిన అధికారులు కార్యాలయంలోని 1బీ రికార్డుల్లోనూ హడావిడిగా ఖాతాలు సృష్టించి ఎంట్రీ చేశారు. అనేక ఖాతాల్లో పాసుపుస్తకం యూనిక్ నంబర్, రైతు ఫొటో, తహసీల్దార్ సంతకం, భూమి రకం తదితర వివరాలేవీ నమోదు కాలేదు. విస్తీర్ణం కంటే రెట్టింపు పంపిణీ రెవెన్యూ అ«ధికారులు ఎకరాకు ఇంతని ధర నిర్ణయించి చెప్పడంతో బేరం కుదుర్చుకున్న నాయకులు ఒక్కొక్కరు 20 నుంచి 40 ఎకరాల దాకా పాసు పుస్తకాలు చేయించుకున్నారు. డబ్బు మోజులో పడి అక్కడున్న భూమి కంటే రెట్టింపు విస్తీర్ణానికి అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేశారు. ఆన్లైన్ చేసే సమయంలో విస్తీర్ణం సరిపోలకపోవడంతో ఒక్కొక్కరికి 20 నుంచి 50 శాతం వరకు తగ్గించి నమోదు చేశారు. దీంతో పాసు పుస్తకంలోని విస్తీర్ణం, ఆన్లైన్లోని విస్తీర్ణం మధ్య తేడా వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అక్రమార్కులు తగ్గించిన పొలానికి డబ్బులన్నా వెనక్కివ్వాలని, లేకుంటే ఒప్పుకున్న కాడికి ఆన్లైన్ చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. రూ.కోట్లలో రుణాలు! అనధికారికంగా పాసు పుస్తకాలు పొందిన వారు వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నారు. నియోజకవర్గంలోని బ్యాంకుల్లో సుమారు రూ.10 కోట్ల వరకు ఇదే తరహాలో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులతో పాటు కొందరు బ్యాంకర్లు సైతం వీరికి సహకరించి.. అంచనాకు మించి రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలైన రైతులకు రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు చెబుతూ ముప్పుతిప్పలు పెట్టే బ్యాంకర్లు వీరి పట్ల మాత్రం ఉదారత చూపుతున్నారు. ఒరిజినలా? నకిలీనా ? 2014 తర్వాత ప్రభుత్వం మ్యానువల్ పట్టాదారు పాసుపుస్తకాల ప్రక్రియ నిలిపేసింది. వీటి స్థానంలో ఈ –పాసుపుస్తకాలు అందిస్తోంది. అయితే.. వీరందరికీ మ్యానువల్ పాసుపుస్తకాలే జారీ చేశారు. దీంతో ఇవి ఒరిజినలా లేక నకిలీనో అధికారులే తేల్చాలి. ఇప్పటికీ ఆళ్లగడ్డ, రుద్రవరం , చాగలమర్రి మండలాల్లో చాగలమర్రి కేంద్రంగా నకిలీ పాసుపుస్తకాల దందా సాగుతోంది. -
కబ్జాలకు కేరాఫ్..అతడు
పుత్తూరులో కి చెందిన ఓ తృతీయశ్రేణి నాయకుడు కబ్జాలకు కేరాఫ్ ‘అతడే’ అన్నట్లు మారాడు. ఇటీవల కాలంలో ఆయన ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఖాళీగా ఉన్న డీకేటీ స్థలాలను కబ్జా చేయడం అతని పని. ఇటీవల సదరు నాయకుడి కబ్జాపర్వాన్ని ఎదురించిన ఓ మహిళపై కూడా తన మనుషులతో భౌతిక దాడి చేయించాడు. ఈ గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపైనా సదరు నాయకుడి మనుషులు ఎదురు తిరగబోయారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో ! పుత్తూరు : మున్సిపల్ పరిధిలోని భవానీనగర్‌లో టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పెట్రేగుతున్నాడు. ఖాళీ స్థలాలను కబ్జా చేయడం, ప్రశ్నించిన స్థానికులపై దాడులకు చేయించడం ఆయనకు నిత్యకృత్యమైపోయింది. రాత్రయితే చాలు సదరు నాయకుడి గ్యాంగ్ పట్టణంలో స్వైరవిహారం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకుడు సాగిస్తున్న ఆగడాలకు స్థానికులను బెంబేలెత్తుతున్నారు. మున్సిపల్ పరి« దిలో ఇళ్లులేని నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గత ప్రభుత్వం భవానీనగర్‌లోని ఇంటిపట్టాలను మంజూరు చేసినా వారికి స్థలాలను చూపలేదు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. అయితే అంతకుమునుపు అనుభవంలో ఉన్న డీకేటీ పట్టాదారులు న్యాయస్థానం ఆశ్రయించడంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఏరియా ఒకటి..పది ప్లాట్లు కబ్జా ప్రస్తుతం సుమారు వంద కుటుంబాల వరకు భవానీనగర్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. బైపాస్కు ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఫ్లాట్ ధర రూ.5 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఆ చోటా నాయకుడి కన్ను ఖాళీ స్థలాలపై పడింది. న్యాయస్థానం ఆదేశాలు ఉండడంతో ఇక్కడ కొత్తగా ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి. అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న చోటా నాయకుడు సుమారు పది ప్లాట్ల వరకు కబ్జా చేసేశాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. కాలనీలో పెరియపాలితమ్మ అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న సుమారు 10 సెంట్ల వరకు ఖాళీ స్థలంపై కూడా చోటా నాయకుడి కన్ను పడింది. ఆలయ అభివృద్ధి సాకుతో ఆ స్థలాలను విక్రయించే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. మహిళపై దాడి.. ఇటీవల సదరు నేత కబ్జా పర్వాన్ని ఎదురించిన ఒక మహిళపై ఆయన బ్యాచ్ రాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. తనపై జరిగిన దాడి విషయాన్ని ఆ మహిళ 100కు ఫోన్ చేయడంతో స్థానిక పోలీసులు భవానీనగర్‌కు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న చోటా నాయకుడి బ్యాచ్ పోలీసు వాహనాన్ని నిర్బంధించారు. ఆ అల్లరిమూకలను పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తప్పించుకున్నారు. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సదరు నాయకుడి ఆగడాలకు అడ్డూ ఆపులేకుండా పోతోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని భవానీనగర్ వాసులు వేడుకుంటున్నారు. ఫిర్యాదు వచ్చింది వాస్తవమే భవానీనగర్‌లో ఒక మహిళపై దాడికి పాల్పడినారనే ఆరోపణలపై ఆ మహిళ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. భవానీనగర్ ప్రాంతంలో ఎవరైనా రౌడీయిజం, పంచాయతీలు చేయడం, స్థాని కులపై దాడులకు పాల్పడడం వంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. -
భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలి
రెవెన్యూ అధికారులకు మంత్రి ఆదేశాలు సిద్దిపేట జోన్:జిల్లా కేంద్రంగా త్వరలో ఏర్పాటు కానున్న సిద్దిపేట పట్టణ సరిహద్దు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా భూకబ్జాలు ,ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారు? అసలు విధులు నిర్వహిస్తున్నారా లేదా? తెలిసి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కబ్జాలపై కఠినంగా వ్యవహరించండి’ అంటూ మంత్రి హరీశ్‌రావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆదివారం పట్టణంలో పర్యటిస్తున్న క్రమంలో మంత్రి నర్సాపూర్ శివారులో చేపడుతున్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 12 గుంటల భూమి అసైన్డ్ అయిన విషయం తెలుసుకున్న మంత్రి రెవెన్యూ అధికారులతో ఆరా తీశారు. ఒక దశలో పొన్నాల గ్రామ శివారుల్లో అనుమతులు లేకుండానే నిర్మాణాలు ఇష్టానుసారంగా జరుగుతున్నప్పటికీ, భూకబ్జాలు , అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నప్పటికి రెవెన్యూ అధికారుల్లో స్పందన లేకపోవడం సమంజసం కాదన్నారు. ఆసలు రెవెన్యూ అధికారులు తిరుగుతున్నారా.. లేదా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఆర్డీఓ ముత్యంరెడ్డికి సంబంధిత అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం డబుల్ బెడ్రూం పథకం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. పనులను వేగవంతం చేయాలని సూచించారు. దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోడికి సొంత ఇంటికల నిజంచేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు.పేదల పెన్నిధిగా కేసీఆర్ చరిత్రలో నిలువడం ఖాయమన్నారు. సిద్దిపేటలో రూ. 118 కోట్లతో డబుల్ బెడ్రూం పథకం కింద 1968 మందికి గృహ వసతి కల్పించడం జరుగుతుందన్నారు. సిద్దిపేటలో జీ ప్లస్‌టూ పథకంలో కొనసాగుతున్నాయన్నారు. ఆయన వెంట దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.