మానేరులో తోడేళ్లు
► ఖాజీపూర్ వాగులో అక్రమ తవ్వకాలు
► రాజకీయ ఒతిళ్లతో చెక్‌పోస్టుల ఎత్తివేత?
► నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా
► దాడులకు దిగిన కొత్తపల్లి పోలీసులు
► పరుగులు తీసిన డ్రైవర్లు, కూలీలు
► మళ్లీ కొనసాగుతున్న అక్రమ రవాణా
సాక్షి, కరీంనగర్/కొత్తపల్లి: కొత్తపల్లి మండలం ఖాజీపూర్ శివారు మానేరు వాగులో అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్‌ఎండీసీఎల్ ఇసుక క్వారీ ఓవైపు అధికారికంగా నడుస్తుండగానే.. దానిపక్కనే అక్రమంగా ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుక రవాణా అవుతోంది. ఒక్కో ఇసుక ట్రిప్పుకు రూ.2 వేల చొప్పున నిత్యం సుమారు రెండువేల ట్రాక్టర్ల ఇసుకను దోచుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండి పడుతోంది.
ఈ తతంగం నెలరోజులుగా జరుగుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఇసుక అక్రమార్కులపై గతంలో ఉక్కుపాదం మోపిన అధికారులు.. ప్రస్తుతం మిన్నకుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో చింతకుంట, కమాన్‌పూర్ ఒడ్డెరపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు ఎత్తివేయడంపై పలువురు చర్చించుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లా..? మరో కారణమా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ బ్లూకోట్స్ గస్తీ కొనసాగుతున్నప్పటికీ ఇసుక అక్రమంగా రవాణా అవుతుందనడానికి ఆదివారం కొత్తపల్లి పోలీసులు జరిపిన దాడుల్లో 40 ట్రాక్టర్లు పట్టుబడటమే నిదర్శనం.
ఆగని ఇసుక అక్రమ దందా... రవాణా అవుతోంది ఇలా..
ఇసుక రవాణా అవుతున్న సమాచారం అందిందో..? మరే కారణమో తెలియదుకానీ.. ఆదివారం వేకువజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో కొత్తపల్లి ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఖాజీపూర్‌లోని మానేరు వాగుకు చేరుకున్నారు. వీరి రాకను గమనించిన ట్రాక్టర్ల డ్రైవర్లు, కూలీలు పరుగులు తీశారు. ఆ సమయంలో వాగులో çసుమారు 40 ట్రాక్టర్లు పట్టుబడ్డాయి.
పోలీసులు వాటి టైర్లలోని గాలితీసి వచ్చారు. వారు వెళ్లడమే తరువాయి.. టైర్లలో గాలి నింపుకుని మళ్లీ ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. ఖాజీపూర్, ఎలగందుల, ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల, కమాన్‌పూర్, చింతకుంట, మల్కాపూర్, సీతారాంపూర్, కరీంనగర్‌కు చెందిన వేలాది ట్రాక్టర్లు నిత్యం కరీంనగర్, తదితర ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాయి. పలుమార్లు పోలీసులు కేసులు పెట్టి కౌన్సెలింగ్ చేస్తున్నా.. లాభార్జన వారిని మళ్లీ అదే దందాకు పురిగొల్పుతోంది.
ఎక్కడ చూసినా ఇసుక కుప్పలే..
ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో నష్టం
మానేరు పరివాహాక ప్రాంతాలైన ఖాజీపూర్, ఎలగందుల గ్రామంతో పాటు ఆసిఫ్‌నగర్, కమాన్‌పూర్, చింతకుంట గ్రామాల్లో ఇసుక డంప్‌లు ఏర్పాటు చేశారు. ఖాజీపూర్, ఎలగందుల గ్రామాల్లోని పంటచేలు, ఇళ్ల మధ్య ఇసుక డంప్‌లు పోశారు. కాగా మానేరులో ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఖాజానాకు కోట్లలో గండి పడుతోంది. ప్రతిరోజూ రెండు వేల ట్రిప్పుల ఇసుకను ట్రిప్పుకు రూ.2 వేల చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తే.. అక్రమార్కులు రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
చెక్‌పోస్టుల ఎత్తివేత వెనుక మతలబేంటో..?
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గతంలో చింతకుంట, కమాన్‌పూర్ ఒడ్డెపల్లి వద్ద పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాజకీయ ఒత్తిళ్లో..? మరే కారణాలో తెలియదు గాని.... క్రమక్రమంగా సిబ్బందిని తగ్గిస్తూ వచ్చిన పోలీసులు.. నెలన్నర క్రితం వాటిని పూర్తిగా ఎత్తేశారు. బ్లూకోట్స్ పోలీసులు సైతం నిఘా పెట్టామని చెప్తున్నా... ఇసుకదందా జోరుగా సాగుతుండటంతో ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా కొత్తపల్లి పోలీసులు మానేరు వాగులో దాడి చేయడంతో ఈ బాగోతం బయటపడగా.. పోలీసుల ఆకస్మిక దాడులు అక్రమార్కులకు అంతుచిక్కడం లేదు.