సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ‘స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా’ కార్యక్రమంలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ జాతీయ ప్రోగ్రామింగ్ సదస్సుకు సీవీఆర్ కళాశాల మరోసారి ఆథిత్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ సీవీ రాఘవ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మార్చి 30న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏ.ఐ.సీ.టీ.ఈ) చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్దే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీవీఆర్ కళాశాల సేవలను గుర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, కేంద్ర మానవ వనరుల శాఖలు ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ నిర్వహణకు రెండోసారి అవకాశం కల్పించాయని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా 28 నోడల్ సెంటర్లలో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో పాల్గొంటున్న 40 విద్యార్థి బృందాలకు సదుపాయాలు కల్పిస్తామని సీవీ రాఘవ వెల్లడించారు. గత ప్రోగ్రామింగ్ సదస్సులో దివ్యాంగ సంక్షేమ శాఖకు సాఫ్ట్‌వేర్, దివ్యాంగులకు అసరమైన పరికరాలను రూపొందించమన్నారు. ఈ ఏడాది కేంద్రీయ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అవసరమైన నమూనా పరిష్కారాలను హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను అందించనున్నామని తెలిపారు. పోటీలో ప్రతిభ కనబర్చిన వారికి 31వ తేదీ సాయంత్రం బహుమతులు అందజేస్తామని ఆయన అన్నారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో, మూడో బహుమతిగా 75 వేలు, 50 వేల రూపాలయలు అందిస్తామని అన్నారు. సీవీఆర్ కళాశాల గతేడాది మాదిరిగానే రెండు జట్లకు రూ.25,000 ప్రోత్సాహక బహుమతులు అందిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment