సాక్షి, హైదరాబాద్: రైతులపై కపట ప్రేమ చూపడం మానుకోవాలని సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యం బకాయిలు ఇంకా రూ.600 కోట్లు చెల్లించాలని బహిరంగ లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని లేఖలో ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఎడ్చినా రాజ్యం ఎప్పటికీ బాగుపడదు.. కాబట్టి ఇక నైనా రైతులు కన్నీరు పెట్టుకునే చర్యలను మానుకోవాలని సూచించారు.
వానకాలం పంట పనులు ప్రారంభమై రైతులు నాట్లు వేసుకుంటున్న ఇంకా వరి ధాన్యం కొనుగోలు బకాయి బిల్లులు చెల్లించడం లేదన్నారు. దీని వల్ల దాదాపు లక్ష మంది వరకు రైతున్నలు డబ్బులు రాక ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఇకనైనా కళ్లు తెరిచి రైతులకు రావాల్సిన డబ్బులను మంజూరు చేయాలన్నారు.
కేసీఆర్ కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఆగమేఘాల మీద నిధులు విడుదల చేసి.. రైతుల విషయంలో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసలు మీకు రైతులంటే ఎందుకు అంతా చిన్నచూపు.. దేశానికి పట్టెడన్నం పెడుతున్నందుకా..? లేదా మీరు ఎం చేసిన రైతన్న ఎదురు తిరగడు కాబట్టా...? అని ప్రశ్నించారు. వెంటనేరైతులకు బకాయిపడ్డ రూ. 600 కోట్లు నిధులు విడుదల చేయాలని లేదంటే రైతన్నలను వెంటబెట్టుకుని ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ పార్టీ తరపున ముట్టడి చేస్తామని ఆల్టిమేటం జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment