సాక్షి, ఆళ్లగడ్డ: '' ప్రేమించానన్నాడు. నువ్వే సర్వస్వమన్నాడు. కాదంటే.. చచ్చిపోతానన్నాడు. నిన్ను, నీ వాళ్లను పువ్వుల్లో పెట్టి సాక్కుంటానని నమ్మబలికాడు. ఇలా ఏడాది పాటు ఆమె చుట్టూ తిరిగాడు. ఇక ఆమె కాదనలేకపోయింది. కుటుంబ సభ్యులను ఒప్పించి అతన్ని మనువాడింది. కానీ ఐదేళ్ల తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది.'' ఇప్పుడు ఆమె న్యాయం కోసం వేడుకుంటోంది.
ఇందుకు సంబంధించిన వివరాలు... ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన ఓబులేసు జియో ఫైబర్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఈ క్రమంలో భర్త చనిపోయి ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటిలో ఉంటున్న ఇంటి యజమాని కుమార్తె విజయ సునీల్ అగర్వాల్‌పై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కాస్త చనువు ఏర్పడ్డాక ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె.. అతన్ని మందలించింది. అయినా వినకుండా వెంటపడ్డాడు. ఆమెతో పాటు పిల్లలను, తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. నీవు లేకుంటే చచ్చిపోతానని బెదిరించాడు.
ఇరుగూ పొరుగు వారితోనూ మాట్లాడి.. ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని వేడుకున్నాడు. అతని మాటలు నమ్మిన వారందరూ ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. అక్కడే ఉంటూ బుద్ధిగా కాపురం చేసేవాడు. వారి కాపురానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా.. ఓబులేసు నాలుగు నెలల క్రితం సొంతూరికి వెళ్లొస్తానని చెప్పి వచ్చాడు. కొన్ని రోజుల పాటు భార్యతో ఫోనులో బాగానే మాట్లాడాడు. త్వరలోనే తిరిగొస్తానని నమ్మించాడు. రానురాను ఫోనులో మాట్లాడాలంటే విసుక్కోవడం, ఎంతకూ ఫోను ఎత్తకపోవడం వంటివి చేసేవాడు. పని ఒత్తిడి వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆమె అనుకుంది. కానీ రెండు వారాల క్రితం ఓబులేసు మిత్రుడొకరు ఫోను చేసి ‘నీ భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంటున్నాడ’ని చెప్పడంతో ఉలిక్కిపడింది.
గత నెల 28న అతను గ్రామంలోనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన విజయ భర్తకు ఫోన్ చేయగా.. తనకు ఇష్టం లేక పోయినా బలవంతంగా పెళ్లి చేశా రని చెప్పాడు. దీంతో ఆమె కుమారుడితో కలిసి ఆళ్లగడ్డకు చేరుకుంది. నాలుగు రోజులుగా అతనితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా కుటుంబ సభ్యులు కుదరనివ్వలేదు. చివరకు గ్రామంలోకి సైతం రానివ్వడం లేదు. ఆళ్లగడ్డలోనే ఉండాలని, అక్కడికే వచ్చి మాట్లాడతామని చెబుతున్నారే తప్ప ఎవరూ రావడంలేదు. దీంతో బాధితురాలు విషయాన్ని మీడియాకు తెలిపింది. తనకు ఇక్కడ ఎవరూ తెలియదని, తెలుగు కూడా రాదని, ప్రజా, మహిళా సంఘా లు సహకరించి న్యాయం చేయాలని వేడుకుంటోంది.
చదవండి: నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం
Comments
Please login to add a commentAdd a comment