ఆళ్లగడ్డ శిల్పకారులు పుట్టిన గడ్డ. ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియచేసిందో అమ్మాయి. ఆళ్లగడ్డ అమ్మాయి చేసిన ప్రయత్నం ఆ ఊరికి వన్నె తెచ్చింది. సినిమా రంగం నెత్తుటి చారికలు అద్దిన ఆళ్లగడ్డను ఈ అమ్మాయి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసింది. ఆళ్లగడ్డలో శిల్పకారుల కుటుంబాలు వందలాదిగా ఉన్నాయి.
ఈ సంగతి కర్నూలు జిల్లా వాళ్లకు తప్ప బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని రోజుల్లో భువనేశ్వరి చేసిన ఒక ప్రయత్నంతో ఈ రోజు ఆళ్లగడ్డ ఇంటర్నెట్‌లో విశ్వవిహారం చేస్తోంది. తల వంచుకుని శిల్పాలు చెక్కుతూ తెరవెనుక ఉండిపోయిన శిల్పకారులు ఈ రోజు యూ ట్యూబ్‌లో ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. జీవితంలో ఎదురైన విషమ పరీక్షకు సమాధానంగా తన జీవితాన్ని తానే చెక్కుకునే క్రమంలో ఆమె ఎంచుకున్న మార్గమే ఆమెను ఈ రోజు ‘శిల్పకారిణి భువనేశ్వరి’గా నిలబెట్టింది.
ఉలి పట్టుకునే నేర్పు
‘పని మీద ధ్యాస పెట్టు. మనసు కుదుట పడుతుంది’ నాన్న అన్న ఈ మాట నా జీవితాన్ని కొత్తగా పట్టాలెక్కించింది అంటోంది శిల్పి భువనేశ్వరి. ‘‘జీవితం మనల్ని పరీక్షించడానికి క్రాస్ రోడ్స్‌లో నిలబెడుతుంది. ఎటువైపు అడుగులు వేయాలో తెలియని అయోమయంలోకి నెట్టేస్తుంది. అలాంటి క్షణంలో నాన్న చెప్పిన మాట నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేటట్లు చేసింది. ఉలి పట్టుకున్నాను. విజేతగా నిలబడగలిగాను. ఈ కళలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ఉలి పట్టుకునే వరకే మనం. శిలను చూస్తూ ఉలి చేతిలోకి తీసుకున్న తర్వాత ఇక ఏ ఇతర ఆలోచనలూ రావు.
అప్పటి వరకు మెదడును కందిరీగల్లా విసిగించిన ఆలోచనలు కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి. తదేక దీక్షతో శిల్పాన్ని చెక్కడంలో మునిగిపోతాం. పని పూర్తయిన తర్వాత కూడా మెదడు మంచి ఆలోచనలతోనే ఉంటుంది. మనకు తెలియని పాజిటివ్ ఎనర్జీ ఆవరిస్తుంది. అలాగే మాకు శిల్పం మీద మమకారం కూడా ఉంటుంది. నేను ఈ వృత్తిలోకి వచ్చిన రెండేళ్లకు కాలిఫోర్నియా నుంచి రాముడి విగ్రహాల సెట్ ఆర్డర్ వచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు విగ్రహాల సెట్. పదకొండు అంగుళాల విగ్రహాలు. చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. వాటిని ఇచ్చేటప్పుడు కొంచెం బాధనిపించింది’’ గుర్తు చేసుకుంది భువనేశ్వరి.
ఒక యాదాద్రి... మరో బుద్ధవనం!
తెలంగాణలో సీయెం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యాదాద్రి నిర్మాణంలో కొంతభాగం పనిని భువనేశ్వరి శిల్పుల బృందం పూర్తి చేసింది. నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్, బుద్ధవనంలో బుద్ధుడి జీవిత చిత్రాల వెనుక భువనేశ్వరి ఉలి నైపుణ్యం ఉంది. ‘‘నేను 2013 నుంచి పూర్తిగా శిల్పకళ మీద దృష్టి పెట్టాను. అప్పటికే మా నాన్న, పెదనాన్న యాదాద్రి పనులు మొదలు పెట్టారు. అలా అంత పెద్ద ప్రాజెక్టులో పని చేసే అవకాశం వచ్చింది.
బుద్ధవనం ప్రాజెక్టు నిర్వహణ స్వయంగా చేపట్టాను. దీనితోపాటు అనేక పనులు సమన్వయం చేయడం మొదలు పెట్టాను. ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్‌కి పుష్కరాల సమయంలో విగ్రహాలు చేశాం. మా శిల్పాలను చూసిన అధికారులు బాగున్నాయని మంచి ఆర్డర్‌లు ఇచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో రాతి బెంచ్‌లు, ఫౌంటెయిన్‌లు ఎన్నింటినో చేశాం. ఈ కరోనా సమయంలో సమూహంగా చేయాల్సిన పెద్ద ప్రాజెక్టులేవీ చేయడం లేదు. ఇళ్లలో షో పీస్‌లుగా విగ్రహాలు పెట్టుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. ఆళ్లగడ్డలోని మా శిల్పకళామందిరంలోనే చిన్న ఆర్డర్‌లు పూర్తి చేస్తున్నాం.
తెర ముందుకు శిల్పులు
మా శిల్పకారులు ఎప్పుడూ తెర వెనుకే ఉంటారు. చిత్రకారులు ఇది నేను వేసిన చిత్రం అని చెప్పుకోవడానికి సంతకం చేస్తారు. శిల్పకారులకు ఆ అవకాశం ఉండదు. అందుకే మా శిల్పకళామందిరంలో పని చేసే శిల్పకారులను వీడియో తీసి ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తుంటాను. మా పనిలో గొప్పదనాన్ని తెలియచేయడానికి నేను చేస్తున్న ఓ చిన్న ప్రయత్నం మంచి ఫలితాలనే ఇస్తోంది. మా శిల్పకారులకు శిలకు ప్రాణం పోయడమే తెలుసు, కళను ప్రమోట్ చేసుకోవడం తెలియదు. ఆ పనిని నేను చేస్తున్నాను.
నన్ను చూసి మా వాళ్లు చాలా మంది వాళ్ల అమ్మాయిలకు కూడా శిల్పాలు చెక్కడం నేర్పిస్తామని చెప్తున్నారు. ఆ మాట నాకు సంతోషాన్నిస్తోంది. శిల్పాలు చెక్కుతున్న తొలి మహిళ గా ఉలిని పట్టుకోవడంతోనో, విశ్వకర్మ ఎక్స్‌లెన్స్, లెజెండరీ అవార్డులను అందుకోవడంతోనో నేను గమ్యాన్ని చేరినట్లు కాదు. మా కళకు ప్రాచుర్యాన్ని, గౌరవాన్ని తీసుకువచ్చే బాధ్యత కూడా చేపట్టాను. అమ్మాయిలను శిల్పకారిణులుగా తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యాన్ని చేరే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది’’ అంటోంది భువనేశ్వరి.
ఆళ్లగడ్డ అమ్మాయి
ఏ దేవాలయానికి వెళ్లినా, చారిత్రక కట్టడాన్ని చూసినా శిల్పసంపదను చూస్తూ మైమరచి పోతాం. రాతికి జీవం పోసిన శిల్పులను అపరబ్రహ్మలుగా కీర్తిస్తాం. యుగాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళాత్మకమైన వృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. మగవాళ్లకు సహాయంగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఆడవాళ్లు. ఈ ఆనవాయితీని మార్చేసింది దురుగడ్డ భువనేశ్వరి. ఇది మగవాళ్ల ప్రపంచం అని చెప్పకుండా చెప్పే ఒక నియమాన్ని సవరించింది. కంటికి కనిపించని ఒక సరిహద్దును చెరిపేసింది. తానే స్వయంగా ఉలి పట్టుకుని శిల్పం చెక్కడం నేర్చుకుంది.
2018లో హైదరాబాద్ పార్క్ హయత్‌లో లేడీ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా...
Comments
Please login to add a commentAdd a comment