సాక్షి, గుంటూరు: నిబంధనలు వీరికి పట్టవు. అధికారుల ఆదేశాలతో వీరికి పనిలేదు. రాజకీయ నాయకుల అండతో, ధనార్జనే ధ్యేయంగా జిల్లాలో ఇసుక మాఫీయా జూలు విదిలిస్తోంది. ‘ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు దోచుకున్నారు.. ఇప్పుడు మేం దోచుకుంటే తప్పేమిటి’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. జిల్లాలో ప్రస్తుతం అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్ ఒక్కటే నడుస్తుండటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.450 చొప్పున ఒక్కో లారీకి 6 క్యూబిక్ మీటర్లు లోడు చేసి రూ.2,700 తీసుకోవాల్సి ఉంది.
అయితే నిర్వాహకులు మాత్రం మొదటి గేటు వద్ద నిబంధనల ప్రకారం బిల్లు ఇచ్చి రూ. 2,700 వసూలు చేసి, లోపలికి వెళ్లిన తరువాత మరో రూ.5వేలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. జిల్లాలో బుధవారం ఒక్కరోజే 300 లారీల ఇసుక రవాణా జరిగిందంటే అనధికారిక వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు బహిరంగ మార్కెట్‌లో లారీ ఇసుక ధర రూ. 6వేల నుంచి రూ. 7వేల వరకు ఉండేది.
ప్రస్తుతం ఇసుక రీచ్‌లో లారీకి రూ. 5వేలు అనధికారికంగా ఇసుక మాఫియా వసూలు చేస్తుండటంతో దానికనుగుణంగా బహిరంగ మార్కెట్‌లో లారీ ఇసుకను రూ. 12వేల నుంచి రూ. 13వేల వరకు విక్రయిస్తున్నారు. దీంతో సొంత ఇంటి నిర్మాణాలు చేపట్టిన మధ్యతరగతి, పేద ప్రజలు ఇసుకను కొనుగోలు చేయలేక మధ్యలోనే ఇంటి నిర్మాణాన్ని ఆపుకుని కూర్చొవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
స్పెషల్ డ్రైవ్‌కు తూట్లు...
నిబంధనల ప్రకారం ఒక్కో క్యూబిక్ మీటరు రూ.450కు అమ్మాలని, అక్రమ వసూళ్ళకు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారపార్టీ అండతో కొందరు అక్రమార్కులు ఇసుక మాఫీయాగా ఏర్పడి రూరల్ ఎస్పీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒక్కో లారీకి రూ.5 వేలు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఇసుక మాఫీయా ఆట కట్టించి ప్రజలకు తక్కువ ధరకే ఇసుక విక్రయించాలనే ఉద్దేశ్యంతో రూరల్ ఎస్పీ రామకృష్ణ ప్రారంభించిన ఇసుకపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి తూట్లు పడుతున్నాయి. దీనిపై రూరల్ ఎస్పీ దృష్టి సారించి అక్రమ వసూళ్ళు, రవాణాకు పాల్పడుతున్న ఇసుక మాఫీయాపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందుకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇసుక మాఫియా ఇష్టారాజ్యం
Published Thu, Aug 21 2014 2:08 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement