సాక్షి, పెద్దపల్లి : ‘‘పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో సోలార్ ఇండస్ట్రీస్ అనే సంస్థ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు గతేడాది ముందుకు వచ్చింది. సింగరేణిలో ఎక్స్‌ప్లోజివ్‌కు వాడే ముడిసరుకు మాత్రమే తయారు చేసే పరిశ్రమ ఇది. సుమరు రూ.20 కోట్లతో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ పరిశ్రమతో స్థానికంగా నేరుగా కనీసం 200 మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి దొరుకుతుంది. కాలుష్యం, రక్షణ తదితర అన్ని రకాల అనుమతులు వచ్చినా, ఇప్పటివరకు ఆ పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేయలేకపోతున్నారు. కారణం ఓ ప్రజాప్రతినిధి అవినీతి ఆపేక్ష. రూ.5 లక్షలు ఇస్తేనే ముందుకు సాగనిస్తానంటూ బేరం పెట్టాడు. పైగా అక్కడ నెలకొన్న రాజకీయ విభేదాలు కూడా కొంత కారణమయ్యాయి. దీనితో ఆ పరిశ్రమను ఏర్పాటు చేయాలా..వద్దా...అని పారిశ్రామిక వేత్తలు పునరాలోచనలో పడ్డారు.’’
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటూ ప్రభుత్వం ఓ వైపు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను సరళతరం చేస్తుంటే, మరో వైపు అవినీతి, రాజకీయ కారణాలతో అడ్డుపడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. సింగరేణి, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి దేశవ్యాప్త గుర్తింపు పొందిన పరిశ్రమలు ఈ జిల్లాలో ఉన్నాయి. వీటికి తోడు చిన్న తరహా పరిశ్రమలు కూడా వస్తే జిల్లా పురోగతి త్వరితగతిన సాధ్యమని ప్రభుత్వ పెద్దలు, అధికారులు నానా తంటాలు పడుతున్నారు. కాని తమ మామూళ్ల కోసం, గ్రామ, మండల స్థాయి రాజకీయాల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులు పరిశ్రమల ఏర్పాటును ముందుకు సాగనీయడం లేదు.
డబ్బులిస్తేనే..: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులకు కొంతమంది అవినీతి ప్రజాప్రతినిధుల తీరు ఆటంకంగా మారింది. ఉత్సాహంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సింది పోయి, మామూళ్ల కోసం వేధిస్తున్న ఉదంతాలు జిల్లాలో చోటుచేసుకొంటున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే పరిశ్రమపై లేనిపోని అపోహలు సృష్టించి అడ్డంకించడం, డబ్బులు ఇస్తే దగ్గరుండి ఏర్పాటు చేయించడం ఇక్కడ బహిరంగరహస్యంగా మారింది.
సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లోనూ రాగినేడు తరహాలోనే సంఘటనలు జరిగినట్లు ప్రచారంలో ఉంది. ఆయా ప్రాంతాల్లో రెస్‌మిల్లులు, ఇతర పరిశ్రమలు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహికులను మామూళ్లు, రాజకీయ కారణాలతో వేధించడంతో కొంతమంది తమ ప్రయత్నాన్ని ఆదిలోనే విరమించుకొన్నట్లు సమాచారం.
స్థానికులకే ఉపాధి: జిల్లాలో ఏర్పాటవుతున్న చిన్నతరహా పరిశ్రమల మూలంగా స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఆ గ్రామం, చుట్టు ప్రక్కల గ్రామాల్లోని వారికే ఉపాధి అవకాశాలు కల్పి స్తున్నారు. దీనితో కొంతైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాని కొంతమంది ప్రజాప్రతినిధుల అవినీతి మూలంగా ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది.
ఎక్కువ పరిశ్రమలు రావాలి –ప్రేంకుమార్, జిల్లా మేనేజర్, పరిశ్రమల శాఖ
పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలో మరిన్ని పరిశ్రమలు రావాలి. జిల్లాలో భూములు, విద్యుత్, నీళ్లు పరిశ్రమలకు అవసరమయ్యే అన్ని వనరులున్నాయి. పరిశ్రమలు నెలకొల్పాడానికి ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ను ప్రవేశపెట్టింది. అనుమతులు కూడా సకాలంలోనే ఇస్తున్నాం. సింగరేణి, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తేనే, ఉపాధి మెరుగవుతుంది. ఇందుకు అందరు సహకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment