press note
-
నాగళ్లు ఎత్తి తిరగబడితేనే.. సాగు బతికేది
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వమని, దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి కనిపించడం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేసిందని విమర్శించారు. దేశ రైతాంగం నాగళ్లు ఎత్తి తిరగబడితేనే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. బుధవారం రైతుల అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన అనంతరం.. ఆయా అంశాలపై సీఎం స్పందనతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేయడం.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరినా నిర్ణయం తీసుకోకుండా నాన్చడం.. విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం.. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గంగా వ్యవహరించడం వంటి చర్యల వెనుక కుట్ర దాగి ఉంది. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్రలు ఇవి. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి.. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని ప్రజలంతా కలిసి కూకటివేళ్లతో పెకలించి వేయాలి..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచుతాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి, రైతులు వ్యవసాయం చేసుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. దేశ రైతాంగం నాగళ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించకపోతే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను అర్థం చేసుకోవాలని, కేంద్రం ధరలు తగ్గించేదాకా సాగే పోరాటంలో కలిసి రావాలని రైతులను కోరారు. -
ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రెస్ నోట్ ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టవచ్చా? బాధితుడి తరఫున ట్రిబ్యునల్ సభ్యుడు విచారణ ప్రారంభించవచ్చా? పార్టీతో ట్రిబ్యునల్ సభ్యుడు జతకట్టే అవకాశం లేదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చట్టం–2010 ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలు, లేఖలు, విజ్ఞప్తులు ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా? అనే అంశంపై జస్టిస్ ఎం.ఎం.ఖానీ్వల్కర్, జస్టిస్ హృషికేశ్, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా వ్యర్థాల తొలగింపుపై ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టి, ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కేరళలో క్వారీల ఏర్పాటుకు నివాస స్థలాల నుంచి కనీస దూర నియమాన్ని 200 మీటర్లు నుంచి 50 మీటర్లకు తగ్గించారంటూ వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ కేసులో ఎన్జీటీకి అధికార పరిధి ఉందని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కొత్త క్వారీల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది. నిబంధనలు సమగ్ర ప్రాతిపదికన చదవాలి ఎన్జీటీకి న్యాయ సమీక్ష చేసే అధికారం లేదని ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14 చెబుతోందని థామ్సన్ అగ్రిగేట్స్, క్రిస్టల్ అగ్రిగేట్స్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ పరిధి విస్తరణ నిర్ణయం విషయంలో సెక్షన్ 14(1), (2)లు కలిపి చదవాలని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ దరఖాస్తు స్వీకరించడానికి అవసరమైన షరతులను సెక్షన్ 14(3) వివరిస్తోందని, ఎవరైనా దరఖాస్తుతో వస్తే సెక్షన్ 14లోని సబ్‌సెక్షన్ 3 ప్రకారం స్వీకరించాలని, అంతేకానీ ఓ లేఖ ద్వారా విచారణ చేపట్టరాదని వి.గిరి తెలిపారు. ఆర్టికల్ 323ఏ ప్రకారం ఎన్జీటీ ఏర్పాటు కాలేదు ఆర్టికల్ 323ఏ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఎన్జీటీ కాదని కేరళ తరఫున్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు. అందుకే శాసన అధికారాలను సమీక్షించే అధికారం ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, 32 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్న అధికారాలు ఎన్జీటీకి లేవన్నారు. ఎన్జీటీ చట్టంలోని ఏ ప్రొవిజన్ కూడా ట్రిబ్యునల్‌కు సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జీటీ సుమోటోగా కేసు చేపట్టాలంటే చట్టంలో ఉండాలని జైదీప్ తెలిపారు. అధికార పరిధి ఉన్న కోర్టులు కూడా చట్టబద్ధమైన నిబం« దనలకు వ్యతిరేకంగా వెళ్లవని వ్యాఖ్యానించారు. శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలి ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదు, ఎందుకంటే చట్టం ఆ మేరకు అవకాశం కల్పించలేదని ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా తెలిపారు. శాసనంలోని భాష నుంచి శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్‌కు అలాంటి అధికారం ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఎన్జీటీకి సుమోటో అధికార పరిధి ఉందని చెబితే, చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుందని ధ్రువ్ మెహతా పేర్కొన్నారు. అధికారం లేకున్నా చట్టం ద్వారా నిరోధించలేం ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేకున్నా చట్టం ద్వారా దాని పనితీరును నిరోధించలేమని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. సుమోటో విచారణలో ఎన్జీటీ బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అయితే, ట్రిబ్యునల్‌కు ఎలాంటి సుమోటో అధికారాలు లేవని ఆమె తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కోర్టులకే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టులే సుమోటో విచారణలు చేపట్టాలని అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. నేషనల్ ఎన్విరానిమెంటల్ అప్పీలేట్ అథారిటీ యాక్ట్ 1997 ప్రకారం ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్–2010 వచ్చాకా అథారిటీ యాక్ట్ రద్దయిందన్నారు. ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఉందని గ్రోవర్ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ట్రిబ్యునల్ దృష్టికి ఏదైనా అంశం వస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. లా కమిషన్ నివేదిక చెబుతోంది ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనేది చట్టసభల ఉద్దేశమని 186వ లా కమిషన్ నివేదిక చెబుతోందని ఓ పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వెల్లడించారు. ఎన్జీటీకి విస్తృత అధికారాలు ఇవ్వడాన్ని ‘స్థానిక’ అంశాలు డైల్యూట్ చేసినప్పటికీ సుమోటోగా కేసులు స్వీకరించే అధికారం పొందేంతగా లేదని స్పష్టం చేశారు. అప్లికేషన్ ద్వారానే విచారణ చేపట్టాలనే అధికార పరిధిని చట్టం పేర్కొందని, సుమోటో విచారణల ద్వారా కాదని తెలిపారు. ప్రతిపాదిత ట్రిబ్యునళ్ల పరిధి దాటి ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ అప్పీలేట్, న్యాయ సమీక్ష హైకోర్టుల పరిధిలోకి తీసుకొచ్చామని లాకమిషన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. -
‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పరిధిలోకి 95 శాతం ప్రజలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైద్యరంగంలో రెండేళ్ల ప్రగతికి సంబంధించి శనివారం ప్రభుత్వం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆ అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకు రాష్ట్రంలో 95 శాతం ప్రజలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్(మ్యుకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్) చికిత్సలన కొత్తగా చేర్చినట్లు నివేదికలో పేర్కొంది. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 అందజేస్తున్నారు. నాడు-నేడు పథకం కింద దశలవారీగా మూడేళ్లలో ఆసుపత్రుల ఆధునీకరణ చేసినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకం చేపట్టారు. వీటితో పాటు 108/104 సేవల కోసం 1180 అంబులెన్స్ లు, సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశారు.“వైఎస్సార్ కంటి వెలుగు” పథకం క్రింద ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3,000 నుండి రూ.10 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నారు. వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ చదవండి: ఆరోగ్యశ్రీకి పడకలివ్వకుంటే అనుమతులు రద్దు -
‘ఏపీ నూతన పారిశ్రామిక విధానం హర్షణీయం’
సాక్షి, గుంటూరు: ఏపీలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ రావడం శుభపరిణామమని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడించారు. 'వైఎస్సార్ ఏపీ వన్' పేరుతో మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడంపై సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుమతుల వేగవంతానికి వైఎస్ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ పారిశ్రామిక విధానంలో మెగా ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా రాయితీలు కల్పించడం.. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందన్నారు. (చదవండి: త్వరలో ఐటీ పాలసీ విడుదల) ఈ పాలసీ 2020-2023 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు లక్ష్మణరెడ్డి తెలియజేశారు.దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ఈ కొత్త విధానం తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం ఉన్న యువతను ఈ పరిశ్రమలకు అందించటమే లక్ష్యంగా నూతన విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ప్రస్తుత పారిశ్రామిక విధానం ఈ ఏడాది మార్చితో గడువు పూర్తవుతుందని.. అమలు సాధ్యం కాని అంశాలను గత ప్రభుత్వం అందులో చొప్పించడం బాధాకరమని ఆయన అన్నారు. (చదవండి: సమగ్ర అభివృద్ధికి ‘వైఎస్సార్ ఏపీ వన్’: గౌతమ్‌రెడ్డి) ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించిందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ఈ పాలసీ లక్ష్యమన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. పారిశ్రామిక రంగంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని.. మహిళల్ని ప్రోత్సహించేలా కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చారని తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువతను అందించడంతో పాటు, కొత్త పాలసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని లక్ష్మణరెడ్డి వివరించారు. -
సుశాంత్ కేసు: ప్రెస్ నోట్ విడుదల
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగు చుస్తున్నాయి. అయితే సుశాంత్ కేసును సీబీఐకి దర్యాప్తుకు ఆదేశించాలన్న బీహార్ ప్రభుత్వ సిఫారస్సుకు సుప్రీం కోర్టు ఇవాళ (బుధవారం) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం సుశాంత్ మరణం వెనక ఉన్న నిజాలు బయటపడాలని సీబీఐని సూచించింది. దీంతో సుశాంత్ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ మేనేజర్ దిషా సాలియన్ మృతి కేసు కూడా వెలుగులోకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్యకు వారం ముందు దిషా సాలియన్ కూడా ఆత్మహత్య చేసకుని మృతి చెందిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే సుశాంత్, దిషా ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఎదైన సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు దిషా ఆత్మహత్యపై ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తప ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలు ఎవరికైన తెలిస్తే తమను వెంటనే సంప్రదించాలని ముంబై పోలీసులు ప్రకటనలో పిలుపునిచ్చారు. (చదవండి: ‘రియాపై ఒత్తిడి పెంచి.. వారిద్దరిని విడదీయండి’) అయితే సుశాంత్‌కు ప్రాణహాని ఉందని ఫిబ్రవరిలోనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సుశాంత్ తండ్రి ఇటీవల చేసిన వ్యాఖ్యాలపై డీసీపీ పరమ్‌జిత్ ఎస్ దహియా స్పందించారు. ఆయన మాకు సుశాంత్ భద్రతపై ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. అయితే ‘తన కొడుకు భద్రతపై తనకు ఆందోళనగా ఉందని, మిరాండా అనే వ్యక్తిని అరెస్టు చేయాలని ఆయన మాకు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశాడు. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ఆయనకు అప్పుడే స్పష్టంగా చేశాం. కానీ మాకు ఆయన నుంచి ఫిబ్రవరి ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. అంతేగాక రియా సుశాంత్‌తో ఆత్మహత్యకు ప్రేరెపించేలా ప్రవర్తించిందని, సుశాంత్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆయన ఆరోపించినట్లను చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న రియా కనిపించడం లేదని డీజీపీ వెల్లడించారు. (చదవండి: రియా చక్రవర్తి ఎక్కడుందో తెలియదు : డీజీపీ) -
రాష్ట్రంలో మత కల్లోలానికి టీడీపీ కుట్రలు : డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి : మతాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాష్ట్రంలో కల్లోలం రేపాలని టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఆరోపించారు. పవిత్రయాత్రలకు రాయితీలు ఇవ్వడం దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ విధానమంటూ.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాన్ని అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో.. ‘రాష్ట్రంలో మత ఘర్షణలకు ప్రతి పక్ష తెలుగదేశం పార్టీ, కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, దాని అనుకూల మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల ముసుగులో విద్వేషకారులు రాష్ట్రంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి అలజడి సృష్టించానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ ఆయా వర్గాల మేలుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటిని కూడా వక్రీకరించి, అల్పబుద్ధితో గౌరవ ముఖ్యమంత్రిగారి మీద, ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు. ఈ కుయత్నాల్లో కొన్ని మీడియా సంస్థలు భాగస్వాములు కావడం దురదృష్టకరం. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవిత్ర యాత్రలకోసం ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమం కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈకార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. గత అక్టోబరు 30 జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవిత్ర యాత్రలకు వెళ్తున్న క్రైస్తవ, మైనార్టీ సోదరులకు రాయితీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. హజ్, జెరూసలేంలకు వెళ్తున్న యాత్రికుల వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.40వేల నుంచి రూ.60వేలకు, రూ. 3లక్షలకు పైబడి ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.20వేల నుంచి రూ.30వేలకూ పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పై నిర్ణయాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ విభాగాలు జీవోలు జారీచేస్తున్నాయి. ఈ జీవోలను పట్టుకుని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాలను అంటుగడుతూ చేస్తున్న ప్రచారం అత్యంత దుర్మార్గమైనది. రాష్ట్రంలో మతాలమధ్య చిచ్చు పెట్టే పన్నాగమిది. వీటిని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ప్రభుత్వానికి అన్ని మతాలూ సమానమే. అందరి సంక్షేమం మా లక్ష్య’మంటూ ముగించారు. -
చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సూటి ప్రశ్నలు
సాక్షి, అమరావతి : మంచిని మంచిగా, చెడును చెడుగా చూడలేని ప్రతిపక్ష నేత ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలకు చంద్రబాబు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. మహాత్ముని 150వ జయంతిని పురస్కరించుకొని.. గ్రామ సచివాలయాలు ప్రారంభిస్తున్న వేళ.. చంద్రబాబు పాలనకు వైఎస్ జగన్ పాలనకు మధ్య తేడాలను చూపిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్లు సంయుక్తంగా బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ ఈ ప్రకటనలో ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రెస్‌నోట్‌లోని ప్రశ్నల పరంపర ఇది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్నలు:- 1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ ప్రారంభిస్తున్నందుకు టీడీపీ సంతోషించకపోగా.. బాధపడుతోందా..? 2) గడిచిన మీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు జన్మభూమి కమిటీ వ్యవస్ధ ద్వారా మీరు చేసిన అరాచకాలు-దోపిడీలను కప్పిపుచ్చుకునేందుకే చివరికి గ్రామ వాలంటీర్ల వ్యవస్ధను కూడా విమర్శిస్తున్నారా..? 3) గ్రామ సచివాలయాలపై మీ స్టాండ్ ఏంటి చంద్రబాబు గారూ.. ? 4) 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలు, ప్రతీ 2వేల జనాభాకు 10 మందిని కేటాయించినందుకు మీరు సంతోషపడుతున్నారా లేక బాధపడుతున్నారా? 5) గ్రామ వాలంటీర్ల ఎంపిక కూడా అత్యంత నిష్పాక్షికంగా జరిగిందని ఏ గ్రామంలో అడిగినా చెప్తారు. 1.34 లక్షల మందికి ఒకే రోజున ఉద్యోగాలివ్వడం దేశచరిత్రలో ఎప్పుడైనా చూశారా? మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కల అయినా కన్నారా..? 6) మీరు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మీ జీవితంలో ఎప్పుడైనా 10వేల మందికి ఉద్యోగాలిచ్చారా.. ? కనీసం 1000 మందికైనా ఇచ్చారా..? 7) మీరు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల లోపు ఎప్పుడైనా ఉద్యోగాలు రిక్రూట్ చేశారా? 8) గ్రామాల్లోనే ఇళ్లపట్టాలిచ్చే వ్యవస్ధను ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? 9) గ్రామాల్లోనే ఎరువులు, పురుగుమందులు.. అవీ ప్రభుత్వం ధృవీకరించినవి అమ్మే ఏర్పాటు ఎప్పుడైనా చూశారా? 10) గ్రామాల్లోనే మహిళా పోలీస్ వ్యవస్ధను ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? 11) గ్రామసచివాలయం ద్వారా దాదాపు 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 పనులు అక్కడికక్కడే ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. మీ 14 యేళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా ? 12) మన మండలంలోనే మనకు ఉద్యోగాలొస్తున్నాయంటే.. మళ్ళీ గ్రామాలు బ్రతుకుతాయి.. అక్కడి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇటువంటి ఆలోచన మీరు ఎప్పుడైనా చేశారా ? 13) 2004 కు ముందు 9 యేళ్లు పరిపాలించి.. గ్రామాలన్నీఖాళీ అవడానికి కారణం మీరు కాదా ? 14) గ్రామాల్లో ఎక్కువ కరెంటు కోతలు, ఉచిత విద్యుత్ ఎట్టి పరిస్ధితుల్లో ఇచ్చేది లేదన్నమీ స్టేట్ మెంట్, కరెంటు బకాయిలున్న రైతులపై కేసులు పెట్టి ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టిన చరిత్ర మీది కాదా..? 15) 2014-18 మధ్య రుణమాఫీ చేయకుండా వ్యవసాయాన్ని చావుదెబ్బ కొట్టారు. బంగారాన్ని విడిపించలేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వ లేదు. భీమా ఇవ్వలేదు. ధరలస్ధిరీకరణ లేదు. ప్రకృతి విపత్తు నిధీ లేదు. చివరకు అధికారంలోకి రాగానే పించన్లు, రేషన్‌కార్డులను పార్టీల వారీగా విభజించి 10 లక్షల చొప్పున తొలగించింది మీరు కాదా..? 16) జన్మభూమి కమిటీలని పెట్టి రేషన్ కార్డు కావాలంటే లంచం, ఫించన్ కావాలంటే లంచం.. ఇళ్ల పట్టాలకు, మరుగుదొడ్లకు, భీమాకు కూడా లంచాలు వసూలు చేసిన ఘన చరిత్ర మీది కాదా..? 17) చివరకి ఇసుక, మట్టి కూడా అమ్ముకున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి మేం చంద్రబాబు గారిని నేరుగా ఈ ప్రశ్న అడుగుతున్నాం. మీ జన్మభూమి కమిటీలు బాగున్నాయా ? మా గ్రామ సచివాలయాలు బాగున్నాయా ? సూటిగా సమాధానం చెప్పండి. 18) మీ జన్మభూమి కమిటీల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? మా గ్రామ సచివాలయాల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది, ఈ రెండూ అసలు పోల్చతగినవేనా.. ? ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే పల్లె ప్రజలకు, పల్లెల్లోనే వారి గుమ్మం వద్దే అన్ని కార్యక్రమాలు అందుతుంటే ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి ... మీ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఫ్యాక్షనిస్టుని మహానాయకుడిగా చూపించడం మీకు సిగ్గుచేటు కాదా ? 19) ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి గారిపై మీరు, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఓ దొంగ కేసు విషయంలో సిబిఐ ఓ కౌంటర్ వేసిందంటూ మీరు, మీ మీడియా ఆనందపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు పరిపాలన మీద ఫోకస్ చేస్తుంటే.. మీకందుకు అంత భయం చంద్రబాబు గారూ.. ? 20) గత నాలుగు నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనినైనా మీరు మెచ్చుకున్నారా ? కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు ఇస్తుంటే ఆ బిల్లులకైనా మీరు మద్ధతిచ్చారా ? 21) నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు ఇస్తూ .. దేశంలోనే మొదటిసారిగా ఒక చట్టం మన అసెంబ్లీలో పాస్ అవుతుంటే దానికైనా మీరు మద్ధతిచ్చారా.. ? 22) నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడే శక్తి లేక మీ రాజ్యసభ సభ్యులు మొదలు.. మామూలు నాయకుల వరకు సగం మందిని వ్యూహాత్మకంగా బిజేపిలోకి పంపించి, దీన్నే గొప్ప రాజకీయంగా మీరు భావిస్తున్నది మీరు కాదా..? అంతేకాక, గత నాలుగునెలలుగా చంద్రబాబు ఎవరికి మద్ధతిచ్చారన్నది గమనిస్తే.. 1. మీరు అక్రమంగా నివాసముంటున్న ఇల్లు కట్టిన లింగమనేనికి మద్ధతిచ్చారు 2. మీరు ఏటీఎంగా మార్చుకున్న పోలవరం కాంట్రాక్టరుకు సంపూర్ణ మద్ధతిచ్చారు. 3. మీ పార్టీలో ఉంటూ మీ వల్ల చనిపోయిన ఫ్యాక్షనిస్ట్‌కు మద్ధతిచ్చారు. 4. మీరు లంచాలు గుంజి చేసుకున్న పీపీఏల విషయంలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రైవేటు పవర్ ప్రొడ్యూసర్లకు మద్దతిచ్చారు. ఇవన్నీ గమనించిన తర్వాత మీ నాలుగు నెలల ప్రతిపక్ష రాజకీయం ఎలా ఉందంటే ... 1. ఎస్సీల బిల్లుకు మద్దతు లేదు 2. ఎస్టీల బిల్లుకు మద్దతు లేదు 3. బీసీల బిల్లుకు మద్దతు లేదు 4. మైనార్టీల బిల్లుకు మద్దతు లేదు 5. మహిళల బిల్లుకు మద్దతు లేదు 6. గ్రామ సచివాలయాలకు మద్దతు లేదు 7. జ్యుడీషియల్ ప్రివ్యూ బిల్లుకు మద్దతులేదు 8. ప్రజా ధనాన్ని మిగిల్చే రివర్స్ టెండరింగ్ కి మద్దతు లేదు 9. ఆశా కార్యకర్తల జీతాలు పెంపుదలకు మద్దతు లేదు 10. పోలీసులుకు వారాంతపు సెలవుకు మద్దతు లేదు 11. ఆటో డ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తుంటే మద్దతు లేదు 12. స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతులేదు.. ఆసుపత్రులు బాగు చేసినా మద్దతు లేదు. 13. జలాశయాలన్నీ నిండుకుండల్లా నిండినా.... అన్ని జిల్లాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురిసినా మీకు సంతోషం లేదు. 14. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతానికి పైగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినా మీకు సంతోషం లేదు. పై అంశాలను గమనిస్తే.. మీరు ప్రతిపక్ష నాయకులా.. ప్రజా వ్యతిరేక నాయకులా చంద్రబాబు గారూ..? అంటూ ప్రశ్నించారు. -
అవినీతిని ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు?
సాక్షి, అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్‌పై మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో వందల కోట్లు చేతులు మారాయని.. ఆనాడూ జరిగిన అవినీతిని రామోజీరావు తన పత్రికలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 20 శాతం వరకు టెండర్లు వేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి వందల కోట్ల మేలు జరిగే అవకాశం ఉంటుందనే సంగతి తెలిసి కూడా తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారో రామోజీరావు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఆర్అండ్ఆర్ ఖర్చులు భరించడంతోపాటు, అనుమతులన్నీ సాధించి పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 31 నెలలు పోలవరం పనులు జరగకుండా మోకాలడ్డు పెట్టారన్నారు. చంద్రబాబు.. ప్రత్యేక హోదాను తాకట్టును పెట్టి పోలవరం ప్రాజెక్టును తనకు ఇవ్వాల్సిందిగా 2016 సెప్టెంబర్ 8న అర్ధరాత్రి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. లంచాలు, కమీషన్లు ఇచ్చిన అస్మదీయులకు బాబు కాంట్రాక్టులు అప్పగించారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచి.. చంద్రబాబులా డబ్బు దోచుకునేవిధంగా కాకుండా.. ప్రాజెక్టు వ్యయం తగ్గించేవిధంగా దేశంలోనే తొలిసారిగా అత్యంత పారదర్శకంగా టెండర్లను పిలిచి రివర్స్ టెండరింగ్‌ను అమలు చేస్తున్నామన్నారు. -
8న ఇంటర్ ఫలితాలంటూ నకిలీ ప్రెస్‌నోట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 8న విడుదలవుతాయంటూ ఇంటర్ బోర్డు పేరిట వాట్సాప్‌లో నకిలీ ప్రెస్‌నోట్ చక్కర్లు కొడుతుండటాన్ని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. తన పేరుతోపాటు బోర్డు పరీక్షల నియంత్రణ విభాగం రిటైర్డ్ అధికారి సుశీల్‌కుమార్ సంతకం, రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు లోగోలతో నకిలీ ప్రెస్‌నోట్ తయారు చేసి వాట్సాప్‌లో పెట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని బోర్డు కార్యదర్శిని జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని, నకిలీ ప్రెస్‌నోట్‌ను సర్క్యులేట్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని కార్యదర్శికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు బోర్డు కార్యదర్శి ఈ వ్యవహారంపై ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల తేదీపై తాముకానీ లేదా మంత్రి పేషీ కానీ ఎలాంటి ప్రెస్‌నోట్ విడుదల చేయలేదని వివరణ ఇచ్చారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఇంకా కొనసాగుతోందని, ఈ ప్రక్రియ ట్యాబ్యులేషన్ పనులు చేయాల్సి ఉందన్నారు. అవన్నీ పూర్తయ్యాక ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించారు. -
ఈ నెల 30 నుంచి‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ‘స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా’ కార్యక్రమంలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ జాతీయ ప్రోగ్రామింగ్ సదస్సుకు సీవీఆర్ కళాశాల మరోసారి ఆథిత్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ సీవీ రాఘవ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మార్చి 30న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏ.ఐ.సీ.టీ.ఈ) చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్దే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీవీఆర్ కళాశాల సేవలను గుర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, కేంద్ర మానవ వనరుల శాఖలు ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ నిర్వహణకు రెండోసారి అవకాశం కల్పించాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 28 నోడల్ సెంటర్లలో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో పాల్గొంటున్న 40 విద్యార్థి బృందాలకు సదుపాయాలు కల్పిస్తామని సీవీ రాఘవ వెల్లడించారు. గత ప్రోగ్రామింగ్ సదస్సులో దివ్యాంగ సంక్షేమ శాఖకు సాఫ్ట్వేర్, దివ్యాంగులకు అసరమైన పరికరాలను రూపొందించమన్నారు. ఈ ఏడాది కేంద్రీయ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అవసరమైన నమూనా పరిష్కారాలను హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను అందించనున్నామని తెలిపారు. పోటీలో ప్రతిభ కనబర్చిన వారికి 31వ తేదీ సాయంత్రం బహుమతులు అందజేస్తామని ఆయన అన్నారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో, మూడో బహుమతిగా 75 వేలు, 50 వేల రూపాలయలు అందిస్తామని అన్నారు. సీవీఆర్ కళాశాల గతేడాది మాదిరిగానే రెండు జట్లకు రూ.25,000 ప్రోత్సాహక బహుమతులు అందిస్తుందని పేర్కొన్నారు. -
ప్రజారవాణాను పెంచడం పైనే తమ దృష్టి
-
‘ఒక్క నెలలో 32 లక్షల మంది ప్రయాణించారు’
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభించిన ఒక్క నెలలోనే 32.25 లక్షల మంది ప్రయాణించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రకటన సారాంశం...అనేక సమస్యలు ఎదుర్కొని మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాను ఎన్నో సార్లు మదనపడ్డానని, ఎన్నో విమర్శలు కూడా వచ్చాయని చెప్పారు. తెలంగాణ వస్తే ఎల్ అండ్ టీ వెళ్లిపోతుందనే పుకార్లు కూడా వచ్చాయని అన్నారు. అన్నింటినీ తట్టుకున్నామని వ్యాఖ్యానించారు. నెల రోజుల కిందట రైలు ప్రారంభం అయిందని, ప్రి మెట్రో, పోస్ట్ మెట్రోకు సంబంధించి ముందే ప్రెజేంటేషన్ ఇచ్చానని వెల్లడించారు. రైలు ప్రారంభం అయిన తర్వాత కూడా విమర్శలు వచ్చాయని, సగటున రోజుకు లక్షమంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. 23 స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం ఉందని, ఒక్క ప్రకాష్ నగర్ స్టేషన్ వద్ద మాత్రమే పార్కింగ్ సౌకర్యం లేదన్నారు. ప్రజారవాణాను పెంచడం పైనే తమ దృష్టి ఉందన్నారు. కంప్యూటరైజ్డ్ స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను త్వరంలో ప్రవేశపెడతామని చెప్పారు. కలర్ కోడింగ్‌ను అమలు చేసి పార్కింగ్ ఇబ్బందులు తొలగిస్తామన్నారు. ఫుట్ పాత్ నడకను నగర వాసులకు అలవాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, 220 మీటర్ల ప్రాంతం ప్రతి స్టేషన్లో ఫుట్ పాత్ కోసం కేటాయిస్లున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ 1.5 లక్షల స్మార్ట్ కార్డులు అమ్ముడు పోయానని, 22 శాతం ప్రయాణికులు స్మార్ట్ కార్డులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ కొత్తగా రెండు వేల మంది ప్రయాణికులు స్మార్ట్‌కార్డులు తీసుకుంటున్నారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో ప్రతి స్టేషన్లో మెట్రో టైం టేబుల్ ప్రదర్శించేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే టాయిలెట్ల ఏర్పాటు, మెయింటెనన్స్ కోసం వారంలో టెండర్లు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
చౌకదుకాణాలు కాదు.. చౌకబారు దుకాణాలు
సాక్షి, హైదరాబాద్ : గ్రామగ్రామాన చంద్రన్న చౌకదుకాణాల పేరిట ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్దమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించింది. గ్రామాల్లోని చిన్న వ్యాపారుల లాభాన్ని హెరిటేజ్‌కు మళ్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మరో కుట్రకు తెరలేపాడని ఆరోపించింది. ఇప్పటికే జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో దోచుకుంటున్న బాబు వర్గం.. ఈస్ట్ఇండియా కంపెనీ మాదిరి విడతల వారిగా ఈ విలేజ్ మాల్స్‌తో చిన్నవ్యాపారుల పొట్టగొట్టేందుకు సిద్దమైందని పేర్కొంది. తాను చేసిన పనులకు భవిష్యత్తులో తన పేరు ఎవరు గుర్తుంచుకోరనే భావనతో సీఎం చంద్రబాబు అన్ని సంక్షేమ పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నారని ఎద్దేవ చేసింది. చివరకు తన కొడుకు లోకేశ్ కూడా గుర్తుపెట్టుకోడనే బాబు ఇలా ప్రవర్తిస్తున్నాడని పేర్కొంది. ఈ విలేజ్ మాల్స్ వెనుక చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వార్థం, వ్యాపార వ్యూహాలు, రాజకీయ కుట్రలు దాగున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని స్పష్టం చేసింది. గ్రామల్లోని చిన్న దుకాణాలు, బడ్డీకొట్టుల నిర్వహాకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొంది. -
తమిళనాయుడికి రూ.3,249 కోట్లా?
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ప్రెస్ నోట్లో ఘోరమైన తప్పు దొర్లింది. దక్షిణాది రాష్ట్రం తమిళనాడు పేరును తమిళనాయుడు అని పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం అధికారికంగా విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్లో ఇలా తమిళనాయుడు అని రెండు సార్లు పేర్కొనడం వివాదాన్ని రేపింది. సీనియర్ బీజేపీ నేత వెంకయ్య నాయుడు సారధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో ఈ పొరపాటు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) ప్రాజెక్టు కింద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి 3,249 కోట్ల రూపాయల సిఫారసు చేస్తూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జారీ చేసిన నోట్ ఇది. దీంతో తమిళనాడు కాస్తా తమిళనాయుడు ఎప్పుడయ్యిందబ్బా అని జనాలు తలలు పట్టుకుంటున్నారట. -
యువభేరికి పోలీసులు అడ్డంకులు
-
బాక్సైట్‌పై ఐక్యపోరాటానికి మావోయిస్టుల పిలుపు
జి.మాడుగుల: మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసేవరకు ఆదివాసీలంతా ఐక్యంగా పోరాటాలు చేయాలని సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శి మంగ్లన్న బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విశాఖ ఏజెన్సీలో లక్షలాది మంది నేటికీ అడవే సర్వస్వంగా బతుకుతున్నారని, తరతరాల నుంచి అటవీ, ఖనిజ, జల సంపదలను అనేక పోరాటాలతో కాపాడుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు పుండుపై కారంలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాక్సైట్ చిచ్చుపెట్టి ఏజెన్సీలో మళ్లీ అశాంతి సృష్టించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు, కంపెనీల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం, నదులు, అడవులన్నీ కొల్లగొట్టడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని, అక్రమ కేసులు బనాయించి జైళ్లల్లో తోస్తున్నారని, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని దుయ్యబట్టారు.