కొత్తగూడెం : కొత్తగూడెంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఈ ప్రాంతవాసుల్లో నూతన ఆశలు రేకెత్తుతున్నాయి. ఒకప్పు డు సింగరేణి గనులతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతం లో ఇటీవలి కాలంలో సింగరేణిలో ప్రైవేటీకరణ, పరిశ్రమలు దివాళా తీయడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాను విభజిస్తే భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగడంతో ఇక్కడి ప్రజల్లో కొంత నైరాశ్యం చోటు చేసుకుంది. అయితే భద్రాచలం డివిజన్‌లోని ముంపు మండలాలు సీమాంధ్రలోకి వెళ్లడం, జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు ఏజెన్సీ నిబంధనలు అడ్డుగా ఉండటంతో కొత్తగూడెంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే యోచనతో సీఎం కేసీఆర్ కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
చిగురిస్తున్న ఆశలు..
సింగరేణి బొగ్గు గనుల ఆధారంగా కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి చెందింది. గతంలో కేవలం భూగర్భ గనులు మాత్రమే ఉండటంతో ఇక్కడ సుమారు 30 వేల మంది కార్మికులు పనిచేసేవారు. అనంతరం ఓపెన్‌కాస్టుల ఏర్పాటుతో యంత్రాల వాడకంతో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి తోడు ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన స్పాంజ్ ఐరన్ సైతం నష్టాలు చవి చూసి దివాళా తీసే పరిస్థితి రావడంతో పారిశ్రామిక ప్రగతి పడిపోయింది.
ఈ నేపథ్యం లో ఒకప్పుడు ఖమ్మం కంటే వేగంగా అభివృద్ధిలో దూసుకెళ్లిన కొత్తగూడెం ప్రాంత పరిస్థితి ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కాగా, సీఎం ప్రకటనతో కొత్తగూడెం నియోజకవర్గంలో మైదాన ప్రాంతంగా ఉన్న సుజాతనగర్, నర్సింహసాగర్, పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో రియల్ భూమ్ విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐదు నియోజకవర్గాలపై ప్రధాన చర్చ..
ఐదు నియోజకవర్గాలను కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటంతో ఏయే నియోజకవర్గాలను కలిపి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తారనే చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతం ఐదు నియోజకవర్గాలో ఉంది.
కొత్తగూడెంతోపాటు అశ్వారావుపేట, వైరా, ఇల్లెందు, పినపాక, భద్రాచం నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలలోని కొన్ని ప్రాంతాలు సీమాంధ్రకు వెళ్లడంతో కొత్తగా ఏజెన్సీ ప్రాంతాలను కలిపి ఐదు నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక, కొత్తగా పాల్వంచ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం పట్టణానికి పారిశ్రామిక వెలుగులు తిరిగి అందాలన్నా.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా జిల్లా కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
‘కొత్త’ ఆశలు
Published Sun, Sep 7 2014 1:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement