బీడు భూముల్లో ఇం‘ధనం’..! | - | Sakshi
Sakshi News home page

Ananthapur: నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంతో భూసేరణ.. బీడు భూముల్లో ఇం‘ధనం’!

Published Mon, Feb 5 2024 1:34 AM | Last Updated on Mon, Feb 5 2024 11:15 AM

- - Sakshi

డీ హీరేహాళ్‌ సమీపంలోని బీడు భూమి

రాయదుర్గం: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల చెంతకు వ్యవసాయ సేవలను తీసుకొచ్చింది. విత్తనం మొదలు పంట దిగుబడుల మార్కెటింగ్‌ వరకు సాయమందిస్తోంది. మరో వైపు వ్యవసాయం చేసే పరిస్థితులు లేక భూములు బీడు పెట్టుకున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది.

ఉమ్మడి జిల్లాలో బీడు భూములు కలిగిన రైతులకు ఇంధన రంగం ద్వారా శాశ్వత ఉపాధి మార్గం చూపేందుకు ముందుకొచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ.12,065 కోట్ల వ్యయంతో 3,350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటైతే ప్రత్యక్షంగా 3,300 మంది, పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి లభించనుంది.

నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో భూసేకరణ..
సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమయ్యే భూములను నెడ్‌క్యాప్‌ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. నెడ్‌క్యాప్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్రామసభలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని డీ హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌, కణేకల్లు, రాయదుర్గం మండలాల్లో ఇప్పటికే 15 వేల ఎకరాలు గుర్తించారు.

అందులో 6,750 ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం తీసుకున్నారు. ప్రస్తుతం డీ హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌ మండలాల్లో 850 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అదనంగా మరో 2,250 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇన్వెస్టర్లను ఒప్పించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా రాప్తాడులో 1,050 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో 1,050 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను నెడ్‌క్యాప్‌ ప్రతినిధులు ముమ్మరం చేశారు.

30 ఏళ్ల లీజుతో సుస్థిర ఆదాయం..
సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటైతే బీడు భూములకు మహర్దశ కలగనుంది. రైతుల అంగీకారం మేరకు 30 ఏళ్ల పాటు లీజు అగ్రిమెంట్‌తో నెడ్‌క్యాప్‌ ఒప్పందం చేసుకోనుంది. సాధారణంగా రైతు గుత్త (కౌలు)కు ఇస్తే ఎకరా రూ.5వేల నుంచి రూ.8 వేలకు మించదు. అలాంటిది ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు ధర నిర్ణయిస్తే, రైతు సంక్షేమం దృష్ట్యా మరో రూ.5 వేలు పెంచి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను ఒప్పించింది.


సోలార్‌ ప్లాంట్‌ ప్రతీకాత్మక చిత్రం
 

ఈ నేపథ్యంలో ఎకరాకు రూ.30 వేల చొప్పున రైతు ఖాతాకు నేరుగా జమ కానుంది. పంట పండినా ఇంత మొత్తం చూడటం సాధ్యం కాదని అన్నదాతలు అంటున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రెండింతల సుస్థిర ఆదాయం లభిస్తుండడంతో చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

మౌలిక వసతులు మెరుగు..
సోలర్‌ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంలో రెండు శాతం సీనరేజ్‌ నిధులను సమీప గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. తద్వారా రైతు, కూలీల జీవనోపాధికి తోడు గ్రామాల రూపురేఖలు మారనున్నాయి.

వలస మాటే లేకుండా సొంతూళ్లలోనే వేలాది మంది నిరుద్యోగులు, కూలీలకు ఉపాధి లభించనుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

రాయదుర్గం రూపురేఖలు మారుస్తాం
రాయదుర్గం ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది రూపురేఖలు మార్చుతాం. పేదరికం శాశ్వతంగా దూరం చేసేలా కృషి చేస్తాం. ఇప్పటికే జాజరకల్లు వద్ద రూ.533 కోట్ల వ్యయంతో ఇథనాల్‌ ఇంధన తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

తాజాగా సోలర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 3వేలకు పైగా మెగావాట్ల సోలర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఇన్వెస్టర్లను ఒప్పిస్తాం. రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సోలార్‌ ప్లాంట్లలో స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేస్తాం.


– మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌

రైతులు ముందుకు రావాలి
బీడు భూములు, వర్షాధారంగా అరకొరగా పంట పండే రైతులు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఐదు ఎకరాలున్న రైతు కూడా పైసా పెట్టుబడి లేకుండా ఏడాదికి రూ.1.50 లక్షలు పొందవచ్చు. భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దీనివల్ల ప్రయోజనం తెలిశాకే అంగీకారం పొందవచ్చు.


– రాణీ సుస్మిత, ఆర్డీఓ, కళ్యాణదుర్గం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement