సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని ఓ వైపు చెప్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలానికి పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేసి పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించాలని కేంద్రం చూస్తోందని, సింగరేణి ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించేలా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో సింగరేణి ఏరియాలో ఆ పార్టీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఢిల్లీ బీజేపీ నేతల హస్తం ఉందని, అందులో తెలంగాణ బీజేపీ నాయకులు కేవలం పాత్రధారులేనని అన్నారు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విజయోత్సవ ర్యాలీలా?
ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ విజయోత్సవ ర్యాలీలు ఎందుకు తీస్తుందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఎస్సెస్సీ హిందీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దోషి కాదని, ఆయన తప్పు చేసినందునే పోలీసులకు తన ఫోన్ ఇవ్వడం లేదన్నారు.
ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీని బ్రోకర్, జుమ్లా, పేపర్ లీక్ పార్టీగా ఆయన అభివర్ణించారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న సంజయ్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment