- 15 రోజుల్లో ఉద్యోగుల వివరాలు తెలపాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు
- రాజకీయ రంగు పులుముకుంటున్న మున్సిపల్ ఉద్యోగుల బదిలీలు
- కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు
తిరుపతి కార్పొరేషన్: కార్పొరేషన్, మున్సిపల్ ఉద్యోగుల బదిలీలకు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలుపుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉన్న ఫలంగా బదిలీలు చేసేందుకు డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
అందులో భాగంగానే సోమవారం జీవోఎంఎస్.నెం.186 ఫైనాన్స్ (డీసీఎం-2) డిపార్ట్.తేదీ 05.09.2014 ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఆర్‌వోసీ.నెం.11163/2014/కే1-2 తేదీ 06.09.2014 పేరిట సర్క్యులర్‌ను విడుదల చేశారు. అది కూడా బదిలీకానున్న ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 15వ తేదీలోగా పంపించాలంటూ సంబంధిత మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 30కి ఉన్న బదిలీల గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు. అదే నెల 11 నుంచి బదిలీలపై నిషేధం ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్‌లో పనిచేసే ప్రత్యేక డాక్టర్లు, లెక్చరర్లకు ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవ్వనున్నారు.
ఏ ఉద్యోగులు ఎక్కడికి..
ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, అకౌంటెంట్లు, రెవెన్యూ అధికారులు, ఎవరైతే 23 సంవత్సరాలు పూర్తిచేసుంటారో వారిని బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈవివరాలను పూర్తిస్థాయిలో తమకు అందించాలని డీఎంఏ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక్కడి మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు ఆ పనిలో తలమునకలై ఉన్నారు. విశ్వసనీయ స మాచారం మేరకు కార్పొరేషన్‌లో పనిచేసే రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లాలోనే బదిలీలు ఉంటాయి. సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు అనంతపురం రీజియన్ పరిధిలో బదిలీ చేస్తారు.
సూపరింటెండెంట్, అకౌంటెంట్, రెవెన్యూ అధికారులు, మేనేజర్లకు రాష్ట్ర స్థాయిలో బదిలీలు ఉంటాయి. వీరితో పాటు ఇంజినీర్లు, డీఈ స్థాయి అధికారులను ఈఎన్‌సీ విభాగం, ఏఈలను ఎస్‌ఈ అధికారులు బదిలీ చేయనున్నారు. అసిస్టెంట్ సిటీప్లానర్, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను డెరైక్టర్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ విభాగపు ఉన్నతాధికారులు బదిలీలు చేయనున్నారు. ఇందులో డెప్యూటేషన్‌పై వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించారు.
సర్వీసు రూల్స్ ఆమోదానికి ఓకే
సాధారణంగా కార్పొరేషన్లలో సర్వీసు రూల్స్‌కు ఆమోదం లేకపోవడం వల్ల ఇక్కడి ఉద్యోగులకు బదిలీలు ఉండవు. అయితే ప్రస్తుతం సర్వీసు రూల్స్‌ను ఒకటి రెండు రోజుల్లో ఆమోదించేందుకు ఫైల్ సిద్ధంగా ఉంది.
మాట వినని వారికి బెదిరింపులు
తమకు అనుకూలమైన ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అదే స్థానంలో కూర్చోబెట్టేందుకు ఒత్తిళ్లు తెస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ (అధికార)కి పనిచేయని, మాట వినని, తాము చెప్పినట్టు నడుచుకోని ఉద్యోగులను ఇక్కడి నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారు. పైగా పరోక్షంగా వేధింపులకు పాల్పడుతూ, విజిలెన్స్, ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగులే బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల కర్నూలు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఏసీపీ స్థాయి అధికారి వేధింపులు తాళలేక సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం. అదే బాటలో ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందిన ఓ అధికారితో పాటు పలువురు కీలకమైన ఉద్యోగులు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలు మున్సిపల్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.