స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన దృశ్యం
నేలకొండపల్లి మండల కేం ద్రంలో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోంది. సుమారు ఆరు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి ఆస్పత్రికి కేటాయించారు. ఆరోగ్యశాఖకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కానీ పహాణీలో పేరు మార్చలేదు. ఇదే అదనుగా భావించి కొందరు కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు.
నేలకొండపల్లి (ఖమ్మం): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి భూమి యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. 1961లో ప్రభుత్వం ఆస్పత్రి కోసం సర్వే నంబర్ 219/1లోని రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అప్పటి పంచాయతీ పాలకవర్గం 1961, ఫిబ్రవరి 25న ప్రభుత్వ ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ కూడా చేసింది. కానీ పహాణీలో మాత్రం పేరు మార్చలేదు.
ఇప్పటికీ 1961లో ఉన్న రైతుల పేరు మీదనే భూమి ఉన్నట్లు పహణీల్లో చూపిస్తోంది. ఇదే అవకాశంగా భావించి కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఇప్పటికే 29 కుంటల (3509 గజాలు) భూమి ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక తహసీల్దార్ 18 మందికి నోటీసులు కూడా జారీ చేశారు.
రెవిన్యూ, ఆరోగ్య శాఖల మధ్య కొరవడిన సమన్వయం
నేలకొండపల్లి మండల కేంద్రంలో విలువైన స్థలాన్ని కాపాడాల్సిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు మిన్నకుండిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1961లో 2 ఎకరాల స్థలాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి ఎంతో మంది అధికారులు మారినప్పటికీ ఆ స్థలాన్ని మాత్రం పహాణీలో ఎక్కించలేదు. భూమికి సంబంధించిన పత్రం ఒక్కటి కూడా ఆరోగ్యశాఖాధికారుల వద్ద లేదు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా అటువైపు చూడడం లేదు. రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయం చేసుకుని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిపోయి, ఎవరికివారు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
గత అధికారుల ఆదేశాలు బేఖాతర్
గతంలో ఆర్‌డీఓగా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు స్థలం ఆక్రమణపై స్పందించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టారు. ఆక్రమణ రుజువు కావటంతో పూర్తి స్థాయిలో సర్వే చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చేతులు దులుపుకున్నారు.
గ్రామస్తుల పోరాట ఫలితంగా మరోసారి సర్వే..
గ్రామస్తులు ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో స్పందించి విచారణకు ఆదేశించారు. సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసచారిని ఆదేశించటంతో కొద్ది రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఆయన ఖమ్మంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కటంతో ఆక్రమణ కథ కంచికి చేరింది. సీపీఎం, సీపీఐ నాయకులు మరో మారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో విచారణాధికారిగా సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ మురళిని ఆదేశించారు. ఆయన కూడా రెండు రోజులు నేలకొండపల్లిలో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా స్థలంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
రిలే దీక్షలకు అనుమతి నిరాకరణ
ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 8 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో దీక్షలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సోమవారం నుంచి చేపట్టాల్సిన దీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కోర్టులో కేసు నడుస్తోంది
ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణపై 18 మందికి నోటీసులు ఇచ్చాం. వారిలో ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. దీంతో ముందుకు సాగలేకపోతున్నాం. కోర్టు వాయిదాలు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. –దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి
నిర్లక్ష్యం వీడాలి
ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణ విషయం తెలిసి కూడా అధికార యంత్రాంగం స్పందించడంలేదు. ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటే పట్టించుకోకపోవటం సరికాదు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలి. –ఏటుకూరి రామారావు, నేలకొండపల్లి
Comments
Please login to add a commentAdd a comment