ఇసుక యుద్ధం
ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ అనుచరుల మధ్య ఘర్షణ
- కర్రలు, ఇనుపరాడ్లతో పరస్పర దాడులు
- రణరంగంగా మారిన సింగరేణి గెస్ట్‌హౌస్
- పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఇరువర్గాలు
- ఆదిలాబాద్ ఇన్‌చార్జి జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే సోదరులపై కేసులు
సాక్షి, భూపాలపల్లి: మహారాష్ట్ర ఇసుక క్వారీలు యుద్ధభూమిగా మారుతున్నాయి. వ్యాపారంలో లాభాలు, రాజకీయ ఆధిపత్యం విషయం లో ఏర్పడిన విభేదాల కారణంగా బుధవారం పరస్పరం దాడులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టుకున్నారు. ఇసుక కాంట్రాక్టర్ల గొడవకు కాళేశ్వరం సింగరేణి అతిథిగృహం వేదికగా మహదేవ్‌పూర్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కాళేశ్వరం దగ్గర గోదావరికి అవతలి వైపు మహారాష్ట్ర సరిహద్దులో సిరోంచ తాలుకాలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 9 ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చింది.
వీటిని తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం –సిరోంచల మధ్య గోదావరిపై నిర్మించి వంతెన ప్రారంభమైంది. ఇక్కడి నుంచి రోజుకు వందల సంఖ్యలో లారీల ఇసుక హైదరాబాద్‌కు రవాణా అవుతోంది. ఇసుక రీచ్‌లలో వంతెనకు అతి సమీ పంలోని నగరం వద్ద రెండు ఇసుక క్వారీలను ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఇంచార్జ్ చైర్మన్ మూల రాజిరెడ్డి అనుచరవర్గం దక్కించు కుంది. వంతెనకు 30 కిలోమీటర్ల దూరంలోని కోటామాల్ వద్ద మంథని ఎమ్మెల్యే పుట్ట మధు బంధువులకు క్వారీ లభించింది.
వాటాల విషయంలో గొడవ
ఈ రీచ్‌ల నుంచి హైదరాబాదుకు రోజూ సుమారు 600 లారీల ఇసుక రవాణా అవు తోంది. ఇందులో సింహభాగం వంతెనకు సమీపంలోని నగరం క్వారీ నుంచే తరలి వెళ్తోంది. దీంతో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు బంధువులకు సంబంధించిన ఇసుక వ్యాపారం మూతపడింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే బం ధువులు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఇన్‌చార్జి చైర్మన్ మూల రాజిరెడ్డి అనుచర వర్గంతో మం తనాలు జరిపారు. తమ క్వారీ నుంచి కూడా ఇసుక రవాణాకు లారీలు కేటాయిం చాల్సిందిగా కోరారు.
ఈ ప్రతిపాదనకు రాజి రెడ్డి వర్గం విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఎమ్మెల్యే బంధువులు సిరోంచలోని స్థానిక నాయకులతో రాజిరెడ్డి అనుచరవర్గంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఇరువర్గాలకు చెందిన రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, వారి అనుచరులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో సింగరేణి గెస్ట్‌హౌస్‌లో సంప్రదింపుల కోసం వచ్చారు. చర్చలు బెడిసికొట్టడంతో బుధవారం తెల్లవారుజామున బాహాబాహీకి దిగారు. తొలుత ఎమ్మెల్యే బంధువర్గానికి చెందిన వ్యక్తులు రాజిరెడ్డిపై దాడికి దిగినట్లు తెలు స్తోంది. దీని ప్రతిగా రాజిరెడ్డి వర్గీయులు తిరిగి వచ్చి ఎమ్మెల్యే వర్గీయులపై దాడికి దిగారు. దీంతో గెస్ట్‌హౌజ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల వారు కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకోవ డంతో అక్కడి భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఘర్షణలో ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాజిరెడ్డి, ఎమ్మెల్యే మధు సోదరుడు పుట్ట సత్యనారా యణ దాడులకు నేతృత్వం వహించారు.
మహదేవపూర్‌లో కేసులు..
బుధవారం వేకువజామున గొడవ జరిగినా ఇరువర్గాలు తొలుత బయటకు పొక్కనీయలేదు. అయితే, ఎమ్మెల్యే అనుచరులు మహదేవపూర్ వద్ద ఇసుక లారీలను అడ్డుకున్నారు. వందలాది లారీలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో తమపై దాడి జరిగినట్లుగా రాజిరెడ్డి వర్గీయులు మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే బంధువర్గం మరో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అంశం బయటకు పొక్కింది. కరీంనగర్‌కు చెందిన ఇసుక కాంట్రాక్టర్ చద్రధర్‌రావు ఫిర్యాదు మేరకు సిరోంచకు చెందిన రాళ్లబండి రవి, గణేష్, మధూకర్, సత్యనారాయణతో పాటు మరో ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. మరోవైపు రాళ్లబండి రవి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మూల రాజిరెడ్డి, బాపురెడ్డి, కరీంనగర్‌కు చెందిన చక్రధర్‌రావులపైన కేసులు నమోదయ్యాయి. సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఘర్షణ విషయంలో దేవస్థానం ఈవో, గెస్ట్‌హౌస్ ఇన్‌చార్జిలను సంప్రదించగా స్పందించడం లేదు.