పెళ్లికి నిరాకరించిందని బ్లేడ్‌తో ప్రేయసి గొంతు కోశాడు | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిందని బ్లేడ్‌తో ప్రేయసి గొంతు కోశాడు

Sep 6 2023 1:06 AM | Updated on Sep 6 2023 1:40 PM

- - Sakshi

విశాఖపట్నం: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి చేసిన ప్రియుడి సంఘటన పారిశ్రామిక ప్రాంతంలో కలకం రేపింది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

59వ వార్డు నెహ్రూనగర్‌ ప్రాంతంలో లలితశ్రీ(19) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె ఇంటికి సమీపాన నిందితుడు రామారావు(26) ఉంటున్నాడు. ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రామారావు పనీపాటా లేకుండా జులాయిగా కాలం గడిపేయడం లలితశ్రీకి నచ్చలేదు.

ఈ కారణంగా అతను తీసుకొచ్చిన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. కొన్ని రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నా ఆమె ససేమిరా అంది. దీంతో సోమవారం రాత్రి భోజనం చేసి మేడపై వాకింగ్‌ చేస్తున్న ఆమె వద్దకు మరోసారి వెళ్లి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో దాడి చేస్తానని భయపెట్టాడు. వాదనకు దిగాడు.

అయినప్పటికీ అంగీకరించకపోవడంతో బ్లేడ్‌తో ఆమె కంఠం భాగంలో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమె కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు, బంధువులు అక్కడకు చేరుకుని గాయపడిన లలితశ్రీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ సీఐ జి.డి.బాబు ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement