కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : గెలిచి వారం రోజులు కాలేదు... అప్పుడే టీఆర్‌ఎస్‌లో వర్గపోరు మొదలైంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎంపిక వ్యవహారంలో జిల్లా నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. గతంలో లేనివిధంగా జిల్లా పరిషత్‌లో పూర్తిస్థాయి మెజార్టీతో టీఆర్‌ఎస్ పాగావేసింది. 57 జెడ్పీటీసీ స్థానాలకు.. 41 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఆ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమైనా.. ఆ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఇంకా వీడడంలేదు. రేసులో టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కథలాపూర్ జెడ్పీటీసీ తుల ఉమతోపాటు మరికొందరు ఉన్నారు.
తుల ఉమ కథలాపూర్ నుంచి విజయం సాధించడం, 41 సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకోవడంతో ఆమే చైర్‌పర్సన్ అభ్యర్థి అవుతారని ప్రచారం జరిగింది. కొద్దిరోజుల క్రితం ఉమ పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించడానికి సిద్ధపడ్డట్లు తెలిసింది.
అయితే జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతోనే అధికారిక ప్రకటన ఆగిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రస్థాయి నేత కావడం, అధిష్టానానికి సన్నిహితంగా ఉండడంతో ఉమ జెడ్పీ చైర్‌పర్సన్ అయితే మరో అధికార కేంద్రం అవుతారనే ముందుచూపుతోనే సదరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉమ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు, ఇప్పటికే రేసులో ఉన్న మరికొందరికి తమ మద్దతు ప్రకటించి వారి ప్రయత్నాలకు ఊతం కల్పిస్తున్నారు. దీంతో జెడ్పీ చైర్‌పర్సన్ ఎంపికలో జిల్లా నేతల మధ్య అంతర్గతపోరు మొదలైంది. పార్టీలో వివాదరహితురాలుగా ఉన్న ఉమ అభ్యర్థిత్వంపైనే ఇలాంటి సమస్య తలెత్తడంపై పార్టీ జిల్లా సీనియర్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఉమ గెలిస్తే చైర్‌పర్సన్ అవుతారనే భయంతో జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనే పార్టీలోని కొందరు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు పాచిక పారకపోవడంతో కనీసం చైర్‌పర్సన్ కాకుండా అయినా ఆపుదామనే ధోరణిలో ఆ నేతలున్నట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్యే రేసులో ఉన్న తుల ఉమను కేసీఆర్ స్వయంగా పిలిచి జెడ్పీకి పంపించినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
చైర్‌పర్సన్ చేస్తామనే హామీతోనే ఆమెను బరిలోకి దింపారని, ప్రస్తుతం పార్టీకి పూర్తి మెజారిటీ రావడంతో కేసీఆర్ తన మాట నిలబెట్టుకుంటారనే విశ్వాసంతో ఉమ వర్గీయులు ఉన్నారు. మొత్తానికి సాఫీగా సాగుతుందనుకున్న చైర్‌పర్సన్ ఎంపిక వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కేసీఆర్ స్వయంగా అధికారికంగా పేరును వెల్లడిస్తే తప్ప ఈ పోరుకు తెరపడే అవకాశం లేదు.
కిస్సా కుర్సీకా..
Published Thu, May 22 2014 2:59 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement