దసరా హు‘సార్‌’ | Illegal Sand Mining Under Police Officers In Karimnagar | Sakshi
Sakshi News home page

దసరా హు‘సార్‌’

Published Sat, Oct 5 2019 8:27 AM | Last Updated on Sat, Oct 5 2019 8:27 AM

Illegal Sand Mining Under Police Officers In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ‘రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు ఇటీవల అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నాడు. స్టేషన్‌కు తరలించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు. అయితే ఆ ఇసుక రవాణా చేస్తున్న ఓ అధికార పార్టీ నాయకుడు, ట్రాక్టర్ల సంఘం నాయకుడొకరు ‘పై స్థాయి’ నుంచి ఒత్తిడి తెచ్చారు. వెంటనే సదరు సీఐకి ఫోన్‌ వచ్చింది. ట్రాక్టర్లను వదిలేయమని. ‘ కేసు నమోదయింది. ఫైన్‌ కట్టాలి సార్‌’ అని చెప్పినా అవతలి ‘సార్‌’ వినకపోవడంతో... సదరు సీఐ జేబు నుంచి ‘ఫైన్‌ ’ కట్టి ట్రాక్టర్లను పంపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పోలీసుల అండతో యథేచ్ఛగా సాగుతోందనడానికి పై ఉదాహరణ ఒక్కటి చాలు. సిరిసిల్లలో మానేరు నది జలాలు పారే మండలాల్లో ఇసుక దందా మూడు ట్రాక్టర్లు, ఆరు ట్రిప్పుల చందాన నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లకు సమీపంలో మానేరు వాగు ప్రవహించే మండలంలోని ఓ ఎస్సై ఇసుక రవాణా సాగించే ట్రాక్టర్లు, టిప్పర్ల యజమానుల నుంచి దసరా మామూళ్లు వసూలు చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఇసుక అక్రమ రవాణా చేసే ప్రతి ట్రాక్టర్, టిప్పర్‌ యజమాని డబ్బులు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. ‘ ఇదేంటంటే ‘మీరు అక్రమ దందా చేసుకోవాలంటే ‘సార్‌’కు గిఫ్ట్‌ ఇవ్వాల్సిందే’ అని ఆర్డర్‌ ఇచ్చేశాడు. మరో మూడు రోజుల్లో దసరా పండుగ ఉన్న క్రమంలో ఇప్పటికే అనుకున్న లక్ష్యం మేరకు వసూళ్లు పూర్తయినట్లు సమాచారం.

ట్రాక్టర్‌ రూ.8 వేలు.. టిప్పర్‌కు రూ.40 వేలు
మానేరు వాగులో ఇసుక నాణ్యత బాగుంటుందని సిరిసిల్ల నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి అం దరూ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల మానేరు వాగులోని ఇసుకను తీయడానికి వీలులేకుండా మిడ్‌మానేరు నీరు చేరడంతో ఇసుక దొరకడమే కష్టంగా మారింది. దీనిని ఆసరగా చేసుకుని అక్రమ ఇసుక రవాణాదారులను అడ్డుకోవలసిన అధికారులు ఆమ్యామ్యాలకు తెరతీశారు. దీనిలో భాగంగా దసరా బొనాంజ ఆఫర్‌గా ట్రాక్టర్‌కు రూ.8వేలు, టిప్పర్లకు వాటి టైర్ల సంఖ్యను బట్టి కనిష్టంగా రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ. 40 వేల వరకు వసూళ్లకు తెరలేపారు. మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాలో 125 ట్రాక్టర్లు, 10 టిప్పర్లు భాగం పంచుకుంటాయి. ఎస్సై ఇచ్చిన టార్గెట్లను దాదాపు 100 ట్రాక్టర్ల యజమానులు ఆమోదించి, ఇప్పటికే రూ. 8వేల చొప్పున చెల్లింపులు జరిపినట్లు సమాచారం. టిప్పర్ల యజమానుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం సాగుతోందని తెలిసింది.

మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు.
మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో ట్రాక్టర్లను, టిప్పర్లను పట్టుకుంటే రాజకీయ ఒత్తిళ్లతో దొంగలు దొరల్లా బయటపడుతున్నారని పలువురు పోలీస్‌ అధికారులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు అధికమైనట్లు పోలీసుల్లోనే చర్చ జరుగుతోంది. దీనితో ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చేది మైనింగ్, రెవెన్యూ అధికారులు. నిబంధనల ప్రకారం ఎన్ని టన్నుల ఇసుక తరలిపోతుందనే పర్యవేక్షణ చేయాల్సింది ఆర్టీఏ అధికారులు. కేసులు నమోదు చేయడం వరకే తమ విధి కాగా... కొందరి వల్ల తాము బద్నాం అవుతున్నట్లు పలువురు పోలీసు అధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పట్టుకున్న వాళ్లే పైకం చెల్లించారటా..?
ఇసుక అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకున్న అధికారులే పెనాల్టీలు చెల్లించే దుస్థితి జిల్లాలో కొనసాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.క్షేత్రస్థాయిలో వాహనాలు పట్టుబడగానే రాజకీయ నాయకులు పోలీస్‌ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి కేసులు చేయకుండా ఒత్తిడి తీసుకువస్తున్నారని వాపోతున్నారు. ఇలా జిల్లాలోని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు తమ జేబు నుంచి జరిమానాలు చెల్లించి ‘సార్‌’ చెప్పారనే కారణంతో వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సీఐ స్థాయి అధికారులు జిల్లాలో పనిచేయలేమని బదిలీపై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement