సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది.
పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు..
ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్‌ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్‌గోయల్ పేర్కొన్నారు.
రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ
దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్‌చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్‌కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు.
రైతుకు మరింత దన్ను
Published Thu, Jun 8 2023 3:57 AM | Last Updated on Thu, Jun 8 2023 3:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment