సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మఠం, దేవదాయ శాఖ అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో భక్తులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శతాబ్దాలుగా తమ ఆధ్వర్యంలోనే దేవస్థానం నడుస్తోందని, సర్వహక్కులు తమవే అని మఠం అధికారులు అంటుండగా.. దశాబ్దాలుగా ఇక్కడ దేవదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలోనే ఈఓ ఉంటూ సిబ్బందిని నియమించి పరిపాలన కొనసాగిస్తున్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరివురి మధ్య ఆధిపత్య పోరులో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎవరి దారి వారిదే...
దేవస్థానంలో సాగుతున్న ఆధిపత్య పోరుతో ఎవరిదారి వారిదే అయింది. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని సుమారు 20 ఏళ్లకు పైగా దేవస్థానంలో పనిచేస్తున్న పావన, సురేంద్ర అనే ఇద్దరు సీనియర్ సిబ్బందికి ఈ నెల వేతనం పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా వారిని విధుల నుంచి తొలగించేందుకు మఠం వర్గాలు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు మఠం నుంచి ఆర్డర్ కాపీ తయారు చేసి ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోలేదు. తాము దేవస్థాన సిబ్బందిగా ఈఓ చెప్పినట్లు నడుచుకుంటున్నాం.. తప్ప తమ సొంత నిర్ణయం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితే వస్తుందని సిబ్బందిని, పూజార్లను మఠం అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దేవదాయ తరఫున ఆరుగు సిబ్బందిని నియమించగా.. తమ అనుమతి లేదంటూ మఠం అధికారులు వారికి వేతనాలు ఇవ్వలేదు. దీనికి తోడు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం రూ. 4000, రూ.5000 మాత్రమే వేతనం ఇస్తున్నారు. మఠం తరఫున ఈ మధ్య నియమించుకున్న సిబ్బందికి మాత్రం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు జీతం ఇస్తున్నారని దేవస్థాన వర్గాలు ఆరోపిస్తున్నాయి.
సందట్లో సడేమియా..
దేవదాయ, మఠం అధికారుల మధ్య ఆధిపత్య పోరు కొందరి సిబ్బందికి కలసి వస్తోంది. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు డ్యూటీలు వేసుకుంటూ..అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా 20 రోజుల నుంచి హుండీ డబ్బులు, టిక్కెట్ సొమ్ములు, వెండి, బంగారు కానుకలు సైతం కొందరు సిబ్బంది జమ చేయకుండా దగ్గర ఉంచుకున్నట్లు సమచారం. గతంలో మాదిరిగా రోజూ సాయంత్రం జమ చేయకుండా ఎక్కడ ఉంచుతున్నారో కూడా చెప్పలేదనే మఠం ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
ప్రేక్షక పాత్రలో దేవదాయ శాఖ
ఈఓ పాలన తమకు వద్దు అంటూ ఖరాకండిగా చెపుతుండటంతో పాటు ఇక్కడి ఖర్చు, ఆదాయానికి సంబంధించి అంతా మఠం స్వాధీనం చేసుకుంది. కేవలం ఈఓ పేక్షక పాత్రలో ఉన్నట్లుగా ఉంది. కనీసం ఓ రూపాయి ఖర్చుపెట్టాలన్న మఠం అనుమతి తప్పనిసరి. ఈఓ ఎక్కడికైనా కారులో వెళ్లాలన్నా మఠం అనుమతి తీసుకుని ఓచర్ రాసి డబ్బులు ఇప్పించుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా.. దేవదాయ ధర్మదాయ శాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు.
సరైన సమాధానం చెప్పనందుకే చర్యలు
టిక్కెట్, హుండీ సొమ్ములు అందరూ వచ్చి కార్యాలయంలో జమ చేస్తున్నారు. అయితే ఇద్దరు ఉద్యోగులు 20 రోజుల నుంచి వీటిని ఎక్కడ పెడుతున్నారో చెప్పడం లేదు. దీనిపై మెమో ఇస్తే సరైన సమాధానం చెప్పలేదు. ఈఓ జమ చేయమన్నాడని చెబుతున్నారు. అదే రాసివ్వమంటే రాసివ్వడంలేదు. దీంతో జమ చేసుకున్న పవన్, సురేంద్రల వేతనం నిలిపివేశాం. ఇద్దరిని సస్పెండ్ చేసేందుకు ఆర్డర్ తయారు చేసి ఇస్తుంటే వారు తీసుకోలేదు. దీనిపై మఠం ఉన్నత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
– భద్రినారాయణ్, మఠం మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment