
సాక్షి, హైదరాబాద్ : గ్రామగ్రామాన చంద్రన్న చౌకదుకాణాల పేరిట ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్దమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించింది. గ్రామాల్లోని చిన్న వ్యాపారుల లాభాన్ని హెరిటేజ్‌కు మళ్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మరో కుట్రకు తెరలేపాడని ఆరోపించింది. ఇప్పటికే జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో దోచుకుంటున్న బాబు వర్గం.. ఈస్ట్‌ఇండియా కంపెనీ మాదిరి విడతల వారిగా ఈ విలేజ్ మాల్స్‌తో చిన్నవ్యాపారుల పొట్టగొట్టేందుకు సిద్దమైందని పేర్కొంది.
తాను చేసిన పనులకు భవిష్యత్తులో తన పేరు ఎవరు గుర్తుంచుకోరనే భావనతో సీఎం చంద్రబాబు అన్ని సంక్షేమ పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నారని ఎద్దేవ చేసింది. చివరకు తన కొడుకు లోకేశ్ కూడా గుర్తుపెట్టుకోడనే బాబు ఇలా ప్రవర్తిస్తున్నాడని పేర్కొంది. ఈ విలేజ్ మాల్స్ వెనుక చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వార్థం, వ్యాపార వ్యూహాలు, రాజకీయ కుట్రలు దాగున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని స్పష్టం చేసింది. గ్రామల్లోని చిన్న దుకాణాలు, బడ్డీకొట్టుల నిర్వహాకులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొంది.