సాక్షి, గుంటూరు: ఏపీలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ రావడం శుభపరిణామమని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడించారు. 'వైఎస్సార్ ఏపీ వన్' పేరుతో మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడంపై సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుమతుల వేగవంతానికి వైఎస్‌ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ పారిశ్రామిక విధానంలో మెగా ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా రాయితీలు కల్పించడం.. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందన్నారు. (చదవండి: త్వరలో ఐటీ పాలసీ విడుదల)
ఈ పాలసీ 2020-2023 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు లక్ష్మణరెడ్డి తెలియజేశారు.దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ఈ కొత్త విధానం తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం ఉన్న యువతను ఈ పరిశ్రమలకు అందించటమే లక్ష్యంగా నూతన విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ప్రస్తుత పారిశ్రామిక విధానం ఈ ఏడాది మార్చితో గడువు పూర్తవుతుందని.. అమలు సాధ్యం కాని అంశాలను గత ప్రభుత్వం అందులో చొప్పించడం బాధాకరమని ఆయన అన్నారు. (చదవండి: సమగ్ర అభివృద్ధికి ‘వైఎస్సార్ ఏపీ వన్’: గౌతమ్‌రెడ్డి)
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించిందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ఈ పాలసీ లక్ష్యమన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. పారిశ్రామిక రంగంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని.. మహిళల్ని ప్రోత్సహించేలా కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చారని తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువతను అందించడంతో పాటు, కొత్త పాలసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని లక్ష్మణరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment