సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరిగి చక్కబడిన నేపథ్యంలో, రాష్ట్రంలోని రైతుల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కరోనా, కేంద్రం వైఖరితోనే ఆలస్యం
‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. అయితే కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం రాష్ట్రం పట్ల అనుసరించిన కక్షపూరిత వైఖరి తదితర కారణాల వల్ల ఏర్పడిన ఆర్థిక లోటుతో.. రుణ మాఫీ ఇన్నాళ్లూ కొంత ఆలస్యమైంది.
కానీ రైతులకు అందించాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే వస్తోంది. మేం ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం.
రైతు సాధికారత సాధించే వరకు, రైతులను ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు..’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని తెలిపారు.
బకాయిలు చెల్లించినా మాఫీ వర్తింపు!
లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఇప్పటివరకు రూ.36 వేల వరకు బకాయిలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పుడు మిగిలిన వారికీ మాఫీ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద తీసుకున్నాయి. మరోవైపు కొత్త రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించినట్టైతే తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు కొందరు రైతులు సొంతగా బ్యాంకులకు చెల్లింపులు చేశారు. కొందరు మాత్రం చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. కాగా కొత్త రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు రుణం చెల్లించిన రైతులకు సైతం ఇప్పుడు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ప్రభుత్వం ప్రకటించిన రైతుల జాబితా ప్రకారమే సొమ్మును వారివారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉందని అధికారులు అంటున్నారు.రూ.19 వేల కోట్ల చెల్లింపుతో రూపాయి కూడా మిగలకుండా తెలంగాణలో సంపూర్ణ ‘రైతు రుణమాఫీ’కార్యక్రమం పూర్తి కానుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 42 లక్షల ఖాతాలకు సంబంధించి రుణమాఫీ జరగనుంది. తద్వారా 29.61 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
రైతుబంధు తరహాలో విడతల వారీగా..
► రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలా పదిహేను రోజుల్లో, సెపె్టంబర్ రెండో వారం వరకు రైతు రుణమాఫీ కార్యక్రమం మొత్తం పూర్తి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచే పునఃప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆగస్టు 3వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్, హెచ్‌ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరి్వంద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment