good news to farmers
-
బీడు భూముల్లో ఇం‘ధనం’..!
రాయదుర్గం: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల చెంతకు వ్యవసాయ సేవలను తీసుకొచ్చింది. విత్తనం మొదలు పంట దిగుబడుల మార్కెటింగ్ వరకు సాయమందిస్తోంది. మరో వైపు వ్యవసాయం చేసే పరిస్థితులు లేక భూములు బీడు పెట్టుకున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో బీడు భూములు కలిగిన రైతులకు ఇంధన రంగం ద్వారా శాశ్వత ఉపాధి మార్గం చూపేందుకు ముందుకొచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో రూ.12,065 కోట్ల వ్యయంతో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటైతే ప్రత్యక్షంగా 3,300 మంది, పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి లభించనుంది. నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో భూసేకరణ.. సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమయ్యే భూములను నెడ్‌క్యాప్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. నెడ్‌క్యాప్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్రామసభలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం మండలాల్లో ఇప్పటికే 15 వేల ఎకరాలు గుర్తించారు. అందులో 6,750 ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం తీసుకున్నారు. ప్రస్తుతం డీ హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అదనంగా మరో 2,250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇన్వెస్టర్లను ఒప్పించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాప్తాడులో 1,050 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో 1,050 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను నెడ్‌క్యాప్ ప్రతినిధులు ముమ్మరం చేశారు. 30 ఏళ్ల లీజుతో సుస్థిర ఆదాయం.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటైతే బీడు భూములకు మహర్దశ కలగనుంది. రైతుల అంగీకారం మేరకు 30 ఏళ్ల పాటు లీజు అగ్రిమెంట్‌తో నెడ్‌క్యాప్ ఒప్పందం చేసుకోనుంది. సాధారణంగా రైతు గుత్త (కౌలు)కు ఇస్తే ఎకరా రూ.5వేల నుంచి రూ.8 వేలకు మించదు. అలాంటిది ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు ధర నిర్ణయిస్తే, రైతు సంక్షేమం దృష్ట్యా మరో రూ.5 వేలు పెంచి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను ఒప్పించింది. సోలార్ ప్లాంట్ ప్రతీకాత్మక చిత్రం ఈ నేపథ్యంలో ఎకరాకు రూ.30 వేల చొప్పున రైతు ఖాతాకు నేరుగా జమ కానుంది. పంట పండినా ఇంత మొత్తం చూడటం సాధ్యం కాదని అన్నదాతలు అంటున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రెండింతల సుస్థిర ఆదాయం లభిస్తుండడంతో చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మౌలిక వసతులు మెరుగు.. సోలర్ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంలో రెండు శాతం సీనరేజ్ నిధులను సమీప గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. తద్వారా రైతు, కూలీల జీవనోపాధికి తోడు గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. వలస మాటే లేకుండా సొంతూళ్లలోనే వేలాది మంది నిరుద్యోగులు, కూలీలకు ఉపాధి లభించనుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాయదుర్గం రూపురేఖలు మారుస్తాం రాయదుర్గం ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది రూపురేఖలు మార్చుతాం. పేదరికం శాశ్వతంగా దూరం చేసేలా కృషి చేస్తాం. ఇప్పటికే జాజరకల్లు వద్ద రూ.533 కోట్ల వ్యయంతో ఇథనాల్ ఇంధన తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించింది. తాజాగా సోలర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 3వేలకు పైగా మెగావాట్ల సోలర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఇన్వెస్టర్లను ఒప్పిస్తాం. రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సోలార్ ప్లాంట్లలో స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేస్తాం. – మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రైతులు ముందుకు రావాలి బీడు భూములు, వర్షాధారంగా అరకొరగా పంట పండే రైతులు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఐదు ఎకరాలున్న రైతు కూడా పైసా పెట్టుబడి లేకుండా ఏడాదికి రూ.1.50 లక్షలు పొందవచ్చు. భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దీనివల్ల ప్రయోజనం తెలిశాకే అంగీకారం పొందవచ్చు. – రాణీ సుస్మిత, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
రైతుకు మరింత దన్ను
సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది. పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు.. ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్‌ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్‌గోయల్ పేర్కొన్నారు. రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్‌చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్‌కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు. -
కేసీఆర్ ‘తీపి కబురు’ ఇదేనా!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి సంబంధించి త్వరలో ప్రపంచంలో ఎవరూ ఊహించని రీతిలో త్వరలో తీపి కబురు ఉంటుందని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సీఎం చేసే ప్రకటన ఏ తరహాలో ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర వ్యవసాయాభివృద్ధి విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవడం ఈ రాష్ట్ర పౌరులుగా మనందరికీ గర్వకారణం’అని బడ్జెట్ సమావేశాల్లో పేరొన్న సీఎం ఇప్పటికే రైతు సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రైతుల కోసం ‘సమీకృత రైతు సంక్షేమ పథకం’ను అమలు చేయడం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పెట్టుబడి మొదలుకుని గిట్టుబాటు దాకా.. అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాల(రైతుబంధు, రైతు బీమా, విత్తన సబ్సిడీ, పంట కొనుగోలు)కు మరికొన్నింటిని జోడించి వ్యవసాయాన్ని పండుగగా మార్చాలన్నది కేసీఆర్ అంతరంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆలోచనలో మొగ్గ తొడిగిన ఈ పథకంలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులను ఉచితంగా అందజేయడం మొదలు పెట్టుబడి సమకూర్చడం, గిట్టుబాటు ధరకు పంటల కొనుగోలు వరకు అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త పథకానికి తుది రూపు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తాజా సంకేతాలు వెల్లడిస్తున్నాయి. దీని కోసమయ్యే ఆర్థిక అవసరాలపై కూడా ఆయన ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు సమచారం. సీఎం శుభవార్తలో ఇవి ఉండే అవకాశం.. ►పంటల బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లించడం. ►ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో పంట నష్టం జరిగితే బీమా సంస్థల నుంచి పరిహారం అందించడం. ►నియంత్రిత సాగు విధానంలో భాగంగా సర్కారు ఆదేశాలను పాటించే రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాల పంపిణీ. ►పంటలు, మద్దతు ధరను వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే ప్రకటించడం. ► పంట దిగుబడుల సేకరణపై సీజన్ ప్రారంభానికి ముందే రైతులతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఒప్పందం చేసుకోవడం. ►పంట దిగుబడులకు కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరకు మరింత ప్రోత్సాహాకాన్ని జత చేసి మార్క్‌ఫెడ్, పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా కొనుగోలు. ►పంట దిగుబడులను కల్లాల వద్ద నుంచే కొనుగోలు చేయడం. ఉపాధి హామీ పథకం కింద కల్లాల ఏర్పాటుకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వడం. ► రైతుబంధు సమితిలను బలోపేతం చేయడంతో పాటు ప్రతీ వ్యవసాయ క్లస్టర్లో రైతు వేదికల నిర్మాణం. వీటి కోసం రూ.350 కోట్లు కేటాయింపు. ► ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసేలా కేంద్రాన్ని ఒప్పించడం. -
ఇన్పుట్ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు శుభవార్త. వర్షాలతో నష్టపోయిన కష్టజీవికి ఊరటనిచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) మంజూరీకి పచ్చజెండా ఊపింది. ఇప్పటికే జిల్లాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం.. బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో వారం రోజుల్లో జిల్లాలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ. 24.45 కోట్లు విడుదల కానున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పంట నష్టపోయిన 92,483 మంది రైతులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. గత ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా రైతాంగం కుదేలైంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి నవంబర్ వరకు వరుసగా వర్షాలు కురిశాయి. దీంతో పంటనష్టం అంచానాలకు ఉపక్రమించిన అధికారులు తుది నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో అధికంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఇవేగాకుండా జొన్న, ఆముదం, సోయాచిక్కుడు పంటలు కూడా పాడయ్యాయి. ఈనేపథ్యంలో నివేదికలు రూపొందించిన వ్యవసాయ శాఖ అధికారులు నవంబర్ నెలాఖరులో ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రెండు,మూడు రోజుల్లో నిధుల వివరాలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఉద్యాన పంటలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత రెండేళ్ల నుంచి కూడా నష్టపోయిన ఉద్యాన రైతులకు ఇప్పటివరకు కూడా పరిహారం జాడ లేకపోవడం గమనార్హం.