సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం పునఃప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ప్రకారం ఆర్థికశాఖ పూర్తి రుణమాఫీ కోసం రూ. 18,241 కోట్ల విడుదలకు గురువారం ఉత్తర్వులు (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) జారీ చేసింది. మొదటి విడతలో భాగంగా రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మధ్యన ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు రూ. 237.85 కోట్లు విడుదల చేసింది. దీంతో 62,758 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు సంక్షేమం కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారన్నారు. రైతు రుణమాఫీకి ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
రైతు బీమా దరఖాస్తులు అప్‌లోడ్ చేయండి...
రైతు బీమా పథకానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే కొత్త దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం సచివాలయంలో అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
రైతులు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులను వాడేలా మరింత ప్రోత్సహించాలన్నారు. నేల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దిశగా రైతాంగాన్ని చైతన్యపరచాలన్నారు. పంటల సాగు వివరాలు వెంటనే తెలియజేయాలన్నారు.
83 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు..
రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 83 లక్షల ఎకరాలలో వ్యవసాయ పంటలు, 7.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగయ్యాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇటీవలి వర్షాలతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.
వరి, కంది, పంటలు ఈ నెలాఖరు వరకు, మిరప సెపె్టంబరు మొదటి వారం వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈ సీజన్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయిల్‌పామ్ సాగును అధికారులు ప్రోత్సహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment