Ahobilam temple
-
పెన్నహోబిలంలో విషాదం..వెలికి తీసేలోపు..
సాక్షి, ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న జలపాతంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.... బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లికి చెందిన గోపాలకృష్ణారెడ్డి, హిమబిందు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహిత (14) అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో గురువారం ఉదయం పిల్లలను పిలుచుకుని తల్లి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చింది. ఆలయంలో పూజలు ముగించుకుని దిగువన ఉన్న జలపాతం వద్దకు చేరుకున్నారు. సెల్‌ఫోన్‌తో సరదాగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో జలపాతానికి ఎగువన పిల్లలు వరుసగా నిలబడి ఉండగా తల్లి ఫొటో తీసింది. అదే సమయంలో నీళ్లలో ఉన్న పాచి పట్టిన రాతిపై కాలు పెట్టిన మహిత ఒక్కసారిగా జారిపడి జలపాతం దిగువకు కొట్టుకుపోయింది. గమనించిన తల్లి ఒక్కసారిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడంతో కొందరు యువకులు జలపాతంలోకి దూకి మహిత కోసం గాలింపు చేపట్టారు. అప్పటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మహితను జలపాతానికి ఫర్లాంగు దూరంలో యువకులు గుర్తించి వెలికి తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని మహితను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: నా చావుకు ఎవరూ కారణం కాదు! అంటూ సెల్ఫీ వీడియో పంపి..) -
‘తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు’
సాక్షి, కర్నూలు : కరోనా వల్ల దేశం ఉపశమనం పొందాలని పూజలు చేయడానికి అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి వెళ్తే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. గుడిని బలవంతంగా తెరిపించామని ఆరోపణలు చేయడం దుర్మార్గమైన ఆలోచన అని, అలాంటి మాటలు పక్కన పెట్టాలని విమర్శించారు. జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై నిప్పులు చెరిగారు. (కరోనాపై నిర్లక్ష్యం తగదు: జిన్‌పింగ్ ) తాటాకు చప్పుళ్ళకు, పనికిరాని ఆలోచనలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిన ఘనత తమ కుటుంబానిది అని దుయ్యబట్టారు. పోలీసులు అరెస్టు చేస్తారని బయంతో బయట రాష్ట్రంలో కూర్చున్నారని అఖిలప్రియపై విమర్శలు గుప్పించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత తమకు లేదని, అఖిలప్రియకు, తమ కుటుంబానికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. (షాకింగ్: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు ) -
అహోబిలంలో ఆధిపత్య పోరు
సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మఠం, దేవదాయ శాఖ అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో భక్తులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శతాబ్దాలుగా తమ ఆధ్వర్యంలోనే దేవస్థానం నడుస్తోందని, సర్వహక్కులు తమవే అని మఠం అధికారులు అంటుండగా.. దశాబ్దాలుగా ఇక్కడ దేవదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలోనే ఈఓ ఉంటూ సిబ్బందిని నియమించి పరిపాలన కొనసాగిస్తున్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరివురి మధ్య ఆధిపత్య పోరులో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరి దారి వారిదే... దేవస్థానంలో సాగుతున్న ఆధిపత్య పోరుతో ఎవరిదారి వారిదే అయింది. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని సుమారు 20 ఏళ్లకు పైగా దేవస్థానంలో పనిచేస్తున్న పావన, సురేంద్ర అనే ఇద్దరు సీనియర్ సిబ్బందికి ఈ నెల వేతనం పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా వారిని విధుల నుంచి తొలగించేందుకు మఠం వర్గాలు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు మఠం నుంచి ఆర్డర్ కాపీ తయారు చేసి ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోలేదు. తాము దేవస్థాన సిబ్బందిగా ఈఓ చెప్పినట్లు నడుచుకుంటున్నాం.. తప్ప తమ సొంత నిర్ణయం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితే వస్తుందని సిబ్బందిని, పూజార్లను మఠం అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దేవదాయ తరఫున ఆరుగు సిబ్బందిని నియమించగా.. తమ అనుమతి లేదంటూ మఠం అధికారులు వారికి వేతనాలు ఇవ్వలేదు. దీనికి తోడు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం రూ. 4000, రూ.5000 మాత్రమే వేతనం ఇస్తున్నారు. మఠం తరఫున ఈ మధ్య నియమించుకున్న సిబ్బందికి మాత్రం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు జీతం ఇస్తున్నారని దేవస్థాన వర్గాలు ఆరోపిస్తున్నాయి. సందట్లో సడేమియా.. దేవదాయ, మఠం అధికారుల మధ్య ఆధిపత్య పోరు కొందరి సిబ్బందికి కలసి వస్తోంది. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు డ్యూటీలు వేసుకుంటూ..అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా 20 రోజుల నుంచి హుండీ డబ్బులు, టిక్కెట్ సొమ్ములు, వెండి, బంగారు కానుకలు సైతం కొందరు సిబ్బంది జమ చేయకుండా దగ్గర ఉంచుకున్నట్లు సమచారం. గతంలో మాదిరిగా రోజూ సాయంత్రం జమ చేయకుండా ఎక్కడ ఉంచుతున్నారో కూడా చెప్పలేదనే మఠం ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రేక్షక పాత్రలో దేవదాయ శాఖ ఈఓ పాలన తమకు వద్దు అంటూ ఖరాకండిగా చెపుతుండటంతో పాటు ఇక్కడి ఖర్చు, ఆదాయానికి సంబంధించి అంతా మఠం స్వాధీనం చేసుకుంది. కేవలం ఈఓ పేక్షక పాత్రలో ఉన్నట్లుగా ఉంది. కనీసం ఓ రూపాయి ఖర్చుపెట్టాలన్న మఠం అనుమతి తప్పనిసరి. ఈఓ ఎక్కడికైనా కారులో వెళ్లాలన్నా మఠం అనుమతి తీసుకుని ఓచర్ రాసి డబ్బులు ఇప్పించుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా.. దేవదాయ ధర్మదాయ శాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు. సరైన సమాధానం చెప్పనందుకే చర్యలు టిక్కెట్, హుండీ సొమ్ములు అందరూ వచ్చి కార్యాలయంలో జమ చేస్తున్నారు. అయితే ఇద్దరు ఉద్యోగులు 20 రోజుల నుంచి వీటిని ఎక్కడ పెడుతున్నారో చెప్పడం లేదు. దీనిపై మెమో ఇస్తే సరైన సమాధానం చెప్పలేదు. ఈఓ జమ చేయమన్నాడని చెబుతున్నారు. అదే రాసివ్వమంటే రాసివ్వడంలేదు. దీంతో జమ చేసుకున్న పవన్, సురేంద్రల వేతనం నిలిపివేశాం. ఇద్దరిని సస్పెండ్ చేసేందుకు ఆర్డర్ తయారు చేసి ఇస్తుంటే వారు తీసుకోలేదు. దీనిపై మఠం ఉన్నత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – భద్రినారాయణ్, మఠం మేనేజర్ -
గోవిందా..హుండీ సొమ్ము మాదంటే మాది!
అహోబిలంలో మఠం, దేవదాయ ధర్మదాయ శాఖల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నో ఏళ్లుగా మఠం, దేవదాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పాలనపై మఠం వర్గాలకు నచ్చలేదు. తమ పాలన తామే చేసుకుంటామని కోర్టును ఆశ్రయించడమే గాకుండా రాష్ట్రస్థాయి అధికారులను ఒప్పించి తమకు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవసరం లేదని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్టేటస్ కో ఉత్తర్వులను (ఇప్పుడు ఎలా ఉంటే అలాగే పరిపాలన కొనసాగించుకోండి) కోర్టు ఇచ్చింది. ఇలా మూడు నెలలకు పైగా రెండు వర్గాలు ఎత్తులకు, పై ఎత్తులు వేస్తుండటంతో అంతర్గతపోరు తారాస్థాయికి చేరింది. సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : అహోబిల క్షేత్రంలో వివాదాలు ముదురుతున్నాయి. మఠం, దేవదాయ ధర్మదాయ శాఖ.. పాలన తమేదనంటూ కోర్టును అశ్రయించారు. ప్రస్తుతం పాలన వ్యవహారాలను మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల చర్యలతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేటస్ కో పై ఎవరి వాదన వారిదే.. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో గతంలో ఇక్కడ ఈఓ పరిపాలన ఎలా ఉందో అలా చేసుకోమనే ఇచ్చిందని.. మఠం వారు అడ్డుకుంటున్నారని ఈఓ వాదిస్తుండగా, కాదు స్టేటస్ కో ఇచ్చేటప్పటికి (ఆరోజుకు) ఎలా ఉందో అలానే పరిపాలన కొనసాగించుకోవాలని ఇచ్చిందని దీంతో స్టే ఇచ్చే రోజుకు ఈఓ పరిపాలన లేదని న్యాయస్థానంలో సమస్య పరిష్కారమయ్యే వరకు అలానే కొనసాగిస్తామని మఠం ప్రతినిధులు చెబుతున్నారు. తారాస్థాయికి చేరుకున్న కుమ్ములాటలు.. మొన్నటి వరకు దేవస్థాన, మఠం వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు తాజాగా దేవుడి హుండీ సొమ్ములు బ్యాంకులో జమ చేసే విషయంలో ఇరు వర్గాలు బుధవారం రాత్రి రోడ్డెక్కాయి. రెండు రోజుల పాటు నవనారసింహ క్షేత్రాల్లో హుండీ సొమ్ముల లెక్కింపు చేపట్టారు. లెక్కించిన నగదు దిగువ అహోబిలం బ్యాంక్ అధికారులు అక్కడికే వచ్చి ఖాతాలో జమ చేసుకుంటారు. ఈ క్రమంలో జమ చేసుకునేందుకు వచ్చిన బ్యాంక్ అధికారులు నగదును అహోబిల మఠం ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఖాతాలో జమ చేసుకుంటుండగా.. అందులో ఎలా జమ చేస్తారు.. ఈఓ ఆధ్వర్యంలోని దేవస్థాన ఖాతాలో జమ చేయాలని ఈఓ మల్లికార్జున ప్రసాద్ అడ్డుతగిలారు. దీంతో మఠం మేనేజర్ స్పందిస్తూ..కాదు తమ ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. దీంతో కొంత సేపు వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. ఏం చేయాలో దిక్కుతెలియని బ్యాంక్ అధికారులు, పెద్ద మనుషుల సూచనల మేరకు సస్పెన్స్ ఖాతా తెరిచి జమ చేశారు. గతంలో కూడా ఈఓ ఆధ్వర్యంలో ఎగువ అహోబిలంలో నిత్యన్నదాన సత్రం ప్రారంభించగా తమ అనుమతి లేకుండా ఎలా ప్రారంభిస్తారని.. అన్నప్రసాద సత్రానికి సరుకులు ఇవ్వద్దని మఠం ప్రతినిధులు ఆదేశించడంతో ఈఓ భక్తుల సహాయంతో సత్రం నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ఈఓ కొందరు తాత్కలిక సిబ్బందిని నియమించారు. తమను సంప్రదించకుండా ఎలా ఉద్యోగాలిస్తారని, వారికి తామెందుకు వేతనాలివ్వాలని మఠం ప్రతినిధులు వేతనాలు నిలిపివేశారు. అనంతపురం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్న మాన్యంను వేలం వేసేందుకు సిబ్బందిని కారులో పంపగా.. అందుకయ్యే ఖర్చులను తాము ఇవ్వమని తెగేసి చెప్పారు. ఇలా రోజుకో ఘటనతో నిత్యం ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మఠం ఆధ్వర్యంలోనే పాలన.. గతంలో పనిచేసిన ఈఓ చేసిన అక్రమాలను, స్వామి సొమ్ములు దుర్వినియోగం చేసిన వైనం.. ఆమె కొనసాగించిన నిర్లక్ష్య పాలనతో పాటు దేవస్థాన ఈఓగా ఉంటూ జైలుకు వెళ్లిన ఘటనలను మఠం ప్రతినిధులు ఉన్నతస్థాయి అధికారులకు వివరించడంలో సఫలీ కృతులయ్యారు. ఇదే సాకుగా చూపి దేవస్థాన పరువు, ఆదాయం రెండూ పోతున్నాయని ఉన్నతస్థాయి నుంచి సిఫారసు చేయించుకొని ఈఓను బదీలీ చేయించి పరిపాలనను చేతిలోకి తీసుకొని మేనేజర్‌ను నియమించారు. ప్రస్తుతం పాలన మొత్తం మఠం ఆధ్వర్యంలోనే ఉంది. ఎప్పటిలాగే జమ చేయమని చెప్పాం మఠం ఖాతాలో జమ చేయమని చెప్పలేదు. పూర్వం నుంచి ఎలా జమ చేస్తున్నారో అలానే దేవస్థానం ఖాతకు జమ చేయమని చెప్పాం. ఈ ఖాతా ఆళ్లగడ్డలో ఆంధ్రాబ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. ఈ ఖాతాలో ఉన్న సొమ్మును ఎవరు పడితే వారు తీయడానికి ఉండదు. మఠం పీఠాధిపతికి మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని అవకతవకలు జరగడంతో ఈఓ అకౌంట్ రద్దు చేయించాం. – బద్రీనారాయణ్, అహోబిల మఠం మేనేజర్ 1961 నుంచి తమ పాలన ఉంది 1961నుంచి అహోబిలంలో దేవదాయ ధర్మదాయ శాఖ పరిపాలన కొనసాగుతోంది. మరి ఇప్పుడు ఎందుకు తమ పాలన ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి హుండీ ఆదాయం సస్పెన్సన్ అకౌంట్లో జమ చేశారు. ప్రస్తుతం హుండీ లెక్కింపు సొమ్మును తమ ఖాతాలో జమ కాకుండా చేయడం సరికాదు. – మల్లికార్జున ప్రసాద్, ఈఓ -
నిధులు ఉన్నా...అహోబిలేశా!
సాక్షి, అహోబిలం (ఆళ్లగడ్డ): అహోబిల లక్ష్మీనారసింహుడు ఎందరో భక్తుల ఇష్టదైవం. వివిధ ప్రాంతాల నుంచి ఏటా లక్షలాది మంది స్వామి దర్శనానికి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కుకుని ముడుపులు కుడుతారు. భక్తులకు, అన్నార్థులకు అన్నదానం చేస్తే మహా పుణ్యం వస్తుందని ఇక్కడి పండితులు చేసే ప్రవచనాలకు ప్రభావితమై అన్నదాన పథకానికి లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తారు. ఇలా యేటా కోటిరూపాయల దాక వస్తుంటాయి. ఇంత భారీగా నిధులు వస్తున్నా అన్నప్రసాదం తయారీ విషయంలో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడి భోజనం తిని పలువురు భక్తులు నిత్యం అస్వస్థతకు గురవుతున్నా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మొక్కుబడి బియ్యం, బేడలతోనే వంట స్వామి, అమ్మవారికి మొక్కుబడిలో భాగంగా భక్తులు బియ్యం, బేడలు సమర్పించడం ఆనవాయితీ. ఒక్కో భక్తుడు ఒక్కో రకం బియ్యం తీసుకు వచ్చి హుండీలో పోస్తుంటాడు. ఈ మధ్యం కాలంలో చాలా మంది స్టోర్ బియ్యం సమర్పిస్తున్నారు. వాటిని మఠం సిబ్బంది, అధికారులు సంచుల్లో పోసి ఓ గదిలో మూలన పడేస్తారు. అక్కడ ఎలుకలు, కొక్కులు తిరుగుతుంటాయి. తర్వాత ఆ బియ్యం, బేడలను శుభ్రం చేయకుండానే అన్నం, పప్పు చేసి భక్తులకు వడ్డిస్తున్నట్లు సమాచారం. దీంతో అన్నం గంజికట్టుకు పోయి, మెత్తబడి ఉంటుంది. దేవుడి ప్రసాదం కావడంతో ఆ అన్నం పారవేయలేక అలాగే తింటున్నట్లు భక్తులు