కొవ్వూరు:ఇసుక ర్యాంపుల్లో రాజకీయ జోక్యం పెరగడంతో మహిళా సంఘాలు నామమాత్రంగా తయారయ్యాయి. పేరుకి ర్యాంపులను మహిళా సంఘాలు నిర్వహిస్తున్నా పెత్తనం మాత్రం అధికార పార్టీ నాయకులదే. ఇసుక రవాణాలో దళారుల ప్రమేయం పెచ్చు మీరుతోంది. సీసీ కెమెరాలు పెట్టినా అక్రమాలకు అడ్డూ అదుపు ఉండడం లేదు. నాయకులు సిఫార్సు చేసిన వాహనాలలో ముందుగా ఇసుక లోడింగ్ చేయడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ముందుగానే మీ-సేవ కేంద్రాల్లో డీడీలు తీసుకుని తమ వాహనాలు సీరియల్‌లో ఉంచుకుంటుండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి లారీ నుంచి అదనంగా రూ.2,500 నుంచి రూ.3 వేలు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి.
కొందరు ప్రజా ప్రతినిధులు ఈ అక్రమ దందాలో భాగస్వాములు అవుతుండడంతో పోలీస్, రవాణా, రెవెన్యూ, డీఆర్‌డీఏ అధికారులు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండు యూనిట్ల ఇసుక ధర మీ-సేవ కేంద్రంలో రూ.3,900 ఉండగా దళారులు రంగ ప్రవేశంతో వినియోగదారులు అదనంగా చేతి చమురు వదిలిం చుకోవాల్సి వస్తోంది. రోజుల తరబడి ర్యాంపుల చుట్టూ తిరగలేక కొందరు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు యూనిట్‌లకు అదనంగా మరో రూ. 2వేల నుంచి 3వేలు వరకు చెల్లిం చుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి రవాణా చార్జీలు అదనం. దళారులకు రాజకీయ అండదండలుండడంతో అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.పెచ్చు మీరుతున్న రాజకీయ జోక్యం నిడదవోలు నియోజవర్గంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుచరులే ర్యాంపుల్లో చక్రం తిప్పుతున్నారు.
కొవ్వూరు మండలం ఔరంగబాద్, వాడపల్లిల్లోను అదే పరిస్థితి ఉంది. తాళ్లపూడి మండలంలో ఇసుక ర్యాంపుల వ్యవహారంలో నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. ఔరంగబాద్‌లో ఇసుక లోడింగ్ విషయంలో ర్యాంపు నిర్వాహక మహిళా సంఘం కొందరు నాయకుల సూచనల మేరకు పనిచేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మహిళలు ఇసుక రవాణా నిలిపివేశారు. అధికార పార్టీ జెండాలు కట్టుకుని మరీ ర్యాంపు వద్ద మంగళవారం సాయంత్రం ధర్నా నిర్వహించడం, మహిళా సంఘం అధ్యక్షురాలిని మార్చాలని పట్టుబట్టడం ఆ పార్టీలో దూమారం రేపుతోంది. ఎక్కడైతే ఇసుకు గుట్టలు ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి ఎగుమతి చేస్తే ఎక్కువ లారీల ద్వారా రవాణా చేయవచ్చని పడవల నిర్వాహకులు వాదిస్తున్నారు. మహిళా సంఘాలు మాత్రం తాము నిర్ధేశించిన సీరియల్ ప్రకారమే రవాణా చేయాలని కోరుతున్నారు.
పట్టిసీమకు ప్రక్కిలంక ర్యాంపు కేటాయింపు
ప్రక్కిలంక ఇసుక ర్యాంపులో ఇసుకను పూర్తిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులకు కేటాయించారు. దీంతో పరిసర ప్రాంతాలకు చెందినవారు ఇసుక కోసం ఇబ్బంది పడుతున్నారు.
ర్యాంపులో రాజకీయ ప్రమేయం
విశాఖపట్నం నుంచి మూడు రోజుల క్రితం వచ్చాం. ఇక్కడ ర్యాంపు నిర్వాహక మహిళలు రోజున్నర పాటు ఇసుక లోడింగ్ నిలిపివేయడం మూలంగా ఇబ్బంది పడుతున్నాం. ఔరంగబాద్‌లో ర్యాంపులో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా కనిపిస్తోంది.
-కడలి వినాయకరావు, విశాఖపట్నం, లారీ డ్రైవర్
ర్యాంపుల్లో రాజకీయ కంపు
Published Fri, Aug 7 2015 12:41 AM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM
Advertisement