ఎర్రవల్లిలో రైతు వేదిక నిర్మాణం కోసం భూమి పూజ చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి సంబంధించి త్వరలో ప్రపంచంలో ఎవరూ ఊహించని రీతిలో త్వరలో తీపి కబురు ఉంటుందని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సీఎం చేసే ప్రకటన ఏ తరహాలో ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర వ్యవసాయాభివృద్ధి విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవడం ఈ రాష్ట్ర పౌరులుగా మనందరికీ గర్వకారణం’అని బడ్జెట్ సమావేశాల్లో పేరొన్న సీఎం ఇప్పటికే రైతు సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రైతుల కోసం ‘సమీకృత రైతు సంక్షేమ పథకం’ను అమలు చేయడం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పెట్టుబడి మొదలుకుని గిట్టుబాటు దాకా.. అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాల(రైతుబంధు, రైతు బీమా, విత్తన సబ్సిడీ, పంట కొనుగోలు)కు మరికొన్నింటిని జోడించి వ్యవసాయాన్ని పండుగగా మార్చాలన్నది కేసీఆర్ అంతరంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆలోచనలో మొగ్గ తొడిగిన ఈ పథకంలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులను ఉచితంగా అందజేయడం మొదలు పెట్టుబడి సమకూర్చడం, గిట్టుబాటు ధరకు పంటల కొనుగోలు వరకు అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త పథకానికి తుది రూపు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తాజా సంకేతాలు వెల్లడిస్తున్నాయి. దీని కోసమయ్యే ఆర్థిక అవసరాలపై కూడా ఆయన ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు సమచారం.
సీఎం శుభవార్తలో ఇవి ఉండే అవకాశం..
►పంటల బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లించడం.
►ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో పంట నష్టం జరిగితే బీమా సంస్థల నుంచి పరిహారం అందించడం.
►నియంత్రిత సాగు విధానంలో భాగంగా సర్కారు ఆదేశాలను పాటించే రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాల పంపిణీ.
►పంటలు, మద్దతు ధరను వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే ప్రకటించడం.
► పంట దిగుబడుల సేకరణపై సీజన్ ప్రారంభానికి ముందే రైతులతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఒప్పందం చేసుకోవడం.
►పంట దిగుబడులకు కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరకు మరింత ప్రోత్సాహాకాన్ని జత చేసి మార్క్‌ఫెడ్, పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా కొనుగోలు.
►పంట దిగుబడులను కల్లాల వద్ద నుంచే కొనుగోలు చేయడం. ఉపాధి హామీ పథకం కింద కల్లాల ఏర్పాటుకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వడం.
► రైతుబంధు సమితిలను బలోపేతం చేయడంతో పాటు ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌లో రైతు వేదికల నిర్మాణం. వీటి కోసం రూ.350 కోట్లు కేటాయింపు.
► ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసేలా కేంద్రాన్ని ఒప్పించడం.
Comments
Please login to add a commentAdd a comment