smart India Hackthan
-
అవరోధాలు తొలగిస్తూ సంస్కరణలు
న్యూఢిల్లీ: భారత యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు యువత సరైన పరిష్కారాలు చూపుతూ సాగే ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(ఎస్ఐహెచ్)’ కార్యక్రమం అంతిమ పోరు సందర్భంగా ప్రధాని మోదీ తుది పోటీదారులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే బాధ్యత తమపై ఉందని నేటి యువత బాధ్యతాయుతంగా ఆలోచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలు సాధించగల, సాంకేతికత సత్తా ఉన్న యువత భారత్ సొంతం. శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. సంస్కరణలు తెస్తూ భారత యువత అభివృద్ధి పథంలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం తొలగిస్తోంది’’ అని మోదీ అన్నారు. ఏడో దఫా ఎస్ఐహెచ్లో దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల్లో 1,300కుపైగా విద్యార్థి బృందాలు ఫైనల్లో పోటీపడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎడిషన్ పోటీ 36 గంటల్లో ముగుస్తుండగా హార్డ్‌వేర్ ఎడిషన్‌లో పోటీ 15వ తేదీదాకా కొనసాగనుంది. హ్యాకథాన్‌లో భాగంగా జాతీయ ప్రాధాన్యత గల 17 అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమలు ఇచ్చి సమస్యలకు అత్యంత ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపుతూ విద్యార్థి బృందాలు తమ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. పలు రంగాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది. -
ప్రారంభమైన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఫైనల్ పోటీలు
సాక్షి, వరంగ్ అర్బన్: జిల్లాలోని కాజీపేలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నీట్)లో ప్రారంభమైన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫైనల్ పోటీలు. ఈ పోటీలను శనివారం ఉదయం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలు 48 కేంద్రాల్లో 36 గంటల పాటు జరుగనున్నాయి. ఈ పోటీల్లో సుమారు పదివేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ సంస్థలు, పరిశ్రమల నుంచి వచ్చే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఆవిష్కరణలు చేయనున్న విద్యార్థులు. స్మార్ట్ కమ్యూనికేషన్, వ్యవసాయం, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై సాగనున్న పోటీలు. -
ఈ నెల 30 నుంచి‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ‘స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా’ కార్యక్రమంలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ జాతీయ ప్రోగ్రామింగ్ సదస్సుకు సీవీఆర్ కళాశాల మరోసారి ఆథిత్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ సీవీ రాఘవ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మార్చి 30న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏ.ఐ.సీ.టీ.ఈ) చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్దే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీవీఆర్ కళాశాల సేవలను గుర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, కేంద్ర మానవ వనరుల శాఖలు ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018’ నిర్వహణకు రెండోసారి అవకాశం కల్పించాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 28 నోడల్ సెంటర్లలో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో పాల్గొంటున్న 40 విద్యార్థి బృందాలకు సదుపాయాలు కల్పిస్తామని సీవీ రాఘవ వెల్లడించారు. గత ప్రోగ్రామింగ్ సదస్సులో దివ్యాంగ సంక్షేమ శాఖకు సాఫ్ట్వేర్, దివ్యాంగులకు అసరమైన పరికరాలను రూపొందించమన్నారు. ఈ ఏడాది కేంద్రీయ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అవసరమైన నమూనా పరిష్కారాలను హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను అందించనున్నామని తెలిపారు. పోటీలో ప్రతిభ కనబర్చిన వారికి 31వ తేదీ సాయంత్రం బహుమతులు అందజేస్తామని ఆయన అన్నారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో, మూడో బహుమతిగా 75 వేలు, 50 వేల రూపాలయలు అందిస్తామని అన్నారు. సీవీఆర్ కళాశాల గతేడాది మాదిరిగానే రెండు జట్లకు రూ.25,000 ప్రోత్సాహక బహుమతులు అందిస్తుందని పేర్కొన్నారు. -
సీవీఆర్‌లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
హైదరాబాద్: కేంద్ర మానవ వనరుల శాఖ, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్ 2017 జాతీయ స్థాయి ప్రోగ్రామింగ్ సదస్సుకు నగరంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వేదిక కానుంది. కేంద్రం స్టార్ట్ అప్ ఇండియా- స్టాండ్ అప్ ఇండియా అనే నినాదంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఈ సామూహిక సదస్సును ఏప్రిల్ 1,2 వ తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీనికి దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, కళాశాల సౌకర్యాల ఆధారంగా నోడల్ సెంటర్లును ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపికయింది. ఈ సదస్సులో ఒక్కో సెంటర్ నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలకు తలెత్తిన సమస్యలను విద్యార్థులు తమ సాంకేతిక పరిజా్ఞనంతో పరిష్కారాన్ని అందించనున్నారు. జాతీయ దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించే సెంటర్‌గా సీవీఆర్ ఎంపికయింది. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని ప్రోగ్రామింగ్ రూపొందించనున్నారు. ఈ సాఫ్ట్వేర్ దివ్యాంగులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు మంజూరు చేసే ఉపకార వేతనాలు అర్హులకు అందే విధంగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 2 సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమం కోనసాగుతుంది. కార్యక్రమ అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందజేశాస్తారు. దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసే సదస్సుకు తమ సంస్థ వేదిక కావడం సంతోషంగా ఉందని సీవీఆర్ యాజమాన్యం తెలిపింది.