నరసన్నపేట మేజర్ పంచాయతీలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కొంతమంది టీడీపీ మద్దతుదారుల కన్ను తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శివరామ దీక్షిత అచల గురు ఆశ్రమం ఆస్తులపై పడింది. దీన్ని ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు.
నరసన్నపేట: నరసన్నపేటలో గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ ఆస్తులకు రెక్కలొచ్చాయి. అధికార పార్టీ నాయకుల అండతో విలువైన స్థలాలు పలువురి చేతిల్లోకి వెళ్లిపోయాయి. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని స్థలాలు కుల సంఘాలకు కట్టబెట్టగా.. మరికొన్ని అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చేశారు. తాజాగా టీడీపీ మద్దతుదారుల కళ్లు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శివరామ దీక్షిత అచల గురు ఆశ్రమం ఆస్తులపై పడింది. దీనికి ఆనుకొని ఉత్తర భాగము స్థలాన్ని కాజేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తప్పుడు రికార్డులు సృష్టించి నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ రికార్డులను మార్చేసినట్టు తెలిసింది. దీనిని పసి గట్టిన ఆశ్రమం వంశ పారంపర్య ధర్మకర్తలు ఈ స్థలం చేతులు మారకుండా ఆశ్రమం ఆధీనంలో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు కొందరు వీరి చర్యలకు ఆటంకాలు సృష్టిస్తూ తమకే ఆ స్థలం చెందాలని అధికారులపై వత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశమైంది.
రికార్డులు తారుమారు విషయం ఇలా..
గొట్టిపల్లి సర్వేనంబర్ 99/7లో ఉన్న 36 సెంట్ల భూమిని ఆశ్రమ అవసరాలకు శ్రీ శివరామ దీక్షిత కార్య ఆశ్రమ ధనులు పేరున 1966 ఆగస్టు తొమ్మితో తేదీన 3265 డాక్యుమెంట్ ద్వారా పొట్నూరు రాజులు, రమణయ్యల నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2017 వరకూ ఈ భూమి ఆశ్రమం పేరునే రికార్డుల్లో ఉండగా 29–07–2017 నుంచి మారింది. ప్రభుత్వ పెద్దలు మద్దతుతో కొందరు ఈ స్థలాన్ని గిఫ్టు డీడ్ కింద రికార్డులు వారికి అనుకూలంగా మార్పు చేశారని శివరామ దీక్షితల వంశపారంపర్య ధర్మకర్త ముద్దాడ రఘుపతి నాయుడుతో పాటు ఆశ్రమానికి చెందిన శిష్యులు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని ఆనుకొని ఉన్న రాజేశ్వరి మహాల్‌కు చెందిన సర్వేనంబర్ ఆధారంగా ఆశ్రమ భూముల హద్దులను మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017 జూన్ వరకూ మీసేవలో అడంగల్, వన్–బీ లు తీస్తున్నప్పుడు ఆశ్రమం పేరునే వచ్చేవి. తరువాత పేర్లు మారడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇతరులకు బదలాయించడం కుదరదు...
నిబంధనల ప్రకారం ఆశ్రమం పేరున ఉన్న భూములు ఇతరులకు హక్కులు కల్పించేందుకు, బదలాయించేందుకు వీల్లేదు. అయినా కొందరు ఈ భూమిని కాజేసేందుకు రెవెన్యూ రికార్డులను మార్పులు చేసినట్లు తెలిసింది. అయితే ధర్మాన ఎర్రన్నాయుడు అనుయూయులు ఈ స్థలం వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకొనేందుకు తహసీల్దార్ కార్యాలయంలో నాలా కట్టారు. దీని ప్రకారం ఈ భూమిని కన్వర్షన్ చేయడానికి టీడీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు ససేమిరా అంటున్నారు. వారిపై వత్తిడులు వస్తున్నట్లు తెలుస్తోంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
ఈ వివాద స్థలం గురించి రెండు వర్గాల వారూ ఫిర్యాదులు చేశారు. రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. దీని విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జె.రామారావు, తహసీల్దార్
రంగనాథ స్వామి వీలునామా రాశారు
ఆశ్రమం నిర్వహకుల్లో ఒకరైన కూరాకుల రంగనాథ స్వామి మా నాన్న ధర్మాన చిట్టెన్న పేరున ఈస్థలాన్ని వీలునామా రాశారు. చాల్లా ఏళ్లు నుంచి ఈ వివాద స్థలం నా స్వాధీనంలో ఉంది. మా నాన్న పేరున ఉన్న ఈ స్థలాన్ని నా భార్య పేరున మార్చాను. ఇప్పుడు దీని విలువ పెరగడంతో కొందరు వివాదం సృష్టిస్తున్నారు. – ధర్మాన ఎర్రన్నాయుడు
Comments
Please login to add a commentAdd a comment