చెబుతున్నారు. ఇక పప్పు మరీ అధ్వానంగా ఉంటుంది. పప్పుగుత్తి లేదని ఎనపకుండనే కందిబేడలు, ఆకు ఉడకబెట్టి వడ్డిస్తున్నారు. తర్వాత అది అజీర్ణం కాక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సాంబరు కూడా ఇక్కడ రంగునీళ్ల మాదిరిగా ఉంటుందని వారు చెబుతున్నారు. కోట్లలో నిధులు.. వందల్లో ఖర్చు మీ పేరు మీద అన్నదానం నిర్వహిస్తామంటూ ఎగువ, దిగువ, పావణ నరసింహ స్వామి గుళ్లదగ్గర ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసుకుని భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తుంటారు. ఈ విరాళాలేకాక మొక్కుబడి ఉన్న భక్తులు కార్యాలయంలో సంప్రదించి లక్షల రూపాయలు నేరుగా లేదా చెక్కుల రూపంలో అందజేస్తుంటారు. ప్రస్తుతం రూ. 6 కోట్ల మేర అన్నదాన నిధి నిల్వ ఉన్నట్లు సమాచారం. గత ఒక యేడాదే సుమారు రూ. 2.5 కోట్లు విరాళాల రూపంలో వచ్చినట్లు సమాచారం. ఇంత భారీగా విరాళాలు వస్తున్నా భక్తులకు రోజు వందల రూపాయల్లో కూడా ఖర్చు పెట్టి అన్నప్రసాదం పంపిణీ చేయలేక పోతున్నారు. రోజుకు 50 మందికి మాత్రమే భోజనం టోకన్లు ఇస్తున్నారు. -
అహోబిలం అభివృద్ధికి సహకారం
ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన అహోబిల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. నవనారసింహులును దర్శించుకోవడానికి మంగళవారం రాత్రి దిగువ అహోబిలం చేరుకుని స్థానిక మలోల అతిథి గృహంలో బస చేసిన గవర్నర్ దంపతులు.. బుధవారం వేకువజామునే దిగువ అహోబిలంలో కొలువైన శ్రీప్రహ్లాద వరదస్వామి దివ్యదర్శన పూజలో పాల్గొన్నారు. అనంతరం ఎగువ అహోబిలం చేరుకుని.. శ్రీ జ్వాలా నారసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూజలు చేశారు. తర్వాత కాలినడకన వెళ్లి నల్లమలలో వెలసిన జ్వాలా క్షేత్రాన్ని సందర్శించారు. తిరిగి దిగువ అహోబిలం చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదల్లో భాగంగా తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. -
అంతా ఇష్టారాజ్యం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో కొందరి సిబ్బంది, అర్చకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. క్షేత్రంలో వరుస సంఘటనలు జరుగుతున్నా అడిగే నాథుడే లేడు. ఈ నెల 15వ తేదీ నుంచి పార్వేట ఉత్సవాలు మొదలయ్యాయి. పల్లకి వెంట హుండీ పెట్టడం ఆనవాయితీ. ఈ హుండీ నిండిన వెంటనే సీలు చేసి భద్రపరిచి ఆ హుండీ స్థానంలో మరో హుండీ పెట్టాలి. జిల్లా స్థాయి అధికారుల అనుమతి తీసుకుని అధికారి పర్యవేక్షకుని సమక్షంలో హుండీ సీలు తీసి అందులోని కానుకలు లెక్కించి రికార్డులో నమోదు చేయాలి. ఈ విధానం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ విధానికి ఆదివారం ఆలమూరు గ్రామాంలో తూట్లు పొడిచారు. పార్వేట పల్లకి హుండీని పల్లకి వెంట ఉండే సిబ్బంది సీలు పగుల కొట్టి అందులోని కానుకలు వేరే డబ్బాలోకి మార్చుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అహోబిలేశుడి పార్వేట పల్లకి వెంట ఉండే సిబ్బంది పెత్తనం పెచ్చుమీరుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ కుమార్‌ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని, హుండీ సీలు తీసిన విషయంపై విచారణ చేపడుతామన్నారు. -
దేవదేవుడు.. కొందరివాడు!
నిరుపేదలకు దూరదర్శనం రూ.50 టిక్కెట్ తీసుకుంటేనే స్వామి సన్నిధికి.. వీరికే హారతి, తీర్థప్రసాదం రూ.10 భక్తులకు కనిపించని స్వామి నిరాశతో వెనుదిరుగుతున్న భక్తులు ఆళ్లగడ్డ టౌన్ : దేవుని దృష్టిలో అందరూ సమానమే. దూర దర్శనం.. సర్వదర్శనం.. ప్రత్యేక దర్శనం.. ఇలాంటివెన్ని ఉన్నా.. స్వామి వద్దకు వచ్చే సరికి అందరినీ ఒకేలా చూడాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పేద, ధనిక భక్తులను రెండుగా విభజించి మనోభావాలను దెబ్బతీయడం చర్చనీయాంశమవుతోంది. నిరుపేదలు కనీసం గర్భగుడి గడప తాకేందుకు కూడా అవకాశం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ తేడా పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న భక్తులు పలువురు ఆలయ అధికారుల తీరును నిరసించారు. వీఐపీ టిక్కెట్ తీసుకున్నా.. క్యూలో నిల్చోకుండా నేరుగా స్వామి వద్దకు పంపుతారే తప్ప, ఇలా డబ్బు ఎక్కువగా ఇచ్చిన వారిని మాత్రమే స్వామి సన్నిధికి తీసుకెళ్లడం ఏమిటని వారు ప్రశ్నించారు. పైగా వీరికి మాత్రమే అర్చన, హారతి, తీర్థం, శఠగోపంతో ఆశీర్వదించడం వివాదాస్పదమవుతోంది. రూ.10 టిక్కెట్ తీసుకున్న సామాన్య భక్తులను చాలా దూరం నుంచి లోపలకు వెళ్లిన వెంటనే క్షణాల్లో బయటకు పంపేయడం విమర్శలకు తావిస్తోంది. వీరికి మూలవిరాట్ లక్ష్మీనరసింహ స్వామి సరిగ్గా కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. రూ.50 టిక్కెట్ తీసుకున్న గర్భగుడిలోకి వెళ్లిన భక్తులు స్వామికి అడ్డంగా నిల్చొని కుటుంబ సభ్యుల గోత్రాలు, నక్షత్రాలు చెప్పి అర్చన చేయించుకుంటుండటంతో సామాన్యు భక్తులకు స్వామి దర్శనభాగం లభించడం లేదు. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నరసింహ స్వామి నామస్మరణతో తమ భాగ్యం ఇంతేనని సరిపెట్టుకుంటున్నారు. ఇదిలాఉంటే ఆలయ ఆవరణలో ఏ టిక్కెట్ తీసుకుంటే.. ఎలాంటి దర్శనం కల్పిస్తారనే సమాచారం ఎక్కడా లేకపోవడం కూడా భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భక్తులకు ఇబ్బంది కలగనీయం: గాయత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రూ.50 టిక్కెట్ తీసుకుంటే స్వామి సన్నిధికి తీసుకెళ్లి పూజలు చేయించడం.. రూ.10 టిక్కెట్ తీసుకున్న భక్తులకు గుడి బయట తీర్థం ఇస్తున్న విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. స్వామి దృష్టిలో భక్తులంతా సమానమే. ఆ మేరకు చర్యలు చేపడతాం.