సింగరేణిపై రాజకీయ నీడ!
చైర్మన్ పదవిని ప్రజా ప్రతినిధికి అప్పగించే యోచన
రాజకీయ నేతకు అవకాశమివ్వాలనే ప్రతిపాదన
పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఓ ఎమ్మెల్సీ
సీనియర్ ఐఏఎస్ అధికారికి ఎండీ పోస్టు
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న సింగరేణి సంస్థ చైర్మన్‌గా ప్రజా ప్రతినిధినిగాని, ఎవరైనా ప్రముఖ రాజకీయ నేతనుగాని నియమించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సింగరేణి కార్మిక సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ చట్టసభ ప్రతినిధి ఈ మేరకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 125 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీకి ఇప్పటివరకూ సీనియర్ ఐఏఎస్ అధికారులే చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా వ్యవహరిస్తున్నారు. కానీ తాజాగా ఆర్టీసీ తరహాలో చైర్మన్ పదవిని ప్రజా ప్రతినిధికి లేదా రాజకీయ నేపథ్యం కలిగిన వారికి ఇచ్చి, సీనియర్ ఐఏఎస్ అధికారిని మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించాలనే ప్రతిపాదనపై పరిశీలన జరుగుతోంది. ఇదే జరిగితే సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. సింగరేణి ఏటా రూ. 11,870 కోట్ల టర్నోవర్‌తో దేశంలో కోల్‌ఇండియా తర్వాత రెండో పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు 70 వేల మంది కార్మికుల మనుగడ దీనిపైనే ఆధారపడి ఉంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారిని సింగరేణి సీఎండీగా నియమిస్తూ వస్తోంది. తమ వాటా కూడా కలిగి ఉండటంతో కేంద్రం ఇద్దరు డెరైక్టర్లను నియమిస్తుంది. సీఎండీగా ఎవరిని నియమించాలన్న విషయంలో మెజారిటీ వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వానిదే తుది అధికారం. అయితే లాంఛనంగా కేంద్రం అనుమతి తీసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ తరహాలో సింగరేణి సారథ్య బాధ్యతలను రెండుగా విడగొట్టాలనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. సింగరేణి కార్మిక సంఘంలో పట్టున్న ఒక నేత ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతస్థాయిలో పావులు కదుపుతున్నారు. ‘ఈ కొత్త ప్రతిపాదన చట్టానికి లోబడి ఉన్నదే. కానీ గతంలో ఎప్పుడూ రాజకీయ నేపథ్యం ఉన్నవారికి కట్టబెట్టలేదు. ఇప్పుడు కూడా పరిశీలన దశలోనే ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం..’ అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
దీనిపైనే చర్చ..
ప్రస్తుతం సింగరేణి ఉద్యోగ, కార్మిక సంఘాలన్నింటా చర్చనీయాంశంగా మారింది. సింగరేణి సీఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి సుతీర్థ భట్టాచార్య.. గత నెలలో కోల్ ఇండియా సీఎండీగా ఎంపికయ్యారు. ప్రభుత్వరంగ సంస్థల సెలెక్షన్ బోర్డు ఆయన నియామకాన్ని ప్రకటించినప్పటికీ కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. రేపోమాపో ఆ పదవి ఖాళీకానున్న నేపథ్యంలో... దానిని దక్కించుకునేందుకు సింగరేణితో అనుబంధం ఉన్న సదరు ప్రముఖ నేత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. సింగరేణిలో ఒక కార్మిక సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. దీంతో సింగరేణిలో ప్రధాన గుర్తింపు సంఘం సైతం తనకు మద్దతుగా ఉంటుందనే ధీమాతో ఆయన పావులు కదుపుతున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ఉన్నత స్థాయిలో పరిచయాలు ఉండటంతో వ్యూహాత్మకంగానే ఆయన చైర్మన్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. చట్టంలో ఈ మేరకు ఉన్న అవకాశాలపైనా ఆయన చర్చించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదం నామమాత్రమే..’ అని సింగరేణి సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
భవిష్యత్ ఏమిటి?
రాష్ట్రంలో లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన సింగరేణిని రాజకీయ నేతల గుప్పిట్లో పెడితే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే వాదనలు లేకపోలేదు. ఇంతకుముందే సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు.. సంస్థలో ఒక డెరైక్టర్ పదవిని కార్మిక సంఘ ప్రతినిధులకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. తర్వాత గుర్తింపులోకి వచ్చిన ఐఎన్‌టీయూసీ హయాంలోనూ ఈ ప్రతిపాదనపై కసరత్తు జరిగింది. పలు సాంకేతిక కారణాలతో ప్రభుత్వం దీనిని తోసిపుచ్చింది.