ఈ ఫొటోలో కనిపిస్తున్న స్థలం జిల్లాకేంద్రంలోని కోతిరాంపూర్ 415 సర్వేనంబర్‌లోనిది. ఈ స్థలం ప్రభుత్వ భూమి. దీనిని ఎన్టీవోస్‌ల కోసం ఏళ్లక్రితమే ప్లాట్లుగా చేసి పార్కు కోసం రెండెకరాల స్థలాన్ని వదిలిపెట్టారు. ఈ స్థలాన్ని కొందరు అక్రమార్కులు క్రమక్రమంగా ఆక్రమించారు. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాల్సిన అధికారులు కళ్లుమూసుకుని అనుమతితోపాటు ఇళ్లకు నంబర్లు కూడా ఇచ్చారు. ఈ స్థలం పూర్వాపరాలు తెలిసిన ఓ వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ భూమిని రక్షించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని విచారించిన కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో కార్పొరేషన్ అధికారులు సర్వేచేయగా.. సదరు స్థలంలో ఏకంగా ఓ కార్పొరేటర్ కూడా ఇల్లు కట్టుకున్నట్లు గుర్తించి కూల్చివేశారు. ఇంకా ఆ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు చాలా ఉన్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్: సీనియర్ సిటిజన్ల కాలక్షేపం, పిల్లల ఆటల కోసం పార్కులు ఏర్పాటు చేద్దామంటే సెంటు భూమి లేకుండా పోతోంది. రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో స్థానికులు నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు çహడావుడి చేయడం తప్ప అడ్డుకున్న సంఘటనలు కానరావడం లేదు. కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు 44 ప్రాంతాల్లో 19.22 ఎకరాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా యి. కబ్జాల బారిన పడి ఇప్పటికే సగానికి పైగా భూములు మాయమయ్యాయి. ఇప్పుడు వేళ్లపై లెక్కపెట్టే విధంగా స్థలాలు కనిపిస్తున్నాయి. అవి కూడా నాలుగు వైపులా ఆక్రమణలకు గురై కుంచించుకుపోయాయి. కనీసం ఉన్న భూములునైనా కాపాడుకోవాలనే ధ్యాస కూడా అధికారులకు లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కింది స్థాయి అధికారుల అండదండలతో కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ పరులపాలవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
మున్సిపల్ పార్కుస్థలాలు కబ్జా..
నగరంలోని మున్సిపల్‌కు చెందిన సుమారు 44 పార్కుల స్థలాలుండగా.. కేవలం ఏడు ప్రాంతా ల్లోనే పార్కుల ఆకారాలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్‌గడ్డ, హౌసింగ్‌బోర్డుకాలనీ, వావిలాలపల్లి, బ్యాం కుకాలనీ, అలకాపురి, జ్యోతినగర్, జెడ్పీ క్వార్టర్స్ ప్రాంతాల్లో మాత్రమే పార్కు స్థలాలకు ప్రహరీలు నిర్మించారు. మిగతా ప్రాంతాల్లో పార్కు స్థలాలు ఎక్కడ ఉన్నాయని బూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వినాయకమార్కెట్ స్థలం పూర్తిగా అన్యాక్రాంతమై భవనాలు వెలిశాయి. కోతిరాంపూర్ ఎన్జీవో కాలనీలోని 415, 711 సర్వేనెంబర్లలోని ఐదెకరాల పార్కు స్థలంలో గుడిసెలు వెలిశాయి. ఆ తర్వాత పక్కా భవనాలు నిర్మాణం జరిగాయి. వాటికి నగరపాలక సంస్థ అధికారులు నంబర్లు ఇచ్చేశారు. భగత్‌నగర్ ఎన్జీవో కాలనీల్లో పార్కుకు చెందిన రెండెకరాల స్థలం మాయమైంది. క్రిస్టియన్ కాలనీ, జ్యోతినగర్ మోర్ సూపర్‌మార్కెట్ ముందు, శివథియేటర్ వెనుక స్థలం, కట్టరాంపూర్ ప్రాంతాల్లోని స్థలాలు వివాదాస్పం గా మారాయి. హౌసింగ్ బోర్డులో 21 గుంటల పార్కు స్థలం కబ్జా కోరల్లో చిక్కింది. సాయికృష్ణ థియేటర్ వెనుక ఉన్న స్థలం అన్యాక్రాంతం కావడానికి సిద్ధంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే దేవేందర్‌రావు ఇంటివద్ద నున్న పార్కు స్థలాన్ని స్థానికులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుకోగలిగారు. ఈ స్థలానికి ఇటీవలే ప్రహరీ నిర్మించారు. పార్కు పనులు చేపట్టారు. ఇవే కాకుండా మరిన్ని స్థలాలు కబ్జాలకు గురై కోర్టు కేసుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిపై అధికారులు పోరాడడం మానేయడంతో అవి కబ్జాదారులకే దక్కే అవకాశం ఉంది.
రెవెన్యూ స్థలాల పరిస్థితీ ఇంతే..
నగరంలో ఉన్న 243 ఎకరాల రెవెన్యూ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించినవి మినహా మిగతా స్థలాలన్నీ పక్కా నిర్మాణాలే వెలిశాయి. గుడిసెలు వేయడం కబ్జాలు చేయడం, ఆ తర్వాత అధునాతన భవనాలు నిర్మించడం.. పూర్తిగా రాజ కీయంగా మారిన కబ్జాల వ్యవహారాన్ని అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో కబ్జాదారులకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. నగరంలోని సప్తగిరికాలనీలోని 1026 స ర్వేనంబర్‌లో గతంలోనే అక్రమ నిర్మాణాలు వెలి శాయి. సర్వేనెంబర్ 1026లో సుమారు 11 ఎకరాల స్థలం, ఎస్సారార్ కళాశాల గ్రౌండ్‌లోని కొం తభాగం కూడా ఆక్రమణపాలైంది. ఇలా ప్రభు త్వ స్థలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, ఆసుపత్రి నిర్మాణం చేయాలన్నా సెంటుస్థలం కూ డా లేకుండాపోయింది. పాలకులు, అధికారులు స్థలాలు కాపాడడంలో విఫలమవడంతోనే ఈ పరి స్థితి నెలకొందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఆలస్యంగా మేల్కొని..
స్థలాలన్నీ కబ్జాలకు గురయ్యాక ఆలస్యంగా అధికారులు మేల్కొన్నారు. ఇటీవల అమృత్ నిధులతో పార్కుల నిర్మాణం చేపట్టారు. అమృత్ కోసం ఎంపిక చేసిన పార్కుల్లో సైతం కోర్టు వివాదాలు తలెత్తడంతో బల్దియా అధికారులకు తలనొప్పిగా మారింది. పార్కు స్థలాలను కబ్జాకోరల నుంచి కాపాడేందుకు, ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధగా ముందుకెళ్లి పార్కుల నిర్మాణానికి కదులుతున్నారు. జ్యోతినగర్ మోర్‌సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న 1.04 ఎకరాల స్థలంపై ఇటీవలే కోర్టు తీర్పునిచ్చింది. బల్దియాకే స్థలం చెందుతుందని తేల్చిచెప్పింది. వెంటనే స్థలానికి ప్రహరీ పనులు ప్రారంభించారు. శివథియేటర్ సమీపంలోని స్థలానికి సైతం కోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పోలీసు పహార మధ్యన ప్రహరీ పనులను ప్రారంభించారు. హౌసింగ్‌బోర్డులోని రెండు ప్రాంతాల్లో కబ్జాకు గురైన పార్కుల స్థలాలను మున్సిపల్ స్వాధీనం చేసుకుంది. కోతిరాంపూర్‌లోని 415 సర్వేనంబర్‌లో ఆ డివిజన్ కార్పొరేటర్ ఇల్లు నిర్మాణం చేసుకుంటే కోర్టు ఆదేశంతో కూల్చివేశారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సైతం పార్కుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మున్సిపాలిటీలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని మిగిలి ఉన్న ప్రభుత్వ స్థలాలకు పెన్సింగ్, ప్రహరీ నిర్మించి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నాం
ఇప్పటికే ఐదు విలువైన పార్కు స్థలాలను కాపాడాం. హౌసింగ్‌బోర్డులో రెండు స్థలాలు, జ్యోతినగర్‌లో రెండు స్థలాలు, కోతిరాంపూర్‌లో ఒక స్థలాన్ని మున్సిపల్ ఆధీనంలోకి తీసుకుని రక్షణ ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న విలువైన భూముల్ని రక్షించేందుకు చర్యలు చేపడతున్నాం. రాబోయే రోజుల్లో అన్ని స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేస్తాం.
– కె.శశాంక,నగరపాలక సంస్థ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment