సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వమని, దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి కనిపించడం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేసిందని విమర్శించారు. దేశ రైతాంగం నాగళ్లు ఎత్తి తిరగబడితేనే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. బుధవారం రైతుల అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన అనంతరం.. ఆయా అంశాలపై సీఎం స్పందనతో పత్రికా ప్రకటన విడుదల చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేయడం.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరినా నిర్ణయం తీసుకోకుండా నాన్చడం.. విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం.. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గంగా వ్యవహరించడం వంటి చర్యల వెనుక కుట్ర దాగి ఉంది. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్రలు ఇవి. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి.. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని ప్రజలంతా కలిసి కూకటివేళ్లతో పెకలించి వేయాలి..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
కేంద్రం మెడలు వంచుతాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి, రైతులు వ్యవసాయం చేసుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. దేశ రైతాంగం నాగళ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించకపోతే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను అర్థం చేసుకోవాలని, కేంద్రం ధరలు తగ్గించేదాకా సాగే పోరాటంలో కలిసి రావాలని రైతులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment