ఇది ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి సమీపంలోని కొండ. రెవెన్యూ శాఖ పరిధిలోని
ఈ కొండలో సాగుకు ఏమాత్రమూ అనువుగా లేదు. అయినా.. సర్వే నంబర్ 653లోని 104.98 ఎకరాలు, 239లోని 178.45 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. దాదాపు 160 మందికి ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ పంటలు కూడా సాగుచేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. వాటి ఆధారంగా అక్రమార్కులు బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు.
ఆళ్లగడ్డ: రెవెన్యూ అధికారులు తలచుకుంటే ఏమైనా సాధ్యమే! ఎవరి భూమికి ఎవరి పేరుతోనైనా పట్టా ఇచ్చేయగలరు. కొండలు, గుట్టలు సైతం సాగులో ఉన్నట్లు చూపగలరు. వారు అడిగినంత ఇస్తే ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తారు. అక్కడ రకరకాల పంటలు సాగు చేస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. అడ్డదారుల్లో భూమి పొందిన వారు వీటిని బ్యాంకుల్లో పెట్టి ఎంచక్కా పంట రుణాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పొందవచ్చు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనైతే రెవెన్యూ లీలలకు అంతే లేకుండా పోతోంది.
కొండలకు పాసు పుస్తకాలు
ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ 653లో 104.98 ఎకరాలు, 239లో 178.45 ఎకరాలు, ఇవిగాక మర్రిపల్లి, ఆర్.కృష్ణాపురం, మిట్టపల్లి, రుద్రవరం మండలం ఆలమూరు, రుద్రవరం, లింగందిన్నె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, ఉయ్యాలవాడ మండలంలో మరో 900 ఎకరాల దాకా రెవెన్యూ కొండలు, తిప్పలు ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రమూ సాగుకు అనుకూలంగా లేదు. వీటికి కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. సర్వే నంబర్లను వెబ్‌ల్యాండ్‌లో 145 సబ్ డివిజన్లుగా విభజించి.. ఏకంగా 232 మందికి పాసు పుస్తకాలు జారీ చేశారు. వీటిలో డి.పట్టాలిచ్చింది మాత్రం 50 ఎకరాలకే. మిగతాదంతా అనధికారికంగా కట్టబెట్టారు. నాలుగేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. ఇప్పటికీ ఎవరు డబ్బు ఇస్తే వారికి అన్‌లైన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఇష్టానుసారంగా రికార్డులు
అనధికారికంగా కట్టబెట్టిన భూములు కావడంతో ఆన్‌లైన్ చేసిన అధికారులు కార్యాలయంలోని 1బీ రికార్డుల్లోనూ హడావిడిగా ఖాతాలు సృష్టించి ఎంట్రీ చేశారు. అనేక ఖాతాల్లో పాసుపుస్తకం యూనిక్ నంబర్, రైతు ఫొటో, తహసీల్దార్ సంతకం, భూమి రకం తదితర వివరాలేవీ నమోదు కాలేదు.
విస్తీర్ణం కంటే రెట్టింపు పంపిణీ
రెవెన్యూ అ«ధికారులు ఎకరాకు ఇంతని ధర నిర్ణయించి చెప్పడంతో బేరం కుదుర్చుకున్న నాయకులు ఒక్కొక్కరు 20 నుంచి 40 ఎకరాల దాకా పాసు పుస్తకాలు చేయించుకున్నారు. డబ్బు మోజులో పడి అక్కడున్న భూమి కంటే రెట్టింపు విస్తీర్ణానికి అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేశారు. ఆన్‌లైన్ చేసే సమయంలో విస్తీర్ణం సరిపోలకపోవడంతో ఒక్కొక్కరికి 20 నుంచి 50 శాతం వరకు తగ్గించి నమోదు చేశారు. దీంతో పాసు పుస్తకంలోని విస్తీర్ణం, ఆన్‌లైన్‌లోని విస్తీర్ణం మధ్య తేడా వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అక్రమార్కులు తగ్గించిన పొలానికి డబ్బులన్నా వెనక్కివ్వాలని, లేకుంటే ఒప్పుకున్న కాడికి ఆన్‌లైన్ చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
రూ.కోట్లలో రుణాలు!
అనధికారికంగా పాసు పుస్తకాలు పొందిన వారు వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నారు. నియోజకవర్గంలోని బ్యాంకుల్లో సుమారు రూ.10 కోట్ల వరకు ఇదే తరహాలో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులతో పాటు కొందరు బ్యాంకర్లు సైతం వీరికి సహకరించి.. అంచనాకు మించి రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలైన రైతులకు రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు చెబుతూ ముప్పుతిప్పలు పెట్టే బ్యాంకర్లు వీరి పట్ల మాత్రం ఉదారత చూపుతున్నారు.
ఒరిజినలా? నకిలీనా ?
2014 తర్వాత ప్రభుత్వం మ్యానువల్ పట్టాదారు పాసుపుస్తకాల ప్రక్రియ నిలిపేసింది. వీటి స్థానంలో ఈ –పాసుపుస్తకాలు అందిస్తోంది. అయితే.. వీరందరికీ మ్యానువల్ పాసుపుస్తకాలే జారీ చేశారు. దీంతో ఇవి ఒరిజినలా లేక నకిలీనో అధికారులే తేల్చాలి. ఇప్పటికీ ఆళ్లగడ్డ, రుద్రవరం , చాగలమర్రి మండలాల్లో చాగలమర్రి కేంద్రంగా నకిలీ పాసుపుస్తకాల దందా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment