పాఠశాల స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంఈఓ, గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నేతలు
ఒంగోలు టూటౌన్: అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖాళీ స్థలం కనపడితే కబ్జా చేయకుండా ఉండలేకపోతున్నారు. అది కుంటైనా, మందబయిలు పోరుంబోకు అయినా, పాఠశాల స్థలం అయినా గద్దల్లా వాలిపోతూ తమ కబంధ హస్తాల్లోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్లాట్లుగా వేసి లక్షల సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కరవదిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (98) స్థలంపై స్థానిక టీడీపీ ముఖ్య నేత కన్ను పడింది. వెంటనే దానిని ఆక్రమించి ప్లాట్లగా మలిచాడు. వాటిని స్థానికులకే అమ్మకాలు చేపట్టాడు. ఒక్కొక్క ప్లాట్ లక్ష వరకు అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసినా.. అధికార పార్టీ నేతల దెబ్బకు కిమ్మనకుండా ఉన్నారు. ఎవరికి వారే మనకెందుకనుకుంటూ నోరుమెదపకుండా ఉండిపోయారు.
అడ్డుకున్న విపక్షం
అంతా సైలెంట్‌గా ఉన్నా వైఎస్సార్‌సీపీ నేతలు ఊరుకోలేదు. పాఠశాల కబ్జాకు గురయిన విషయం తెలుసుకొని వెంటనే మీకోసంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లారు. స్థానిక గ్రామపంచాయతీలో, మండలస్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అధికార పార్టీ నేతల దెబ్బకు అంతా మిన్నుకుండిపోయారు. చేసేదేం లేక లోక్ అదాలత్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు కేసు వేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇటీవల మండల ఎంఈఓ పాఠశాల స్థల పరిశీలనకు వచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్తులంతా సంఘటన స్థలం వద్దకు వెళ్లారు. స్థలం కబ్జాపై వివరించారు. తరువాత ఎంఈఓ స్థానిక టీడీపీ నేతలను కలిశారు.
లోక్ అదాలత్‌కు ఎంఈఓ హాజరు
జూలై 31వ తేదీన మండల విద్యాశాఖాధికారి లోక్ అదాలత్ జడ్జి వద్దకు హాజరయ్యారు. స్థలం ఆక్రమించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆయన ప్రశ్నించారు. పాఠశాల స్థలం కొలిచి స్వాధీనం చేయాలని తెలియజేశామని జడ్జికి వివరించారు. అనంతరం మళ్లీ వాయిదా వేసినట్లు పిటిషనర్లు తెలిపారు. మండల స్థాయికి చెందిన కొంతమంది అధికారులకు, గ్రామపంచాయతీ అధికారులకు నోటీసులు జారీ చేశారని పిటిషనర్లు తెలిపారు. వీరితో పాటు పాఠశాల స్థలం కొని నిర్మాణాలు చేపడుతున్న మరో ముగ్గురికి కూడా నోటీసులు పంపించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆక్రమణదారులు లోక్‌అదాలత్ కోర్టుకి హాజరు కాకుండా మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
శుక్రవారం కూడా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు పిల్లర్స్ వేసి నిర్మాణాలు చేపడుతున్నారని మండల విద్యాశాఖాధికారి, గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికుడు టి. యల్లమంద తెలిపారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వం పాఠశాల స్థలం కబ్జాకు గురయితే గ్రామంలో పెద్దలు నోరుమెదపడం లేదంటే అధికార పార్టీ నేతల ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠశాల స్థలమే కాకుండా అంతకుముందు గ్రామాన్ని వరద ముంపు నుంచి కాపాడే కుంటను ఆక్రమించి అమ్ముకున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు టి. యల్లమంద, మన్నే శ్రీనివాసరావు, రాయపాటి, మేడికొండ కోటేశ్వరరావు, వాకా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇలా ఖాళీగా కనపడిన ప్రభుత్వ పోరంబోకు స్థలాలను కబ్జా చేసి లక్షలు పోగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురైన మండల ప్రాథమిక పాఠశాల స్థలంను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: ఎంఈఓ
పాఠశాల స్థలంలో ఎవరూ ఆక్రమణలు చేపట్టవద్దని చెప్పాం. నిర్మాణదారులను కూడా హెచ్చరించాం. ఈ స్థలం వ్యవహారం ప్రస్తుతం లోక్ అదాలత్‌లో ఉన్నట్లు ఆక్రమణదారులకు తెలియజేశాం. ప్రభుత్వం నిబంధనలను ధిక్కరించి ఎవరైనా స్థలంలో ప్రవేశిస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment